విధ్వంసకాండ ధూళి మేఘాలు వర్షిస్తోన్న
రక్తపువానలో మరణమృదంగానికి
రసజ్ఞత ప్రదర్శించడమే యుద్ధం!
ఆహాలు ఆధిపత్యాలు బాధ్యతారాహిత్యాలు
అధినేతలు అదేపనిగా విసర్జిస్తే
విషబీజాలై మొలకెత్తి యుద్ధం నేపథ్యాలై
వేర్లు భూమండలాన్ని కబళిస్తోంటే
కొమ్మలు కొమ్ముల్లా కమ్ముకొస్తుంటారు
శవాల దిబ్బల్లో సామాన్యుడు మృత్యువుతో నిత్యసావాసం చేస్తూ
ఆకాశంలో సూర్యచంద్రులకు బదులు
చెవులు చిల్లులు పడే అస్త్రాల్ని దర్శిస్తున్నాడు
ఎడతెరిపి లేని పోరాటంలో
విధ్వంసం తప్ప విజయం దక్కదని తెలిసినా
విలయం పావులు కదుపుతూ
పైపైకి దూసుకొస్తూనే వుంటుంది
అలుపొస్తే సీజ్ ఫైరనీ, గెలుపొస్తే రేజ్ ఫైరనీ
వార్ ఎడిక్టరు నిప్పులు కక్కుతుంది!
యుద్ధాన్ని ఆహ్వానిస్తే దాని విషపు నవ్వుల్లోనే
దారుణ మారణహోమపు ఆనవాళ్లు
దోబూచులాడ్డం మున్ముందే కనిపిస్తుంది!
జయాపజయాలతో దానికేం పనిలేదు..
మనిషిని జంతువుగా ఏమార్చడం
మానవత్వాన్ని పాతరేసి పతనాన్ని శాసించడం
పాత రాతియుగాన్ని మళ్లీ పరిచయం చేసి
నవతరం భవితను ఆసాంతం
తుడిచిపెట్టేయడమే దాని అంతిమ లక్ష్యం!
– భీమవరపు పురుషోత్తమ్,
9949800253
యుద్ధకాండ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



