– అశ్వారావుపేటలో విద్యార్థుల కోసం గుమ్మం వద్దే నమోదు ప్రక్రియ
– పోటాపోటీగా రెండు పాఠశాల లు ఏర్పాట్లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
చిత్రాల్లో కనిపిస్తున్న దృశ్యాలు ప్రైవేట్ పాఠశాలలవి అనుకుంటే పొరపాటే. ఇవి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికల కోసం జరుగుతున్న ప్రత్యేక ప్రయత్నాలకు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని తెలంగాణ విద్యాశాఖ లక్ష్యాలు నిర్దేశించడంతో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడంతో పాటు పాఠశాలల వద్దే చేరికల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన వంటి సౌకర్యాలను వివరిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. చేరికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి బాలుర పాఠశాల సిబ్బంది పాఠశాల కార్యాలయం ముందు టేబుల్ ఏర్పాటు చేసి విద్యార్థుల వివరాలు నమోదు చేసుకుంటుండగా, బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాళ్లు ప్రధాన ద్వారం వద్దనే కూర్చొని కొత్తగా వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు.
గత విద్యా సంవత్సరంలో బాలుర పాఠశాలలో 383 మంది విద్యార్థులు ఉండగా, పదో తరగతి పూర్తి చేసి 118 మంది బయటకు వెళ్లారు. ఆరో తరగతి నుంచి ఏడో తరగతికి 75 మంది విద్యార్థులు చేరారు. అదే విధంగా బాలికల ఉన్నత పాఠశాలలో గతేడాది 103 మంది విద్యార్థులు ఉండగా, 17 మంది పదో తరగతి విద్యార్థినులు పాఠశాల విడిచారు. ఆరో తరగతి నుంచి ఏడో తరగతికి 12 మంది మాత్రమే చేరారు.
ఈ నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేసి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఇరు పాఠశాలల ఉపాధ్యాయులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల మధ్య చేరికల పోటీ కనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ ఒకే ప్రాంగణంలో ఉన్న రెండు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల కోసం పోటీ పడుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పలువురు “ప్రభుత్వ పాఠశాలల మధ్యే చేరికల పోటీ!” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.



