Sunday, April 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅడ్డుకున్నది పునర్విభజననే..

అడ్డుకున్నది పునర్విభజననే..

- Advertisement -

– మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతిస్తాం
– సవరించిన బిల్లును సోమవారం పార్లమెంటులో పెట్టండి
– డీలిమిటేషన్‌పై అఖిలపక్షంతో చర్చలు జరపాలి
– రాష్ట్రాల మధ్య అంతరం పెంచే చర్యల్ని వ్యతిరేకిస్తాం
– బిల్లుల విషయంలో మోడీ, షాలకు నిజాయితీ లేదు
– రిజర్వేషన్ల రద్దు కోసమే రాజ్యాంగ మార్పు
– బీజేపీ దురుద్దేశాన్ని ప్రతిపక్షాలు ఓడించాయి : ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశ భవిష్యత్తు, సమగ్రతను బలహీన పర్చేలా, దేశ రాజకీయ చిత్రపటాన్నే మార్చే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మాత్రమే ప్రతిపక్షాలు ఓడించాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు తాము వ్యతిరేకం కాదన్నారు. బిల్లుల విషయంలో బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షాకు నిజాయితీ లేదని విమర్శిం చారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ”గంట సమయం ఇస్తే బిల్లును మార్చివేస్తామని అమిత్‌ షా పార్లమెంటులో చెప్పారు. సోమవారం వరకు సమయం ఉంది. ప్రస్తుతం ఉన్న 543 సీట్లతోనే మహిళా బిల్లు తీసుకువస్తే మంగళవారమే పాస్‌ చేసుకుందాం” అని తేల్చిచెప్పారు. శని వారంనాడాయన ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయాలనే బీజేపీ ప్రభుత్వ దురుద్దేశ్యాన్నే ప్రతిపక్షాలు ఐక్యంగా తిప్పికొట్టాయని చెప్పారు. పార్లమెంటులో మూడొంతుల మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేసి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే లక్ష్యంతోనే 2024 ఎన్నికల్లో ‘చార్‌ సౌ పార్‌’ (400 సీట్లకు మించి) నినాదంతో ఆపార్టీ ఎన్నికలకు వెళ్లిందని గుర్తుచేశారు. కానీ ప్రజలు ఈ ప్రమాదాన్ని గమనించి ఆపార్టీని 240 సీట్లకే పరిమితం చేశారని చెప్పారు. రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల ఎత్తివేతకోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుపెట్టుకోవాలని భావించి, ప్రతి పక్షాలు ఐక్యంగా తిరస్కరించడంతో అడ్డంగా అభాసుపాలయ్యారని సీఎం విమర్శించారు. మోడీ సర్కారుకు మహిళా రిజర్వేషన్లపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఆ ఒక్క బిల్లును రేపు పార్లమెంటులో ప్రవేశపెడితే కాంగ్రెస్‌పార్టీ సమర్థిస్తుందని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చిత్తశుద్ది, నిజా యితీ లేనందునే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిందన్నారు. పార్లమెంట్‌లో ఓడిపోయింది బీజేపీ ప్రభుత్వ దురుద్దేశమేనని చెప్పారు. ఈ బిల్లులు వీగిపోవడానికి కారణమైన ప్రతిపక్ష నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

దక్షిణాదికి ప్రాతినిధ్యం వహిస్తా
”2011 జనాభా లెక్కలు, ఇతర డేటా ఎన్నికల కమిషన్‌ దగ్గర ఉన్నాయి. 2009లో డీలిమిటేషన్‌ జరిగింది. ఆ లెక్కలతో 2026 ఆగస్టు 15 లోపు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించొచ్చు. అదే ప్రాధాన్యతను 2027లో ఉత్తరప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో అమలు చేయవచ్చు. మీరు రిజర్వేషన్లు ఆ విధంగా అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్టాలిన్‌, పినరయి విజయన్‌, సిద్ధరామయ్య, చంద్రబాబు నాయుడు, పుదుచ్చేరి సీఎం రంగస్వామిలతో నేను చర్చలు జరుపుతాను. ఇండియా కూటమి నేతల మద్దతు కూడగడుతూ ఆ బాధ్యతను నేను స్వీకరిస్తాను” అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. 2023లో పాస్‌ అయిన మహిళా బిల్లులో సవరణలు చేయాలనుకుంటే ఒక చిన్న మార్పుతో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందన్నారు. కానీ బీజేపీ ఉద్దేశం రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లు ఎత్తివేయడమేననీ, పార్లమెంట్‌ వేదికగా జరిగిన ఈ తీర్పును 140 కోట్ల మంది దేశ ప్రజలు చూశారన్నారు.

కుటుంబ నియంత్రణ పాటిస్తే సీట్లు తగ్గిస్తారా?
బీజేపీ తెచ్చిన డీలిమిటేషన్‌ బిల్లు వల్ల దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలు, రాజకీయ అస్థిత్వాన్ని కోల్పోతాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం విధానాల ఆధారంగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయనీ, దానివల్ల ఆయా రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయిందన్నారు. దేశానికి విధేయంగా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, సీట్టు తగ్గించి జరిమానా విధిస్తామనడం ఏవిధంగా సరైందని ప్రశ్నించారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇస్తాం
ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 సీట్లలో మూడవ వంతు, రాష్ట్రాల శాసనసభల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ, సోమవారంనాటికి కొత్త చట్టాలను రూపొందించి పార్లమెంట్‌ ముందుకు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి సలహా ఇచ్చారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆ రూపంలో తెస్తే ఇండియా కూటమి మద్దతు ఇస్తుందనీ, అదే రోజు బిల్లు పాస్‌ చేసుకొని, మంగళవారం నుంచే ఈ చట్టాన్ని అమలు చేయవచ్చని తెలిపారు.

అఖిలపక్షంతో చర్చించాలి
కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ప్రతిపక్షాలతో చర్చించి, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తెలుసుకొని, అన్ని లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి, జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలని సూచించారు. ఆయా రాష్ట్రాలతో సంప్రదించి శాసనసభల్లో స్థానాల సంఖ్య పెంచవచ్చన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటే దేశ ప్రజలు ఒప్పుకోరని స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్‌ అడ్డుకుందని బద్నాం చేసే పనిలో ప్రధాని మోడీ, బీజేపీ పడ్డాయని ఎద్దేవా చేశారు. వారి ఆందోళనలన్నీ దానిలో భాగమేనని చెప్పారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా చిత్తశుద్ధితో సరైన పద్ధతిలో బిల్లులు తయారు చేయాలని అన్నారు. పార్లమెంట్‌లో మోడీ అహంకారం మాత్రమే ఓడిపోయిందన్నారు.

అదే విద్వేషం
ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్ర విభజనపై తల్లిని చంపి బిడ్డను రక్షించారంటూ పలుమార్లు ద్వేషం చూపారనీ, ఇప్పుడు ఆయన బాటలోనే ఎంపీ తేజస్వీ సూర్య నడుస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్‌ ప్రధాని మోడీ దృష్టిని ఆకర్షించి ప్రమోషన్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప, ప్రజాభిóప్రాయాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. డీలిమిటేషన్‌పై తాను సూచించిన విధానం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నచ్చకపోతే ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలే తప్ప, ఎదురుదాడి చేయడమేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ మహిళలకు చేసిన సేవలు, ఇచ్చిన అవకాశాలను ప్రస్తావించారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్‌ మల్లు రవి, సురేష్‌ షెట్కార్‌, బలరాం నాయక్‌, విప్‌లు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, బుయ్యాని మనోహర్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు.

ఉత్తర, దక్షిణ అంతరాలు సృష్టించొద్దు
నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ఉత్తరాది, దక్షిణాది మధ్య రాజకీయ అంతరం సృష్టించి, అడ్డుగోడలు కట్టొద్దని సీఎం రేవంత్‌రెడ్ది ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాలు భాగమేననీ, ఈ దేశంలోనే దక్షిణాది ప్రజలు బతుకుతున్నారనీ, దేశ సేవలో తాము ఎవరికన్నా తక్కువ కాదని స్పష్టంచేశారు. దేశాన్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -