Tuesday, September 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యా వ్యవస్థను దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి

విద్యా వ్యవస్థను దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి

- Advertisement -

మొన్న ఇంటర్మీడియట్ రద్దు అన్నడు..
నేడు పాలిటెక్నిక్ విద్యను ప్రమాదంలోకి నెట్టాడు
ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి
అయోధ్య పురం భూబాధితులకు,
స్థానిక యువతకు కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలి
వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా/కాజీపేట

విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నాడని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంతో పాటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కేంద్రంలో భారీ ఆందోళన చేపట్టారు. హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి 3కిలోమీటర్ల దూరంలోని హనుమకొండ కలెక్టరేట్ వరకు వేలాదిమంది విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఫీజు పోరుయాత్రతో ఓరుగల్లు నగరం దద్దరిల్లింది. భారీ ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్న కవితతో సహా విద్యార్థులను లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. విద్యార్థులతో కలిసి కవిత కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం అధికారులు అనుమతించారు. అంబేద్కర్ సర్కిల్‌లో, కలెక్టరేట్ ఎదుట కార్యక్రమాల్లో కవిత మాట్లాడారు. ప్రభుత్వం రూ.13 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాల్సి ఉందని, వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొన్న ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు చేస్తానని అన్నారని.. ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాడని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా విద్యార్థుల జీవితాలు ఆగమావుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో పేదలు, ఆడబిడ్డలు చదువుకు దురువుతున్నారని తెలిపారు. ప్రొఫెషనల్ కోర్సులు, డిగ్రీలు పూర్తి చేసినా రీ యింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించక పోవడంతో కాలేజీల యాజమాన్యాలు వారికి సర్టిఫికెట్లు ఇవ్వక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను శాసన మండలిలో ప్రశ్నించినప్పుడు నెల నెలా ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పారని మండిపడ్డారు. ఏండ్ల తరబడి బకాయిలు పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న కాలేజీలు మూత పడుతున్నాయన్నారు. ఫీ రీయింబర్స్ మెంట్ పై ఆధారపడి చదువుకునే విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అటు ప్రజావాణిలో కూడా ఇదే సమస్యతో విద్యార్థులు వస్తున్నారని కలెక్టర్ అన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని యాజమాన్యాలతో మాట్లాడి వారికి సర్టిఫికెట్స్ ఇప్పిస్తున్నామని హామీ ఇచ్చారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్ల నుంచి పోటీలో ఉంటామని ఆమె తేల్చి చెప్పారు. ఇక్కడ నుంచే టీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభిస్తామన్నారు. తరాలపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరించి కవిత మాట్లాడారు. మెరుగైన విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందాలన్నదే తన లక్ష్యమని అన్నారు.
​వనవాసం పోయినట్టు అయోధ్యపురం రైతుల పరిస్థితి
అయోధ్యపురం రైతుల పరిస్థితి వనవాసం పోయినట్టుగా ఉందని టీఆర్‌ఎస్ చీఫ్ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అయోధ్యపురంలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఆమె సందర్శించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కారణంగా భూములు కోల్పోతున్న బాధితులందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దేవాదాయ శాఖతో పాటు బాధితుల భూములు కలిపి ఉండటంతో గతంలో డీజిల్ ఫ్యాక్టరీ కోసం భూసేకరణ చేసినప్పుడు 90 శాతం తమకు 10 శాతం దేవాదాయ శాఖకు పరిహారం ఇచ్చారని బాధితులు చెప్పారు.
ఇప్పుడు మాత్రం ఎకరాకు రూ.33లక్షల పరిహారం ఇస్తే అందులో తమకు రూ.8లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా ఎక్కువ మొత్తం దేవాదాయ శాఖకు అప్పగించారని తెలిపారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. నిర్వాసితులకు పరిహారంలో న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని కవిత వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు కూడా లేఖ రాస్తానని అన్నారు. అనంతరం తరాలపల్లిలోని పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన పూజల్లో కవిత పాల్గొని పూజలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -