Monday, June 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅనర్హులను ఏరివేయడమే సర్‌ లక్ష్యం

అనర్హులను ఏరివేయడమే సర్‌ లక్ష్యం

- Advertisement -

అదే సందర్భంలో అర్హులకు అన్యాయం జరగనివ్వం
ఒక వర్గం ఓట్లను తొలగిస్తారనేది అపోహ మాత్రమే
కుల, మతాలకతీతంగా ఎన్యూమరేషన్‌ ఫారాల అందజేత
ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు నమోదు చేసుకోవాలి
మ్యాపింగ్‌ అయిన వారు ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేదు : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌‌రెడ్డి


​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలో అనర్హులను ఏరి వేయడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ప్రక్రియ లక్ష్యమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌‌లోని బీఆర్కే భవన్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాలో ప్రస్తుతం ఎక్కడ ఓటు ఉందో అదే అడ్రస్‌కు ఎన్యూమరేషన్ ఫాంను బీఎల్‌‌ఓ అందజేస్తారని తెలిపారు. ఆ అడ్రస్‌లో ఓటరు లేకపోతే అతని ఓటు అక్కడ తొలగించబడుతుందన్నారు. ప్రస్తుతం ఉంటున్న అడ్రస్‌తో మళ్లీ ఓటరు ఫాం8తో ఓటును నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. సర్‌ ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమనీ.. ఓటర్లను తొలగించడం కాదని స్పష్టం చేశారు. 24 ఏండ్లుగా రాష్ట్రంలో ఓటర్ జాబితా నవీనీకరణ జరగలేదన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది మృతి చెంది ఉంటారనీ, కొందరు వలస వెళ్లి ఉంటారని తెలిపారు. వాటన్నింటినీ సరి చేయడానికే ఎన్నికల సంఘం సర్‌‌ను చేపట్టిందని చెప్పారు. ఇందులో రాజకీయ ప్రేరేపితం ఏమీ లేదనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతీ పౌరునికి ఓటర్‌‌ నమోదు ఫారం ఇస్తారని తెలిపారు. ఎన్యూమరేషన్‌లో ముస్లిం, హిందూ అనే వ్యత్యాసం ఉండదని చెప్పారు. ఒక వర్గం ఓట్లు తొలగిస్తారనే ఆందోళన అవసరం లేదని సీఈవో సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

​జులై 25 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం
జూన్‌ 25 నుంచి జులై 24 వరకు బూత్‌ ‌లెవల్‌ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి సర్వే నిర్వహిస్తారని ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌‌రెడ్డి చెప్పారు. జులై 1న ముసాయిదా ఓటర్‌ ‌జాబితా ప్రచురణ, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్‌ 28 ‌వరకు వాటి పరిష్కారం అనంతరం అక్టోబర్‌ 1న ‌తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఈఆర్‌‌ఓ, బీఎల్‌ఓలకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసినట్టు వెల్లడించారు. బీఎల్‌ఓలు ప్రతి ఇంటిని సందర్శించి రెండు ప్రతుల ఓటరు నమోదు ఫారాలను అందజేస్తారనీ, అందులోని కాలాలన్నింటినీ పూరించి తిరిగి అందజేయాలన్నారు. బీఎల్‌‌ఓ ఇంటిని సందర్శించినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే, కనీసం మూడు సార్లు సందర్శిస్తారని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఓటర్‌ ‌నమోదు ఫారం అందజేయకుంటే వారు ఓటర్‌‌గా నమోదు కారని స్పష్టం చేశారు. సర్‌ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అదికారులు కచ్చితంగా పాటించాలని ఆదేశించినట్టు తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు స్వచ్ఛంద కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పారదర్శకంగా నమోదు ప్రక్రియను చేపడతారని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో కనీసం వారానికి ఒకసారి సమీక్షా సమావేశాలను నిర్వహించి అవగాహన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు.

​పూర్తి సమాచారం ఇవ్వని వారికి నోటీసులు
బీఎల్‌‌ఓలు పంపిణీ చేసిన ఓటర్‌ ‌నమోదు ఫారంలో పూర్తి సమాచారం పొందు పర్చని వారికి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. వారి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా నిబంధనల మేరకు వారి ఓటు నమోదుపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అలాగే నిర్దిష్ట సమయంలో నమోదు ఫారం సమర్పించలేని ఓటర్లు, క్లెయిమ్ లు, అభ్యంతరాల కాలంలో నిర్దేశిత ప్రకటన ఫారంతో పాటు ఫారం-6 సమర్పించి పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలు సమర్పించని ఓటర్ల విషయంలో ఈఆర్‌‌వో, ఏఈఆర్‌‌వోలు విచారణ చేస్తారని తెలిపారు.

​సర్‌ ‌మ్యాపింగ్‌ ‌తప్పని సరి కాదు
సర్‌ మ్యాపింగ్‌ తప్పని సరి కాదనీ, మ్యాపింగ్‌ అయిన వారు ఈసీ గుర్తించిన ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఓటర్ల పేరు లేదా తమ తల్లిదండ్రులు, తాత లేదా అమ్మమ్మ పేర్లు 2002 ప్రత్యేక సమగ్ర సవరణ ఓటరు జాబితాలో ఉన్నట్లయితే వాటి వివరాల ఆధారంగా బీఎల్‌ఓ మ్యాపింగ్‌ ‌చేస్తారని తెలిపారు. సర్‌‌లో నమోదు కాని వారు తమ స్థానికతను రుజువు చేసుకునేందుకు ఆధార్‌ ‌కార్డు మినహా 11 గుర్తింపు కార్డులు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు. అందులో ఏదైనా ఒక కార్డును బీఎల్‌‌ఓకు సమర్పించాలని తెలిపారు.

​రాష్ట్రంలో సర్‌ షెడ్యూల్….
ఇంటింటి గణన……. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు
ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ ………… జులై 31
అభ్యంతరాల దాఖలు ……. జులై 31 నుంచి ఆగస్టు 08 వరకు
అభ్యంతరాల పరిష్కారం……… జులై 31 నుంచి ఆగస్టు 28 వరకు
తుది ఓటరు జాబితా ప్రచురణ………………. అక్టోబర్‌ 1

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -