Wednesday, August 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడొద్దు

పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడొద్దు

- Advertisement -

డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ
ఈస్ట్ మారేడ్‌పల్లి పాలిటెక్నిక్ కాలేజీ ఎదుట రెండో రోజు కొనసాగిన ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో

​పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడకుండా డిప్లోమా కోర్సులను మరింత బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్‌ ‌చేసింది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐటీఐ-ఏటీసీలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన మంగళవారమూ కొనసాగింది. వందలాది మంది విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు కళాశాల ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యా విధానాలు పాలిటెక్నిక్ డిప్లొమా వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ అనేది ప్రత్యేకమైన సాంకేతిక విద్యా విధానమని, దాని ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సింది పోయి, ఐటీఐ-ఏటీసీలతో కలపడం ద్వారా దాని ప్రత్యేకతను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శిక్షణ పేరుతో రాష్ట్ర సాంకేతిక విద్యామండలి (ఎస్‌‌బీటీఈటీ) వ్యవస్థను బలహీనపరచడం సరికాదన్నారు.

నూతన జాతీయ విద్యా విధానం-2020 పేరుతో విద్యను కేవలం నైపుణ్య శిక్షణకే పరిమితం చేయకూడదని అన్నారు. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉన్నత విద్య, ఇంజినీరింగ్ ప్రవేశాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కేలా విధానాలు ఉండాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆధునిక ప్రయోగశాలలు (ల్యాబ్స్), గ్రంథాలయాలు, హాస్టల్ సదుపాయాలు వంటి మౌలిక వసతులు కల్పించాలని, ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు, విద్యా నిపుణులతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. జీవో నం. 97ను వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లెనిన్, నాయకులు ఆంజనేయులు, భరత్, చరణ్, కార్తీక్, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -