అమెరికాతో ఒప్పందాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల ఆదాయానికి దెబ్బ
న్యూఢిల్లీ : వివిధ దేశాలతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా కస్టమ్స్ సుంకాల రాబడికి గండి పడుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల లోక్‌సభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. ఈ ఒప్పందాల కారణంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఒక ట్రిలియన్ కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతామని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్ సుంకాల రాబడి రూ. 98,569 కోట్లు తగ్గిపోయింది. బడ్జెట్ అంచనా రూ.94,172 కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువే. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో భాగంగా ప్రభుత్వం సుంకాలను తగ్గిస్తోంది.
కస్టమ్స్ సుంకాల రాబడి పడిపోవడానికి ఇదే కారణం. ఆగ్నేయాసియా దేశాల అసోసియేషన్ (ఆసియాన్)లో భాగంగా ఉన్న దేశాలకు మనం కల్పిస్తున్న రాయితీలు రెవెన్యూపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా కస్టమ్స్ సుంకాల ఆదాయం బాగా తగ్గిపోతోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆసియాన్ దేశాల నుంచి లభించాల్సిన కస్టమ్స్ సుంకాల ఆదాయం రూ.40,833 కోట్లు తగ్గిపోవచ్చునని అంచనా. ఈ నేపథ్యంలో ఆసియాన్ దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలను తక్షణమే సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు సూచించారు. ఆయా దేశాలకు భారత్ నుంచి జరుగుతున్న ఎగుమతులతో పోలిస్తే అక్కడి నుంచి దిగుమతులు వేగంగా పెరుగుతున్నాయని వారు గుర్తు చేశారు.
వాణిజ్య ఒప్పందాన్ని 2025లో సమీక్షించుకోవాలని ఇరు పక్షాలు 2023లో ఒప్పందానికి వచ్చాయి. అయితే గడువు ముగిసినా ఆ పని జరగలేదు. సమీక్ష ప్రక్రియ నత్తనడక నడవడంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా జపాన్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా రూ.11,365 కోట్లు, దక్షిణ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా రూ.10.872 కోట్లు, ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా రూ.5.107 కోట్ల కస్టమ్స్ సుంకం ఆదాయం తగ్గుతుంది. యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో రూ.9,267 కోట్ల కస్టమ్స్ టారిఫ్ ఆదాయానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో గండి పడబోతోంది.



