సిటీలో పెరుగుతున్న కేసులు
రెండు నెలలపాటు అవగాహనకు సర్కార్ ప్లానింగ్
హైదరాబాద్‌లో ఇంకా ప్రారంభం కాని ప్రక్రియ
దీర్ఘకాలిక సెలవులో జిల్లా హెచ్‌ఐవీ నివారణ ఆఫీసర్
అవగాహనపై నీలినీడలు.. పట్టించుకోని డీఎంఅండ్‌హెచ్‌ఓ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హ్యుమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఏడాదికేడాది కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధి చాపకింది నీరులా విస్తరిస్తోంది. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయాలని భావించిన ప్రభుత్వం, ఈ నెల 12 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు రెండు నెలలపాటు ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లోనూ ప్రారంభం కాగా.. హైదరాబాద్ జిల్లాలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. అమలు చేయడానికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ విభాగం అధికారి (డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ) దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడంతో కార్యక్రమం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అసలు జిల్లాలో హెచ్‌ఐవీపై అవగాహన కల్పిస్తారా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల అలసత్వం.. కేసులు పెరుగుదల
ఇతర జిల్లాల్లో అవగాహనా కార్యక్రమాలు మొదలైనా.. అత్యధిక జనాభా, వలసలు, యువత, రద్దీ ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు ఉన్న హైదరాబాద్‌లో మాత్రం ప్రచారంలో కదలికల రావడం లేదు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఈ కార్యక్రమం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో కొంతకాలంగా ఈ వ్యాధి పెరుగుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ జిల్లాలో నాన్-ఏఎన్‌సీ (జనరల్)లో మొత్తం 1,27,111 మందికి పరీక్షలు చేయగా.. 2,557 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,98,150 మందికి పరీక్షలు చేయగా.. 1,658 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నట్టు తేలింది. ఇక ఏఎస్‌సీ కింద 2024-25లో 72,622 మందికి పరీక్షలు చేయగా.. 121 మందికి పాజిటివ్ వచ్చింది. 2025-26లో 67,929 మందికి పరీక్షలు చేయగా 136 మందికి పాజిటివ్ వచ్చింది. ఇవి అధికారిక రికార్థుల్లో ఉన్న లెక్కలు మాత్రమే. అది కూడా జిల్లాలోని 11 ఏఆర్‌టీ సెంటర్లలో బయటపడిన కేసులు మాత్రమే. దీనికి యూపీహెచ్‌సీలలో నమోదయ్యే కేసులను కలిపితే వేలల్లో ఉండొచ్చు. ప్రయివేటు ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకున్న వారిలో ఏడాదికి మరో 2వేలకు పైగా అనధికారికంగా ఈ వ్యాధి బారిన పడ్డవారు ఉండొచ్చని అంచనా.
వ్యాధి ప్రబలే విధానంపై అవగాహన అవసరం
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించాలంటే, ఈ వ్యాధి ప్రబలే విధానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 8వ తరగతి చదువుతున్న కౌమారదశ కలిగిన వారి నుంచి మొదలుకుని హైస్కూల్స్, జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు దీనిపై వివరించి వారితో ర్యాలీలు, అవగాహనా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. హెచ్ఐవీ ప్రబలితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? నిర్ధారణ కోసం ఎలాంటి పరీక్షలు చేసుకోవాలి..? వ్యాధి ప్రబలిన వారిని ఎలా చూడాలి..? ఎప్పటికప్పుడూ వైద్యుల సలహాలతోపాటు మందుల వినియోగం తదితర విషయాలను ప్రజలకు ఈ అవగాహనా కార్యక్రమంలో వివరించాల్సి ఉంది. కానీ హైదరాబాద్ జిల్లాలో ఎలాంటి కార్యాచరణా ముందుకు సాగకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్ఐవీ నిర్ధారణ, చికిత్సకు జిల్లాలో విస్తృతమైన సేవల నెట్ వర్క్ అందుబాటులో ఉన్నా.. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఇంకా కదలకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఎయిడ్స్ అవగాహనపై యంత్రాంగం కదిలి క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.



