– మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ను ఆమె నివాసంలో మున్సిపల్ కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కార్మికుల చేతుల్లోనే ఉందని తెలిపారు. పట్టణంలోని 49 వార్డుల్లో వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్స్, శానిటేషన్, కార్యాలయ సిబ్బంది కలిపి 450 మందికి పైగా కార్మికులు సేవలందిస్తున్నారని వివరించారు.
పెండింగ్‌లో ఉన్న సమస్యలు, వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయకపోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చైర్‌పర్సన్‌ను కోరారు. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో నిరంతరం విధులు నిర్వహిస్తున్నామని, కనీసం రెండు రోజులు సెలవు తీసుకున్నా ఆబ్సెంట్ వేస్తున్నారని వాపోయారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మీరు ఈ అంశాలపై తొలి సంతకం చేసి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నికై రెండు రోజులు మాత్రమే అయినప్పటికీ తమ నివాసానికి వచ్చి సన్మానించినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతి వార్డులో కార్మికులు తమ తమ బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించాలని సూచించారు.
నీటి సమస్యలు, డ్రైనేజ్, మోటర్లు, ఫిల్టర్ బెడ్లు, పంప్ ఆపరేటర్లు తదితర అంశాల్లో సమన్వయంతో పని చేయాలని చెప్పారు. కార్మికుల సమస్యలను పెండింగ్ లేకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ఇందుకు మహమ్మద్ షబ్బీర్ అలీ సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం. లక్ష్మన్, మునిసిపల్ టౌన్ అధ్యక్షుడు ఎన్. నర్సింగ్ రావు, పట్టణ కార్యదర్శి కరోబర్ రాజేందర్, ఉపాధ్యక్షుడు జి. రాజు, ఆర్. లక్ష్మణ్, వి. రాజిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు యు. లక్ష్మి, ఏళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.



