Friday, April 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅమరావతి వివాదానికి అంతమెప్పుడు?

అమరావతి వివాదానికి అంతమెప్పుడు?

- Advertisement -

సమైక్యాంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయి పుష్కరకాలం పూర్తి కావొస్తున్నది. తెలంగాణకు నాలుగు శతాబ్దాల కాలంగా రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ యథావిధిగా కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాజ ధాని రగడ రోజుకో మలుపు తిరుగుతున్నది. వారికిది కొత్తకాదు, ముందునుంచి ఉన్నదే. పార్లమెంటు ఆమోదంపొంది చట్టబద్ధమైన రాజ ధానిగా అమరావతి మున్ముందు కొనసాగుతుందా? లేదంటే జగన్మోహన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే మూడు రాజధానులు లేదా మావిగన్‌ అంశం తెరపైకి తెస్తారా? అనే ప్రశ్నలు ఏపీ ప్రజలను వేధిస్తున్నాయి. దేశంలో ఎన్నో రాష్ట్రాలు, రాజధానులు ఏర్పడ్డాయి. కానీ, ప్రభు త్వం మారినప్పుడల్లా రాజధాని మారడం ఒక్క ఏపీలోనే చూస్తున్నాం. ప్రభుత్వాధినేతలు ఎవరైనా ఈ రకమైన వివాదం వాంఛనీయం కాదు.

ఆంధ్రులకు రాజధాని కష్టాలుపుట్టుకతోనే మొదలయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆంధ్ర, కేరళ,. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కేంద్రం థార్‌ కమిషన్‌ను నియమించింది. అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాల పునర్వ్య వస్థీకరణ కష్టతరమైందని ఆ కమిషన్‌ భావించింది. నాటి అఖిలభారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య థార్‌ కమిషన్‌ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. చివరికి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, కేంద్ర హోంమంత్రి వల్లభారు పటేల్‌, పట్టాభి ముగ్గురితో జెవిపి కమిటీ ఏర్పాటయింది. ప్రాథమిక అధ్యయనం అనంతరం జెవిపి కమిటీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది కానీ, మద్రాస్‌తో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అంగీకరించలేదు. అదే సమయంలో ఉమ్మడి మద్రాస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆంధ్ర ప్రాంతంలో ఓడిపోయి బలహీన పడింది. రాజధాని అంశం తెరమరుగైంది. అనంతరం ఆంధ్ర రాష్ట్రం కోసం సర్వోదయనేత స్వామిసీతారాం నెల రోజులపాటు నిరాహార దీక్ష చేయగా ఆచార్య వినోబా భావే విరమింపచేశారు. కొంతకాలానికి పొట్టి శ్రీరాములు మద్రాస్‌తో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసం గొంతెత్తినప్పుడు నెహ్రూ పట్టించుకోలేదు. ఉమ్మడి మద్రాస్‌ ముఖ్యమంత్రి రాజాజీ లెక్కచేయలేదు. ఆశయం నెరవేరకుం డానే పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్ష అనంతరం కీర్తిశేషులయ్యారు. ఆగ్రహించిన ఆంధ్రులు పెద్దఎత్తున ఉద్యమిం చారు. తుదకు నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రకటించారు. కానీ, మద్రాస్‌ నగరం దక్కలేదు. అది ప్రకాశం పంతులును నిరాశకు గురిచేసింది.

కృషీకార్‌ లోక్‌పార్టీ అధినేత ఎన్‌జి రంగా, ప్రజాపార్టీ అధినేత ప్రకాశం పంతులు, కమ్యూనిస్టు నేతలు చండ్ర రాజేశ్వరరావు పుచ్చలపల్లి సుందరయ్య, అధికార కాంగ్రెస్‌ నేతలైన రాజాజీ, కామరాజ్‌, నీలం సంజీవరెడ్డి వంటి ఉద్దండులతో ఢకొీనగలిగే స్థితిలో ఉన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు తిరుపతి రాజధానులుగా చర్చకొచ్చినా నాయకుల్లో ఏ ఒక్క నగరం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికిమధ్యే మార్గంగా కర్నూలుకు అందరూ సరేనన్నారు. రాయలసీమలో రాజధాని ఉండాలన్న శ్రీబాగ్‌ ఒప్పందం కూడా అందుకు తోడైయింది. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్‌ 1న ఆంధ్ర రాష్ట్రం (నేటి ఆంధ్రప్రదేశ్‌) ఏర్పడింది. అయితే రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర వైరుధ్యాలు యధావిధిగా కొనసాగుతూ వచ్చాయి. 1956లో హైదరాబాదు రాజధానిగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాక ఆ వివాదాలు తగ్గుముఖం పట్టాయి. నాడు కమ్యూనిస్టులకు పట్టుందన్న కోపంతో విజయవాడ రాజధానికి ఇతర పార్టీలు అంగీకరించలేదు. కానీ వాస్తవానికి గన్నవరం విమానాశ్రయం, కలకత్తా, మద్రాస్‌, హైదరాబాద్‌ కలిపే అతిపెద్దరైల్వే జంక్షన్‌ రహదారులు సమీపంలో బందరు ఓడరేవు, కృష్ణానది, వ్యాపారాలు, సినిమా నిర్మాణాలు, శతాబ్దాల చారిత్రక సాంస్కృ తిక వైభవం అన్నీ ఉన్న విజయవాడ అప్పుడే ఏకాభిప్రాయంతో 1953లోనే రాజధాని అయ్యుంటే ఆంధ్రులకు ఈ దుస్థితి ఉండేది కాదు.

2001లో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభించారు. ఆ సమయంలో సమైక్య రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి అంతా ఆంధ్ర ప్రాంతం వారే. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ హైదరాబాదుతో కూడిన తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడైనా ‘మా రాజధాని సంగతేమిటని’ ఆంధ్ర ప్రాంత నాయకులు చక్రం అడ్డం వేసి ఉంటే అందుకు అవసరమైన నిధుల కేటాయింపు అంశం విభజన చట్టంలో చోటుచేసుకునేదేమో! పార్లమెంటు ఉభయ సభల్లో విభజన బిల్లు ఆమోదం పొందే అంతిమ క్షణాల వరకు తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారే కానీ తమ రాజధాని కోసం రగడ చేయలేదు. ఆంధ్ర నాయకుల వ్యూహాత్మక తప్పిదం అప్పుడే జరిగింది.

రాష్ట్ర విభజన జరిగాక పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు వెనువెంటనే ఆంధ్రాకు మకాం మార్చి రాజధాని ప్రక్రియ ప్రారంభిస్తే బాగుండేది. కానీ, ఏడాదిన్నర పాటు హైదరాబాదులో తచ్చాడుతూ కాలం వృధా చేశారు. ఎలమంచిలి శివాజీ వంటివారు ‘ఎంతకాలం హైదరాబాద్‌ యావ’ అని హెచ్చరిస్తే, తుదకు ‘ఓటుకునోటు కేసు’ వెంటాడితే మేలుకొన్న చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని భూసేకరణ సమస్యలు అధిగమించేనాటికే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. 2014నాటికే విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి దాదాపుగా కలిసిపోయి ఒక మహానగర ఆవిర్భావానికి అవసరమైన పరిపక్వస్థితికి వచ్చాయి. వాటి మధ్య సర్వసౌకర్యాలతో సచివాలయం, శాసనసభా భవనం నిర్మించుకుని 1953లో ఆంధ్ర రాష్ట్రం తొలి హైకోర్టు ఏర్పాటైన కర్నూల్‌లోనే కొత్త హైకోర్టు ఏర్పాటుచేసి ఉంటే పరిస్థితి వేరే ఉండేది. విశాఖను ఐటి పరిశ్రమల హబ్‌గా నిర్ణయిస్తే కేంద్రం దయాదాక్షిణ్యాలు, అప్పులు, భూసేకరణ వివాదాలు లేకుండానే ఆంధ్రులకు ఆమోదయోగ్యమైన రాజధాని ఎప్పుడో ఏర్పడేది. చంద్రబాబు ఎందుకో నేలవిడిచి సాము చేశారు.

జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి తెర వెనక్కి పోయి మూడు రాజధానులు వ్యవహారం ముందుకొచ్చింది. వాస్తవానికి విశాఖపట్నం రాజధానిగా జగన్‌ నిర్ణయించుకుని ఉంటారు. సచివాలయం ఎక్కడుంటే అదే రాజధాని. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుంది. హైకోర్టు, అసెంబ్లీ ఉన్న ఇతర ప్రాంతాలను రాజధాని అనలేము. కొన్ని రాష్ట్రాల్లో అవి రాజధానుల్లో కాకుండా వేరుప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కనుక మూడు రాజధానుల మాటే సరైనది కాదు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు వెనక్కి వెళ్లి అమరావతి మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రతిగా జగన్మోహన్‌ రెడ్డి మావిగన్‌ ముందుకు తెచ్చారు. పెట్టుబడిదారులు, వ్యాపారులు రియల్టర్లు మళ్లీ సందిగ్ధంలో పడ్డారు.

ఒక్క చండీఘర్‌ తప్ప ఏ రాష్ట్ర రాజధాని పార్లమెంటు చట్టంతో ఏర్పడలేదు. అదికూడా నేటికీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. ఇప్పుడేర్పడ్డ అమరావతి మరో సవరణ చట్టానికి అతీతమేమీ కాదని ప్రత్యర్థి వర్గాలు ధీమా ప్రకటిస్తున్నాయి. కొత్తగా నిర్మించిన రాజధానులు సత్వర అభివృద్ధికి నోచుకోలేదు. అందుకు ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నయా రాయపూర్‌ ఒక ఉదాహరణ. సైబరాబాద్‌ నిర్మాతనని చెప్పుకునే చంద్రబాబు అమరావతిని ఏ మేరకు అభివృద్ధి చేస్తారో చూడాలి. అమరావతి కోసం ఎంపిక చేసిన ప్రాంతం భౌగోళికంగా అనువైనది కాదని, రాజధాని నిర్మాణం కోసం తలకు మించిన అప్పుల భారం సమంజసం కాదని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీ పారిశ్రామిక రవాణా వ్యాపారపర్యాటక వినోద రంగాలు రాజధాని సత్వరాభివృద్ధికి దోహదం చేస్తాయని అవేవీ అమరావతికి పెద్దగా అందుబాటులో లేవని నిపుణులు పెదవివిరుస్తున్నారు. అమరావతి ప్రారంభానికి వచ్చిన నాటి ప్రధాని మోడీ ”తట్టెడు మట్టి, చెంబెడు నీళ్లు” ఇచ్చారని ”పాచిపోయిన లడ్డు చేతిలో పెట్టారని” శాపనార్థాలు పెట్టిన తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చాయి. ఇప్పటికీ కేంద్రం ప్రత్యేకంగా పైసా విదల్చలేదు. ‘తాంబూలా లిచ్చాం తన్నుకు చావండి’ అన్నట్లు చట్టం చేసి చేతులు దులుపుకుంది. తన సహకారంతోనే కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తున్న నిజం తెలిసీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు రాజధాని నిర్మాణం కోసం భూరి ధన సహాయం కోసం పట్టుపట్టకుండా చట్టబద్ధత కోసం ఆరాటపడటం ఆయనలోని అభద్రతను ప్రతిబింబించింది. చంద్రబాబుకు వచ్చిన అరుదైన అవకాశం జారవిడుచుకుంటున్నారేమో అనిపిస్తున్నది. ఇక ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో తొలుత అమరావతికి మద్దతు పలికిన జగన్‌ అధికారంలోకి రాగానే మాట మార్చిన వైనం అంతుపట్టలేదు. ఆయన మూడు రాజధానుల ముచ్చట కలగానే మిగిలిపోయింది. రాజధాని కంటే రాజకీయ పంతాలే ప్రధానమైనచోట అభివృద్ధి కుంటుపడుతుంది. పునాది దశలో ఉన్న ఆంధ్రుల రాజధాని ఇటీవల కులాల బురదలో కూరుకుపోవడం బాధాకరం. ఎక్కడైతేనేమి? ఆంధ్రులకు ఇకనైనా ఒక శాశ్వత రాజధాని స్థిరపడి చిరకాలం వర్ధిల్లాలని ఆశిద్దాం.

డా.అయాచితం శ్రీధర్‌
9849893238

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -