Friday, February 20, 2026
E-PAPER
Homeఎడిట్ పేజియుద్ధమేఘాలు!

యుద్ధమేఘాలు!

- Advertisement -

కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మధ్యప్రాచ్యం మళ్లీ కల్లోలంగా మారుతోంది. ఇరాన్‌పై పెరుగుతున్న సైనిక, ఆర్థిక ఒత్తిడి, గాజా మారణకాండ పరిణామాలు, హర్మూజ్‌ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు, ఇవన్నీ కలిసి ప్రపంచాన్ని అస్థిరత దిశగా నడిపిస్తున్నాయి. ఇది కేవలం దేశాల మధ్య ఘర్షణ కాదు, సామ్రాజ్యవాద శక్తులు, తమ అధిపత్యాన్ని కాపాడుకునేందుకు, ఎవరూ ఎదురుతిరగకుండా తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఆడుతున్న ప్రమాదకర రాజకీయ క్రీడ. మొన్నటివరకు వెనిజులాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు కొనసాగించిన అమెరికా, తలొగ్గక పోవడంతో మాదక ద్రవ్యాల రవాణా పేరుతో అధ్యక్షుడు నికోలస్‌ మదురో దంపతులను కిడ్నాప్‌ చేసింది. విచారణ పేరుతో ఇప్పటికీ తమవద్దే బంధీలుగా ఉంచుకుంది. ఇది ఆధిపత్యం, అహంకార ధోరణే తప్ప వేరేకాదు. చమురు సంపద కలిగిన దేశం తన స్వతంత్ర ఆర్థిక విధానాన్ని కొనసాగిస్తే అది అమెరికా ప్రయోజనాలకు విరుద్ధం. దాన్ని అడ్డుకోవడానికే వెనిజులా మీద కేంద్రీకరించింది. ఇప్పుడు లొంగదీసుకునేందుకు ఇరాన్‌పై ఒత్తిడి తెస్తోంది.

ప్రపంచంలో చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న మధ్యప్రాచ్యంలో పాగా వేయాలన్నది అమెరికా లక్ష్యం. గత రెండు దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం, భద్రత పేరుతో జోక్యం చేసుకుంటోంది. ఇరాక్‌, లిబియా, సిరియా వంటి దేశాలపై దాడులు కూడా చేసింది. కానీ, ఆ దాడుల అనుభవం నేర్పిన పాఠం-శాంతికాదు, విధ్వంసమే. చమురు వనరులపై నియంత్రణ, భౌగోళిక ఆధిపత్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తమకు సవాల్‌ విసురుతున్న చైనా, రష్యాల ప్రభావాన్ని అడ్డుకోవడం ప్రధాన ఉద్దేశం! అయితే, రష్యా, చైనాలు మధ్యప్రాచ్య దేశాలపై పట్టువిధిస్తే, అక్కడి దేశాలు తమ మాట వినవనే అమెరికా భయం. అందుకే మొన్న వెనిజులా మీద దాడికి దిగింది. ఇప్పుడు ఇరాన్‌ మీద యుద్ధానికి కాలు దువ్వుతున్నది! ముందు ఆర్థిక ఆంక్షలు, తర్వాత సైనిక విన్యాసాలు చేపట్టింది. ఓవైపు చర్చలకు సిద్ధమంటూనే, మరోవైపు ఆ చర్చలను విచ్ఛిన్నం చేసే పద్ధతులకు పాల్పడుతోంది.ఇరాన్‌పై ఒత్తిడికి అణు కార్యక్రమం ఒక్కటే కారణం కాదు, ఇరాక్‌, సిరియా, లెబనాన్‌ వంటి దేశాల్లో దాని ప్రభావం పెరగడం కూడా నచ్చని అంశం.

ఇరాన్‌పై ‘అణు ఆయుధ వ్యాప్తిని అడ్డుకోవాలి’ అమెరికా చేస్తున్న వాదన. కానీ, రష్యాతో అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం గడువు 2026 ఫిబ్రవరితో ముగిసింది, నేటికీ పునరుద్ధరణ చేసుకోలేదు. ఇలాంటిది అణు సమతుల్యతను మరింత అనిశ్చితిలో పడేసే విధానం. అంటే ఒకవైపు అణువ్యాప్తి నిరోధం పేరుతో ఒత్తిడి, మరోవైపు పెద్ద అణుశక్తుల మధ్య నియంత్రణ వ్యవస్థ బలహీనపడటం. ఇది ఇరాన్‌పై ఒత్తిడి, మధ్యప్రాచ్య శక్తి సమీకరణలను ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది. గల్ఫ్‌ ప్రాంతంలో సైనిక బలగాల మోహరింపు, యుద్ధనౌకలు, ఫైటర్‌జెట్లు, సంయుక్త సైనిక విన్యాసాలు అందులో భాగమే. వీటికి ‘స్వేచ్ఛాయుత నావిగేషన్‌’ పేరు చెబుతున్నప్పటికీ ఇరాన్‌కు అర్థమైంది-ఇదంతా తమమీద చేపట్టిన వ్యూహాత్మక ఒత్తిడిలో భాగమేనని. ఇలాంటప్పుడు చైనా, రష్యాలు జోక్యం చేసుకోవచ్చుకదానన్న అభిప్రాయాలు వస్తాయి. కానీ, ప్రత్యక్ష జోక్యం ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది.ఆ రెండు దేశాలు అమలుచేసే విధానం అమెరికా ఆంక్షల రాజకీయాన్ని బలహీనపర్చడం. దౌత్యమార్గంలో ప్రభావం చూపడం.

హార్మూజ్‌ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్‌ హెచ్చరిక కూడా ప్రతిస్పందనలో భాగమే. ప్రపంచంలోని అన్ని దేశాలకు చమురును గణనీయంగా రవాణా చేసే మార్గమిది. ఇరాన్‌- ఒమాన్‌ మధ్యలో ఉన్న ఈ జలసంధి మధ్యప్రాచ్య దేశాలకు ఆయువు పట్టు లాంటిది. ఇక్కడ ఉద్రిక్తత పెరిగితే చమురు ధరలు ఎగిసిపడతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక ఒడిదుడుకుల్లో పడతాయి. అప్పుడు ప్రపంచ ఆర్థికంపై ప్రభావం చూపడమే కాదు, తమ చమురు రవాణాకు అడ్డుతగిలితే ఇతర దేశాల రవాణాను కూడా ప్రభావితం చేయగలమని చెప్పడం. దీనికి దోషి అమెరికానేనన్న సంకేతం. ఏమైనా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచశాంతికి పరీక్షగా మారాయి. శక్తి ప్రదర్శనలు, ఆంక్షల రాజకీయాలు సమస్యలు పరిష్కరించవు. అవి మరింత క్లిష్టతరం చేస్తాయి. అమెరికా ఏక చత్రాధిపత్యాన్ని అడ్డుకునే అంతర్జాతీయ సమాజం ఏకమవ్వాలి. యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న ఈ సమయంలో, శాంతి, పరస్పర గౌరవం, సార్వభౌమాధికార పరిరక్షణ- ఇవే ముందుకు నడిపే మార్గాలు. లేకపోతే మధ్యప్రాచ్యం మాత్రమే కాదు, ప్రపంచమే మరో పెద్దసంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -