– రాయల్స్‌పై 4 వికెట్లతో గెలుపు
– ఛేదనలో మెరిసిన రింకు సింగ్
– రాజస్తాన్ 155/9 కోల్‌కతా 161/6
ఎట్టకేలకు కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలుపు రుచి చూసింది. ఈడెన్‌గార్డెన్స్‌లో స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్లో 7 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్‌కు ఇదే తొలి విజయం. ఛేదనలో రింకు సింగ్ (53 నాటౌట్) అజేయ అర్థ సెంచరీతో రాణించాడు. రాజస్తాన్ రాయల్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.
నవతెలంగాణ-కోల్‌కతా
ఐపీఎల్19లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు గెలుపు ఖాతా తెరిచింది. సీజన్లో తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించని కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఈడెన్‌గార్డెన్స్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ఓ విజయం సాధించింది. 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఛేదించి ఎట్టకేలకు గెలుపు ఊరట దక్కించుకుంది. రింకు సింగ్ (53 నాటౌట్, 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో కోల్‌కతాను గెలుపు తీరాలకు చేర్చాడు. అనుకూల్ రారు (29 నాటౌట్, 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లు కార్తీక్ త్యాగి (3/22), వరుణ్ చక్రవర్తి (3/14), సునీల్ నరైన్ (2/26) మ్యాజిక్ చేశారు. రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (46, 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (39, 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలం అయ్యారు. మూడు వికెట్లతో మాయాజాలం చేసిన వరుణ్ చక్రవర్తి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. సీజన్లో తొలి 4 మ్యాచ్‌ల్లో గెలుపొందిన రాజస్తాన్ రాయల్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.
రింకు అదుర్స్
కోల్‌కతా లక్ష్యం చిన్నదే. ఈడెన్‌గార్డెన్స్‌లో ఛేదన అదనపు అనుకూలత. కానీ, టాప్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. టిమ్ సీఫర్ట్ (0), అజింక్య రహానె (0), రఘువంశీ (10) దారుణంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (27, 13 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రోవ్మాన్ పావెల్ (23, 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఎదురుదాడి చేసినా వికెట్లు కోల్పోయారు. 11 ఓవర్లలో 73/5తో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓటమి కోరల్లో కూరుకుంది. ఈ సమయంలో రింకు సింగ్ వ్యక్తిగత స్కోరు 8 వద్ద సింపుల్ క్యాచ్‌ను బర్గర్ వదిలేశాడు. అప్పటికి కోల్‌కతా 54 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది. జీవనదానం లభించటంతో రింకు సింగ్ రెచ్చిపోయాడు. అజేయ అర్థ సెంచరీతో విజృంభించాడు. 2 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో కదం తొక్కాడు. లోయర్ ఆర్డర్లో రమణ్‌దీప్ సింగ్ (10), అనుకూల్ రారు (29 నాటౌట్) రింకు సింగ్‌కు చక్కటి సహకారం అందించారు. అనుకూల్ రారుతో కలిసి ఏడో వికెట్‌కు అజేయంగా 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రింకు సింగ్.. నైట్‌రైడర్స్‌కు సీజన్లో తొలి విజయాన్ని అందించాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా (2/8) మాయ చేయగా.. జోఫ్రా ఆర్చర్, బర్గర్, బిష్ణోరు, యశ్ రాజ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఓపెనర్లు మెరిసినా..
ఈడెన్‌గార్డెన్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం అందించారు. వైభవ్ సూర్యవంశీ (46), యశస్వి జైస్వాల్ (39) తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలో 81 పరుగులు జోడించారు. వైభవ్ సూర్యవంశీ మెరుపులతో పవర్‌ప్లేలోనే రాయల్స్ 63 పరుగులు జోడించింది. యశస్వి జైస్వాల్ ధనాధన్ జోరు చూపించలేదు, కానీ వైభవ్‌కు చక్కటి సహకారం అందించాడు. 2 సిక్స్‌లు, 4 ఫోర్లతో కదం తొక్కాడు. ఓపెనర్ల జోరుతో భారీ స్కోరు దిశగా సాగుతున్న రాయల్స్‌కు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, పేసర్ కార్తీక్ త్యాగి ముకుతాడు వేశారు. చెరో మూడు వికెట్లు పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాసించారు. ధ్రువ్ జురెల్ (5), రియాన్ పరాగ్ (12), షిమ్రోన్ హెట్మయర్ (15), డొనొవన్ ఫెరీరా (7), రవీంద్ర జడేజా (9) పరుగుల వేటలో విఫలమయ్యారు. టెయిలెండర్లు ఆర్చర్ (8), రవి బిష్ణోరు (0), బ్రిజేశ్ శర్మ (1 నాటౌట్) సైతం ఆఖర్లో ధాటిగా ఆడలేకపోయారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులకే పరిమితమైంది. తొలి పది ఓవర్లలో 95 పరుగులు చేసి ఓ వికెట్ కోల్పోయిన రాయల్స్… తర్వాతి పది ఓవర్లలో 8 వికెట్లు చేజార్చుకుని కేవలం 60 పరుగులే చేసింది. పవర్‌ప్లే తర్వాత నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, పేసర్ కార్తీక్ త్యాగి రాయల్స్‌ను గొప్పగా కట్టడి చేశారు.
సంక్షిప్త స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ : 155/9 ( వైభవ్ సూర్యవంశీ 46, యశస్వి జైస్వాల్ 39, వరుణ్ చక్రవర్తి 3/14, కార్తీక్ త్యాగి 3/22)
కోల్‌కతా నైట్‌రైడర్స్ : 161/9 (రింకు సింగ్ 53, అనుకూల్ రారు 29, రవీంద్ర జడేజా 2/8, యశ్‌రాజ్ 1/25)



