Sunday, April 19, 2026
E-PAPER
Homeఆటలుసూపర్‌కింగ్స్‌ చిత్తు!

సూపర్‌కింగ్స్‌ చిత్తు!

- Advertisement -

– 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ గెలుపు
– విజృంభించిన ఈషన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌
– అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌ అర్థ సెంచరీలు
హైదరాబాద్‌ 194/9, చెన్నై 184/8

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మూడో విజయం సాధించింది. పసుపు సంద్రాన్ని తలపించిన ఉప్పల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై 10 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించింది. 195 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్‌ బౌలర్లు ఈషన్‌ మలింగ (3/29), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (2/31) విజంభించటంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ 184 పరుగులకే పరిమితమైంది. అభిషేక్‌ శర్మ (59), హెన్రిచ్‌ క్లాసెన్‌ (59) అర్థ సెంచరీలతో తొలుత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 194 పరుగులు చేసింది. సీజన్లో ఆరు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కు ఇది మూడో విజయం.
నవతెలంగాణ-హైదరాబాద్‌
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు మరోసారి మెప్పించారు. చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఛేదనలో కట్టడి చేసి 10 పరుగుల తేడాతో సీజన్లో మూడో విజయాన్ని అందించారు. పేసర్లు ఈషన్‌ మలింగ (3/29), నితీశ్‌కుమార్‌ రెడ్డి (2/31) సహా శివాంగ్‌ కుమార్‌ (1/18), సకిబ్‌ హుస్సేన్‌ (1/32) సమిష్టిగా రాణించటంతో ఛేదనలో సూపర్‌కింగ్స్‌ చతికిల పడింది. మాథ్యూ షార్ట్‌ (34, 30 బంతుల్లో 3 ఫోర్లు), ఆయుశ్‌ మాత్రె (30, 13 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిసినా.. ఒత్తిడిలో వికెట్లు కోల్పోయారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులకే సూపర్‌కింగ్స్‌ పరిమితమైంది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (59, 22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (59, 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో దంచికొట్టారు. మూడు వికెట్లతో మెరిసిన ఈషన్‌ మలింగ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. గాయం నుంచి కోలుకుంటున్న ఎం.ఎస్‌ ధోని జట్టుతో పాటు హైదరాబాద్‌కు వచ్చినా.. బరిలోకి దిగలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

సూపర్‌కింగ్స్‌ చతికిల
ఛేదనలో ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ సంజు శాంసన్‌ (7) ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (19), ఆయుశ్‌ మాత్రె (30) రెండో వికెట్‌కు ధనాధన్‌ భాగస్వామ్యం అందించారు. పవర్‌ప్లేలో ఆయుశ్‌ మాత్రె ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగాడు. ఈ జోడీ 21 బంతుల్లోనే 51 పరుగులు జోడించింది. దీంతో పవర్‌ప్లేలో సూపర్‌కింగ్స్‌ 76 పరుగులు చేసింది. కానీ మూడు వికెట్లతో సన్‌రైజర్స్‌ సైతం రేసులోనే నిలిచింది. మాథ్యూ షార్ట్‌ (34), సర్ఫరాజ్‌ ఖాన్‌ (25) వికెట్ల పతనం నిలువరించారు. 46 పరుగుల భాగస్వామ్యంతో సన్‌రైజర్స్‌ బౌలర్లను ఒత్తిడికి గురి చేశారు. 10 ఓవర్లలో 111 పరుగులు చేసిన సూపర్‌కింగ్స్‌.. గెలుపు దిశగా సాగుతున్నట్టే అనిపించింది. దీనికి తోడు సన్‌రైజర్స్‌ పేలవ ఫీల్డింగ్‌తో విలువైన పరుగులు సమర్పించుకుంది. మ్యాచ్‌పై సన్‌రైజర్స్‌ పట్టు కోల్పోతుందనే తరుణంలో ఈషన్‌ మలింగ మాయ చేశాడు. మాథ్యూ షార్ట్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ సహా డెవాల్డ్‌ బ్రెవిస్‌ (0) వికెట్లతో సూపర్‌కింగ్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 154/7తో సూపర్‌కింగ్స్‌ ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఆఖర్లో జెమీ ఓవర్టన్‌ (16), అన్షుల్‌ కాంబోజ్‌ (13) ఓటమి అంతరాన్ని కుదించారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు సూపర్‌కింగ్స్‌ 184 పరుగులే చేసింది. 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెరుపు విజయం సాధించింది.

బౌలర్ల సమిష్టి ప్రదర్శన
సన్‌రైజర్స్‌ బౌలర్లు మరోసారి స్వల్ప స్కోరును కాపాడుకున్నారు. భారీ స్కోర్లు నమోదయ్యే పిచ్‌పై బౌలర్లు సూపర్‌కింగ్స్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆరంభంలో ధారాళంగా పరుగులు ఇచ్చినా.. మిడిల్‌ ఓవర్లలో పరుగుల నియంత్రణ పాటించారు. మిడిల్‌లో పది ఓవర్లలో 3 వికెట్లకు 73 పరుగులే ఇచ్చారు. ఇక్కడే మ్యాచ్‌ సన్‌రైజర్స్‌ ఖాతాలోకి వచ్చేసింది. యువ పేసర్‌ ఈషన్‌ మలింగ (3/29) మూడు కీలక వికెట్లతో విజంభించాడు. సకిబ్‌ హుస్సేన్‌ (1/32) ఆఖర్లో అద్భుతంగా బంతులేశాడు. ఒత్తిడిలో వైడ్లు వేసినా.. బ్యాటర్లకు ముకుతాడు వేయటంలో సఫలం అయ్యాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (2/31), శివాంగ్‌ కుమార్‌ (1/18) ఆకట్టుకున్నారు.

అభిషేక్‌, క్లాసెన్‌ అర్థ సెంచరీలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి భారీ స్కోరు అవకాశాన్ని వథా చేసుకుంది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (59) 15 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదగా పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ 72 పరుగులు చేసింది. కానీ ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ (23), ఇషాన్‌ కిషన్‌ (0) వికెట్లను వరుస బంతుల్లో కోల్పోయింది. అభిషేక్‌ శర్మను కట్టడి చేసేందుకు సూపర్‌కింగ్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ మాథ్యూ షార్ట్‌ పవర్‌ప్లేలోనే మూడు ఓవర్లు సంధించాడు. అభిషేక్‌ శర్మ అతడి ఓవర్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సంధించి 25 పరుగులు పిండుకున్నాడు. జోరుమీదున్న సన్‌రైజర్స్‌కు ముకేశ్‌ చౌదరి రెండు వికెట్ల ఓవర్‌తో బ్రేక్‌ వేశాడు. అర్థ సెంచరీ తర్వాత అభిషేక్‌ సైతం నెమ్మదించాడు. 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శివం దూబె క్యాచ్‌ వదిలేసినా.. ఓవర్టన్‌ ఓవర్లో అభిషేక్‌ వికెట్‌ పారేసుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్‌ 8 ఓవర్లలో 93/3తో నిలిచింది. 8.5 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్‌ దాటిన హైదరాబాద్‌.. తొలి పది ఓవర్లలో 112 పరుగులు చేసింది. దీంతో 200 పరుగులు సులభమే అనిపించింది. ఇన్నింగ్స్‌ ద్వితీయార్థంలో సన్‌రైజర్స్‌ తడబడింది. ఓ ఎండ్‌లో హెన్రిచ్‌ క్లాసెన్‌ (59) నిలబడగా.. కుర్రాళ్లు ఎదురుదాడికి ప్రయత్నించారు. ఐదు ఫోర్లు, 2 సిక్సర్లతో 32 బంతుల్లో క్లాసెన్‌ సీజన్లో మరో అర్థ సెంచరీ సాధించాడు. కానీ మరో ఎండ్‌ నుంచి సరైన సహకారం లభించలేదు. అనికెత్‌ వర్మ (2), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (12), సాలిల్‌ అరోరా (13) నిరాశపరిచారు. ఆఖర్లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన లియాం లివింగ్‌స్టోన్‌ (1) ఐదు బంతుల్లో ఒక్క పరుగే సాధించి తేలిపోయాడు. చివరి పది ఓవర్లలో 82 పరుగులే చేసిన సన్‌రైజర్స్‌ 6 వికెట్లు చేజార్చుకుంది. డెత్‌ ఓవర్లలో క్లాసెన్‌ వికెట్‌ కోల్పోవటంతో అక్కడ్నుంచి పరుగుల వేటలో సన్‌రైజర్స్‌ తడబడింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు సన్‌రైజర్స్‌ 194 పరుగులే చేసింది. సూపర్‌కింగ్స్‌ బౌలర్లలో అన్షుల్‌ కాంబోజ్‌ (3/22), జెమీ ఓవర్టన్‌ (3/37) మూడేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్‌ చౌదరి (2/21), గుర్జప్‌నీత్‌ సింగ్‌(1/34) రాణించారు.

పసుపు సంద్రంలా ఉప్పల్‌!
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఇటీవల విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనంతగా సన్‌రైజర్స్‌ సొంత మైదాన మ్యాచ్‌లకు గణనీ యమైన డిమాండ్‌ ఏర్పడింది. కానీ, ఇదంతా మహేంద్రుడు ఉప్పల్‌లో అడుగు పెట్టనంత వరకే అన్నట్టుగా మారింది. రెండేండ్లలో ఎం.ఎస్‌ ధోని హైదరాబాద్‌ కు రావటంతో అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు అభిమాన గణం ఉప్పల్‌ స్టేడియంకు పోటెత్తింది. ధోని జెర్సీలతో ఉప్పల్‌ స్టేడియం పసుపు సంద్రాన్ని తలపించింది. గత రెండు మ్యాచ్‌లతో పోల్చితే సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌కు టికెట్ల రేట్లను సైతం రెట్టిం పు చేశారు. అయినా, శనివారం నాటి మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 36770 మంది అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. సన్‌రైజర్స్‌ కంచుకోట ఉప్పల్‌ను సూపర్‌ కింగ్స్‌ సొంతగడ్డగా చేసుకున్నట్టు అభిమానుల మద్దతును ఆస్వాదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -