నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ నేడు
రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
డిఫెండింగ్ చాంపియన్ భారత్ హ్యాట్రిక్ విజయాలతో సూపర్8కు చేరుకుంది. మూడు మ్యాచ్‌ల్లోనూ టీమ్ ఇండియా అలవోక విజయాలే సాధించినా… సూర్యసేన ఆటతీరు మాత్రం అనుకున్న విధంగా లేదు. గ్రూప్ దశలో ఆఖరు మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపిస్తూ పరుగుల పండుగ చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. అహ్మదాబాద్‌లో భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్ నేడు.
నవతెలంగాణ-అహ్మదాబాద్
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను సొంతగడ్డపై ఫేవరేట్‌గా మొదలెట్టిన డిఫెండింగ్ చాంపియన్.. అందుకు తగ్గట్టుగానే దంచికొడుతుంది. గ్రూప్ దశలో టీమ్ ఇండియాకు తిరుగులేదు. యుఎస్ఏ, నమీబియా, పాకిస్తాన్‌పై సూర్యసేన పంజా విసిరింది. వరుస విజయాలు సాధించినా, అనుకున్న రీతిలో ఆడలేదనే అసంతృప్తి ఇటు ఆటగాళ్లలో, అటు అభిమానుల్లో ఉండిపోయింది. సూపర్8 హంగామాకు ముందే ఆ ముచ్చటా తీర్చేందుకు సూర్యసేన సై అంటోంది. భారీ స్కోర్ల వేదిక అహ్మదాబాద్‌లో నేడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. నేటి మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. పరుగుల సునామీ లాంఛనమే.
అభిషేక్ మెరిసేనా?
ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదు. కానీ టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ సవారీ సాఫీగా మొదలుకాలేదు. తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డక్, ఆ తర్వాత కడుపులో నొప్పితో నమీబియాతో మ్యాచ్‌కు దూరం. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 4 బంతుల్లో డకౌట్. ఈ గణాంకాలు, సున్నా పరుగుల స్కోర్లు అభిషేక్ శర్మ నైపుణ్యం, దూకుడుపై అనుమానాలు రేకేత్తించలేవు.
కానీ సూపర్8 సవాల్లో.. గ్రూప్ దశలో పరుగులు చేయని భారం అభిషేక్ శర్మపై ఉండకూడదు. అందుకే, నేడు నెదర్లాండ్స్‌పై అభిషేక్ శర్మ పరుగుల దాహం తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబె సూపర్ ఫామ్‌లో ఉండగా.. హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, రింకు సింగ్‌లు మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. అహ్మదాబాద్ పిచ్ పేస్‌కు అనుకూలిస్తుంది. దీంతో కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులో నిలువనున్నాడు. వరుణ్ చక్రవర్తి, జశ్‌ప్రీత్ బుమ్రా భారత్‌కు బంతితో కీలకం కానున్నారు.
పోటీ ఇవ్వాలని..
నెదర్లాండ్స్ గ్రూప్ దశలో 3 మ్యాచ్‌ల్లో ఓ విజయం సాధించింది. ఓడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థిని భయపెట్టింది. పసికూన పేరు నుంచి దూరం జరగాలనే తపన నెదర్లాండ్స్ శిబిరంలో కనిపిస్తోంది. అగ్ర జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్న నెదర్లాండ్స్.. టాస్ నెగ్గితే తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ జట్టులో మైకల్ లెవిట్, కొలిన్, స్కాట్ ఎడ్వర్డ్స్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్‌లు కీలకం.



