Wednesday, August 19, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్క్లిక్‌..క్లిక్‌..క్లిక్‌

క్లిక్‌..క్లిక్‌..క్లిక్‌

- Advertisement -

నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
నవరసాల సమాహారం ‘ఫోటో’
ఒక్క ‘చిత్రం’ వేల అక్షరాలకు సమానం
ప్రపంచ గమనాన్నే మారుస్తున్న ఫోటోగ్రఫీ
విజేతలు, పరాజితులనూ నిర్ణయిస్తున్న వైనం
అయినా గుర్తింపునకు నోచని ఫోటోగ్రాఫర్లు

కెఎన్‌ ‌హరి
ఢిల్లీలో జెన్‌‌జీ ఉద్యమం…. యువతరంలోకి దాన్ని తీసుకెళ్లి పోరాట స్ఫూర్తిని రగల్చడంలో ‘ఫోటో’ పాత్రను విస్మరించలేం. అదే సమయంలో ఆ ‘ఫోటోలే’ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కేంద్రమంత్రితో రాజీనామా చేయించేదాకా తీసుకెళ్లాయి. ఇది తాజా ఉదాహరణ మాత్రమే. చరిత్రలో ఇలాంటి ఘటనలు అనేకం. వేల అక్షరాల భావాన్ని ఒక్క ఫోటో ద్వారా సులభంగా చెప్పేయగలగడం ఓ కళ. ఆ కళలో ఎప్పటికప్పుడు ఫోటోగ్రాఫర్లు శిక్షణ పొందుతూనే ఉంటారు. ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. మన జ్ఞాపకాలు కాలంతో మసకబారవచ్చు. కానీ మనం తీసుకున్న ఫోటోలు మాత్రం ఆ జ్ఞాపకాలను ఎన్నటికీ సజీవంగా ఉంచుతాయి. ఫోటోలు గతాన్ని మనకు గుర్తు చేయడమే కాకుండా, ఎన్నో భావోద్వేగాలను, అనుభూతులను మన కళ్లముందు నిలుపుతాయి. 1837లో, ఫ్రాన్స్‌కు చెందిన జోసెఫ్ నిసెఫోర్ నీప్స్, లూయిస్ డాగ్యురే కలిసి తొలి ఫోటోగ్రాఫిక్ ప్రక్రియను అభివృద్ధి చేశారు. దీనిని డాగ్యురియోటైప్ (Daguerreotype) అని పిలిచారు. ఈ ఆవిష్కరణను ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ ఆవిష్కరణకు సంబంధించిన హక్కులను స్వీకరించింది. అయితే ఆ హక్కులను తమ దగ్గరే ఉంచుకోకుండా 1839 ఆగస్టు 19న ప్రపంచానికి బహుమతిగా అందించింది. అప్పటి నుంచే ఆగస్టు 19 ని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1839లో బ్రిటన్‌కు చెందిన విలియం హెన్రీ ఫాక్స్ టాల్బట్ ఫోటోగ్రఫీ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. కాగితంపై ఉప్పు ముద్రల ఆధారంగా ఫోటోలను తయారు చేసే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇది లోహంతో తయారు చేసే డాగ్యురియోటైప్ విధానానికి మంచి ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఆ తర్వాత అనేక సాంకేతిక మార్పులకు గురైన ఫోటోగ్రఫీ, ఇప్పుడు ఫోటోగ్రాఫర్ల వరకే పరిమితం కాలేదు. ప్రజల చేతుల్లోకి సెల్‌‌ఫోన్‌ ‌రూపంలో వచ్చేసింది. అంతలా ఫోటోగ్రఫీ అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఫోటోగ్రఫీ హాబీగా ఉండేది. కాలక్రమేణా ఎంతోమందికి ఒక వృత్తిగా మారింది. చరిత్రను భద్రపరిచే ‘చారిత్రక సాక్ష్యం’గా రూపాంతరం చెందింది.

​ఏదీ మిస్‌ ‌కాదు
ఒక చిరునవ్వు, కుటుంబం, పండుగ, చారిత్రక సంఘటన, అందమైన ప్రకృతి దృశ్యం ఇవన్నీ ఫోటోలో శాశ్వతంగా నిలిచిపోయేవే. జ్ఞాపకాలను కొద్ది రోజులకు మర్చిపోతాం. కానీ ఆ జ్ఞాపకం ఫోటో రూపంలో ఉంటే ఎప్పటికీ సజీవమే. ​

ఫోటో.. వార్తకు సాక్ష్యం
వార్తను రాసే జర్నలిస్టు సంఘటనను అక్షరాల్లో స్థిరీకరిస్తే .. ఫోటో జర్నలిస్టు అదే సంఘటనను దృశ్య సాక్ష్యంగా నిలబెడతాడు. రాజకీయ సభలో నాయకుడి ప్రసంగం కంటే ఆ సభలో ప్రజల స్పందనను చూపించే ఒక్క ఫోటో ఎక్కువగా మాట్లాడవచ్చు. వరదలో చిక్కుకున్న కుటుంబం, అగ్నిప్రమాదంలో సహాయక చర్యలు, రోడ్డుపై జరిగిన ప్రమాదం, రైతు పొలంలో పడిన వర్షపు చినుకు, ఉద్యమంలో పోలీసుల చర్య, రాజకీయ పరిణామం, విజయోత్సవం.. ఏదైనా సరే, దాన్ని ప్రజల కండ్ల ముందుకు తీసుకొచ్చేది ఫోటో జర్నలిస్టు కెమెరానే.

కెమెరా నైపుణ్యం కాదు…వృత్తి ధర్మమే
ఒకప్పుడు పత్రికలో ఫోటోకు ఇచ్చిన ప్రాధాన్యం, ఇప్పుడు డిజిటల్ మీడియా విస్తరణతో మరో రూపం దాల్చింది. వేగంగా వార్త ఇవ్వాలనే పోటీ పెరిగిన కొద్దీ నాణ్యమైన ఫోటోగ్రఫీకి అవసరమైన సమయం, వనరులు తగ్గుతున్నాయనే ఆందోళన ఫోటోగ్రాఫర్లలో ఉంది. ఫోటో జర్నలిస్టు పని బయటకు కనిపించేంత సులభం కాదు. సంఘటన స్థలానికి ముందుగా చేరుకోవాలి. సరైన కోణాన్ని గుర్తించాలి. క్షణాన్ని కోల్పోకుండా కెమెరాను సిద్ధంగా ఉంచాలి. ప్రమాదకర పరిస్థితుల్లోనూ పని చేయాల్సి రావచ్చు. వర్షం, ఎండ, వరద, అగ్నిప్రమాదం, ఆందోళనలు, బందోబస్తు, రద్దీ.. పరిస్థితి ఎలా ఉన్నా వార్తా విలువైన దృశ్యాన్ని అందించాల్సిందే. కొన్ని సందర్భాల్లో పోలీసులు, భద్రతా సిబ్బంది విధించిన ఆంక్షలను ఎదుర్కొంటూ పనిచేయాల్సి వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో సంఘటనకు దగ్గరగా వెళ్లే అవకాశం లేకుండా అడ్డంకులు ఎదురవుతాయి. అదే సమయంలో ప్రజల వ్యక్తిగత గోప్యత, ప్రమాద బాధితుల గౌరవం, పిల్లలు, మహిళలకు సంబంధించిన సున్నితమైన దృశ్యాల విషయంలో నైతిక బాధ్యతను కూడా పాటించాల్సి ఉంటుంది. అందువల్ల ఫోటో జర్నలిజం కేవలం కెమెరా నైపుణ్యం కాదు.. బాధ్యతతో కూడిన వృత్తి.

​గుర్తింపు లేని బతుకులు
చాలా సందర్భాల్లో ఫోటో జర్నలిస్టును కేవలం ‘ఫోటో తీసే వ్యక్తి’గా చూడటం కనిపిస్తుంది. వాస్తవానికి ఒక వార్తకు ఏ ఫోటో అవసరమో నిర్ణయించడం, సంఘటనలో కీలకమైన క్షణాన్ని గుర్తించడం, సరైన ఫ్రేమ్‌ను ఎంచుకోవడం, సాంకేతికంగా నాణ్యమైన చిత్రాన్ని అందించడం వెనుక అనుభవం, శిక్షణ, పరిశీలన ఉంటాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలు, అధికారిక కార్యక్రమాల వద్ద కూడా ఫోటో జర్నలిస్టులకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం, కొన్ని సందర్భాల్లో ప్రత్యేక గుర్తింపు లేకపోవడం వంటి సమస్యలు ఉంటున్నాయని వృత్తిలో ఉన్నవారు చెబుతున్నారు. ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న మార్పులు ఫోటోగ్రాఫర్లు, ఫోటో జర్నలిస్టుల్ని ఎప్పటికప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక కొత్త సాంకేతిక వస్తూనే ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకోవడమే అసలు సవాల్‌. ప్రెస్‌ ‌ఫోట్రోగాఫర్ల కష్టాలు మరింత వర్ణనాతీతం. అనేక సందర్భాల్లో సాంకేతిక పరిజ్ఞానం వారి వృత్తి స్వరూపాన్నే మార్చేస్తుంది. ఫోటోను ప్రచురించినప్పుడు దాని వెనుక ఉన్న ఫోటోగ్రాఫర్ పేరు కనిపించట్లేదు.

​​స్మార్ట్‌ఫోన్.. పోటీనా.. ప్రత్యామ్నాయమా?
స్మార్ట్‌ఫోన్ కెమెరాల నాణ్యత పెరగడంతో ఫోటోగ్రఫీ రంగంలో పెద్ద మార్పు వచ్చింది. ఒకప్పుడు ప్రొఫెషనల్ కెమెరా అవసరమైన అనేక సందర్భాల్లో ఇప్పుడు మొబైల్ ఫోన్‌తోనే నాణ్యమైన చిత్రాలు తీయగలుగుతున్నారు. ఇది ఫోటో జర్నలిజానికి ఒకవైపు సవాలు అయితే మరోవైపు అవకాశం కూడా. సంఘటన స్థలంలో వెంటనే ఫోటో తీసి పంపే సామర్థ్యం పెరిగింది. అయితే సాంకేతిక పరికరం మాత్రమే మంచి ఫోటోను సృష్టించదు. సంఘటనను అర్థం చేసుకోవడం, సరైన క్షణాన్ని గుర్తించడం, ఫ్రేమింగ్, వెలుతురు, సందర్భం.. ఇవన్నీ ఫోటో విలువను నిర్ణయిస్తాయి. అందుకే మొబైల్ కెమెరా విస్తరణను ఫోటో జర్నలిస్టుల వృత్తికి ముగింపుగా కాకుండా కొత్త సాంకేతిక సాధనంగా చూడాల్సిన అవసరం ఉంది. డిజిటల్‌ ‌యుగంలో ఒక్క క్లిక్‌‌తో ఫోటోల దొంగతనం కూడా సులభమైపోయింది.

​ఏఐతో కొత్త సవాళ్లు
కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తరణతో ఫోటోగ్రఫీ మరో కీలక మలుపు తిరిగింది. అసలు కెమెరాతో తీయని చిత్రాలను కూడా సృష్టించగల సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఫోటోలోని అంశాలను మార్చడం, తొలగించడం, కొత్త అంశాలను జోడించడం గతంలో కంటే సులభమైంది. ఇది ఫోటో జర్నలిజానికి తీవ్రమైన నైతిక సవాలును విసురుతోంది. అసలు సంఘటనను చూపించే ఫోటో ఏది? ఏఐ ద్వారా రూపొందించిన చిత్రం ఏది? మార్పులు చేసిన ఫోటోను నిజమైన దృశ్యంగా ప్రచురిస్తున్నారా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు అవసరం. భవిష్యత్తులో వార్తా సంస్థలు ఫోటో ప్రామాణికతను నిర్ధారించే సాంకేతిక విధానాలను మరింతగా ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడవచ్చు.

​ఆదాయం.. భద్రత.. భవిష్యత్తు
ఫోటో జర్నలిస్టుల సమస్యల్లో ఆర్థిక భద్రత కూడా ముఖ్యమైనది. పరికరాల ధరలు భారీగా ఉండటం, కెమెరాలు–లెన్సుల నిర్వహణ ఖర్చు, ప్రయాణ వ్యయం, డేటా స్టోరేజ్, పరికరాల బీమా వంటి అంశాలు వృత్తిపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. పని ఉన్నప్పుడే ఆదాయం ఉంటుంది. పరికరాలు దెబ్బతిన్నా వాటి మరమ్మతుల ఖర్చు వారిపైనే పడుతుంది.

మార్పులు అనివార్యం

ఫోటోగ్రాఫర్ల స్థాయిలో కొత్త కెమెరా సాంకేతికతతో పాటు మొబైల్ ఫోటోగ్రఫీ, వీడియో, డ్రోన్, డిజిటల్ ఎడిటింగ్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి.
ఏఐ సాధనాలను అర్థం చేసుకోవాలి. ఫోటో హక్కులు, కాపీరైట్, డిజిటల్ భద్రతపై అవగాహన పెంచుకోవాలి. నైతిక ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి.
‘చరిత్రను కాపాడే కంటికి గౌరవం అవసరం’. కాలం మారుతున్న కొద్దీ ఫిల్మ్ కెమెరా, డిజిటల్ కెమెరా, స్మార్ట్‌ఫోన్, ఏఐ వరకు సాంకేతికత ఎంతగా మారినా.. ఒక క్షణాన్ని గుర్తించి దాని ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చూపించే మానవ దృష్టికి మాత్రం ప్రత్యామ్నాయం లేదు. తెలంగాణ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలు ఫోటో జర్నలిస్టుల కెమెరాల్లో శాశ్వతంగా భద్రపడ్డాయి. ఉద్యమాల నుంచి పాలనా మార్పుల వరకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి సామాన్యుల జీవితాల వరకు.. ఒక తరం చూసిన చరిత్రకు వారి ఫోటోలు సాక్ష్యాలుగా నిలిచాయి. ఫోటోను మాత్రమే కాకుండా ఆ ఫోటో వెనుక నిలబడి, చరిత్రను కళ్ల ముందుకు తెచ్చిన ఫోటోగ్రాఫర్‌ను కూడా గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది.

ఇవీ పరిష్కారాలు
ఫోటో జర్నలిస్టులు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల సమస్యలను పరిష్క రించేందుకు ప్రభుత్వ స్థాయిలో చర్యలు అనివార్యం. గుర్తింపు పొందిన ఫోటో జర్నలిస్టులకు అధికారిక కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలి. విధి నిర్వహణలో ఎదురయ్యే అడ్డంకులపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి. ప్రమాదకర విధుల్లో ఉన్న ఫోటో జర్నలిస్టులకు బీమా, భద్రతా చర్యలు అందుబాటులోకి తేవాలి. ఫోటోగ్రఫీ రంగంలో శిక్షణ, నైపుణ్యాభి వృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. మీడియా సంస్థల స్థాయిలో ఫోటో జర్నలిస్టులను వార్తా బృందంలో సమాన భాగస్వాములుగా గుర్తించాలి. వారి పరికరాలు, ప్రయాణం, శిక్షణ అవసరాలకు తగిన మద్దతు ఇవ్వాలి. ఫోటో క్రెడిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. డిజిటల్ ప్లాట్‌ఫారాల్లో ఫోటోల అనధికార వినియోగాన్ని అరికట్టేందుకు కాపీరైట్ విధానాలను బలోపేతం చేయాలి.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -