‘అత్త ఎప్పుడూ తల్లి కాలేదు. అలాగే కోడలు ఎప్పుడూ కూతురు కాలేదు’ అనేది నానుడిగా వుంది. కానీ ఇది అందరి విషయంలో సరైనదికాదు. ఒక్కొక్క కుటుంబంలో సంబంధాలు ఒక్కో విధంగా ఉంటాయి. అర్థం చేసుకుంటూ మసులుకునే వారైతే అత్తాకోడళ్ల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. కానీ ఒకరిపై ఒకరు పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకొని ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించాలని చూస్తే అనేక సమస్యలు వస్తాయి. అలాంటి కథనమే ఈవారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో మీ కోసం…
లక్ష్మికి దాదాపుగా 52 ఏండ్లు ఉంటాయి. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఇద్దరికీ పెండ్లి అయిపోయింది. చిన్న కొడుకు రాహుల్‌కు, రవళికి పెండ్లి చేశారు. ఇద్దరూ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. రవళికి 25 ఏండ్లు ఉంటాయి. రాహుల్‌కు 28 ఏండ్లు ఉంటాయి. అత్త లక్ష్మి ప్రభుత్వ పాఠశాలలో టీచర్. మామయ్య ఉద్యోగ విరమణ చేశారు. ఖాళీగారుంట్లో ఉండలేక సోషల్‌వర్క్ చేస్తూ ఉదయం నుండి సాయంత్రం వరకు బయటనే ఉంటున్నారు. సాయంత్రానికి అందరూ ఇంటికి వచ్చేస్తారు. లక్ష్మి పెద్ద కొడుకూ కోడలు వేరే చోట ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత లక్ష్మి దగ్గరకు వస్తారు. రవళి ఇంటికి వచ్చే సరికి రాత్రి ఎనిమిది అవుతుంది. ఇంట్లో పని చేయడానికి అమ్మాయి ఉంది. వంట మాత్రం రవళి, లక్ష్మి కలిసి చేస్తారు. అయితే అత్త చేసినంత రుచిగా రవళి కూర చేయలేకపోయేది. అంతే కాదు లక్ష్మి చేసినంత త్వరగా వంట కూడా చేయలేకపోయేది. ఇంట్లో ఉన్నపుడు రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. రవళికి ఇంట్లో కంటే బయట తిరగడం అంటే చాలా సరదా. పైగా చిన్నపిల్ల మనస్తత్వం. ఇలా కాదు అలా చేయాలని అంటే మాట వినేది కాదు. పైగా గొడవ చేసేది. లేదంటే తినకుండా పడుకునేది. మరీ కోపం వస్తే పుట్టింటికి వెళ్లేది. అసలు ఆమెకు ఏమైనా చెప్పాలంటే భయంగా ఉండేది. ఏ విషయానికి ఎలా స్పందిస్తుందో అర్థమయ్యేది కాదు. చిన్న చిన్న విషయాలకే బంధువులను తీసుకొచ్చి పంచాయితీ పెట్టేది. ఇప్పకే రెండు సార్లు ఇలా జరిగింది. ప్రస్తుతం ఆమె ఇంట్లో నుండి వెళ్లిపోయి నాలుగు రోజులు అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక లక్ష్మి సలహా కోసం ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
మేము రవళిని, రాహుల్‌ను పిలిపించి మాట్లాడితే… ఆమె చెప్పింది ఏమిటంటే ‘నేను ఏ పని చేసినా అందులో తప్పులు వెదుకుతారు. వంట విషయంలోనే కాదు నేను ఏదైనా పెండ్లికి వెళ్లినా, ఫంక్షన్‌కి వెళ్లినా ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా ఆమెనే చెబుతుంది. ఏ విధంగా తయారవాలి, గిఫ్ట్ ఏది ఇవ్వాలి తనే నిర్ణయిస్తుంది. నా బంధువుల పెండ్లి అయినా నేను ఎన్ని రోజులు వెళ్లాలి, రాహుల్ ఎన్ని రోజులు ఉండాలి అనేది మా అత్తయ్యనే చెబుతుంది. నేను ఎక్కడికి వెళ్లినా ఆమెకు చెప్పిన తర్వాతనే వెళ్లాలి. అలా కాకుండా వెళితే గొడవ చేస్తుంది. ఆఫీసు నుండి రావడం కొంచెం ఆలస్యం అయినా పది సార్లు ఫోన్ చేస్తుంది. మేము చిన్న పిల్లలం కాదు కదా! ఆ విషయం కూడా ఆమెకు అర్థం కాదా? ఎన్ని సార్లు చెప్పినా అలాగే చేస్తుంది. ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం నాకు నచ్చడం లేదు. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్లిపోయాను. నేను రాహుల్ విడిగా ఉంటాము. మా అత్తయ్యతో కలిసి వుంటే నాకు స్వేచ్ఛ ఉండదు. ఈ విషయం గురించి మాట్లాడటానికి నేనే మీ దగ్గరకు వద్దామనుకున్నాను. కానీ నాకంటే ముందుగానే మా అత్తయ్య వచ్చారు. కాబట్టి మీరే చెప్పండి. మా విషయంలో ఆమె జోక్యం తగ్గిస్తే బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
రాహుల్ మాట్లాడుతూ ‘నేను రవళికి గానీ మా అమ్మకు గానీ ఏమీ చెప్పలేకపోతున్నాను. నాకు మాత్రం మా అమ్మను వదిలి బయటకు వెళ్లే ఉద్దేశం లేదు. అలా అని రవళిని వదిలి ఉండలేను. మీరే మా సమస్యకు పరిష్కారం చూపించండి’ అన్నాడు.
మేము అందరినీ కూర్చోబెట్టి ‘లక్ష్మి.. మీరు పెద్దవారు కాబట్టి కొంత అర్థం చేసుకోవాలి. పైగా మీరు గత 20 ఏండ్ల నుండి వంట చేస్తున్నారు కాబట్టి. కాస్త త్వరగా చేయగలరు. కానీ రవళి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. కొన్ని రోజులుపోతే ఆమే నేర్చుకుంటుంది’ అని చెప్పి రవళితో ‘మీ అత్తయ్య చెప్పగానే అందులో తప్పులు వెదుకుతున్నావు. మీ అమ్మ ఏదైనా చెప్తే ఇలాగా అనుకుంటావా? ఫంక్షన్‌కి అయినా, పెండ్లికి అయినా తన కోడలు ప్రత్యేకంగా కనిపించాలని ఆమె కోరుకుంటుంది. అందుకే అలా చెబుతుంది. అంతేకానీ నిన్ను తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే ఆలోచన ఆమెకు లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అభిమానంగా, గౌరవంగా మాట్లాడుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు’ అని చెప్పి పంపించాము. మళ్లీ మూడు నెలల తర్వాత రవళి, రాహుల్ మా దగ్గరకు వచ్చారు. రాహుల్ మాట్లాడుతూ ‘ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము. పిల్లల కోసం అత్తా కోడలు కలిసి ఆసుప్రతి చుట్టూ తిరుగుతున్నారు. చివరకు నన్ను కూడా పక్కన పెట్టేశారు. ఇలా అందరూ అత్తలో తల్లిని, కోడలిలో కూతురిని చూసుకుంటే ఎలాంటి సమస్యలూ ఉండవు. కాకపోతే దాని కోసం కొంచెం సమయం పడుతుంది. అయితే అర్థం చేసుకొని మసులు కుంటే మాత్రం అది సాధ్యమే అని నాకు తెలిసింది. మీలాంటి వాళ్లు ఇలా కౌన్సెలింగ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పి రవళిని తీసుకొని వెళ్లిపోయాడు.



