భూసేకరణ పరిహారానికి సంబంధించి ఆర్థికశాఖ, రోడ్లు, భవనాల ముఖ్యకార్యదర్శులపై కోర్టు ధిక్కరణ పిటిషన్లు
ఆదేశాల ఉల్లంఘనపై విచారణకు
హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు
గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం
హైదరాబాద్ : కోర్టు ధిక్కరణ పిటిషన్లలో బెయిలబుల్ వారెంట్ జారీ అయినప్పటికీ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్ విచారణకు గైర్హాజరు కావడంపై హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ అయ్యాక విదేశాలకు ఎలా వెళతారని? విమానాశ్రయంలో అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏమిటని నిలదీసింది. ఉన్నతస్థానంలో ఉన్న అధికారులకు కోర్టు ధిక్కరణ పిటిషన్లలోని సాధారణ నిబంధనలు కూడా తెలియవా అంటూ నిలదీసింది. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే ఉపేక్షించబోమని హెచ్చరించింది.
కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు : భూసేకరణ పరిహారానికి సంబంధించి కింది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన మేరకు సదరు అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. భూసేకరణ పరిహారంలో భాగంగా నిర్ణయించిన మొత్తంలో 50 శాతాన్ని 3 నెలల్లో డిపాజిట్ చేయాలంటూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నాగిరెడ్డితో పాటు మరొకరు సంబంధిత అధికారులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కరణ కింద సదరు అధికారులను న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించింది. అయినప్పటికీ అధికారులు గైర్హాజరు కావడంతో, ఆయా అధికారులపై గత వారం బెయిలబుల్ వారెంట్స్ జారీ అయ్యాయి.
ఇక ఉదాసీనంగా ఉండబోం :
ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని, ధర్మాసనం ఆదేశాలను అమలు చేశామని అధికారులు వారెంట్ రీకాల్ చేశారు. హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అసెంబ్లీ సమావేశాలుండటంతో కోర్టుకు హాజరుకాలేకపోయారనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేశాక అధికారులు హాజరు కావడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారని, కనీసం ఆన్లైన్లో కూడా హాజరు కావడంలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కోర్టు కూడా ఇక ఉదాసీనంగా ఉండబోదని, గైర్హాజరు పిటిషన్లను అనుమతించబోమని, అలా చేస్తే వారు సాధారణ అంశంగా పరిగణించే అవకాశముందని వ్యాఖ్యానించారు.
మరోసారి పునరావృత్తం కాకూడదు :
భూసేకరణకు సంబంధించిన పరిహారంలో నిర్వాసితులపై 50 శాతం డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చి 12 వాయిదాలు తీసుకున్నా ఎందుకు చెల్లించరని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రజలకు చివరి అవకాశం న్యాయస్థానం ఒక్కటేనని, భూములు తీసుకున్నాక కనీసం 50 శాతం కూడా చెల్లించకపోతే ఎలా అని నిలదీశారు. ఉత్తర్వులు అమలైనప్పటికీ కోర్టు ధిక్కరణ ముగిసిపోదని గుర్తించాలంటూ హెచ్చరించారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులే ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. మరోసారి ఇది పునరావృతం కాకూడదని హెచ్చరించారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేశామని, కోర్టు ధిక్కరణ విచారణలో క్షమాపణ కోరుతూ ఇద్దరు అధికారులు అఫిడవిట్లు దాఖలు చేయడంతో విచారణను మూసివేశారు.
విచారణకు హాజరుకాని సీనియర్ ఐఏఎస్ లపై హైకోర్టు సీరియస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



