సమిష్టిగా పని చేశారు.. ఫలితాలు సాధించారు…
సీఎం, పీసీసీ చీఫ్‌లకు కాంగ్రెస్ అధిష్టానం కితాబు
‘మున్సిపోల్స్’ విజయంపై అభినందనలు
సంక్షేమ పథకాలే మన ఆయుధాలు
వాటి అమల్లో రాజీపడొద్దంటూ దిశా నిర్దేశం
పార్టీ పనితీరు సంతృప్తికరం
కానీ ఇక్కడితో ఆగిపోవద్దంటూ సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌పై కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసల జల్లు కురిపించింది. ‘తెలంగాణలో పార్టీ పనితీరు భేష్.. పాలన శభాష్…’ అంటూ వారికి కితాబిచ్చింది. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించారంటూ ఇరువురిని అభినందించింది. రాష్ట్ర స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా ప్రతీ నాయకుడు, కార్యకర్త సమిష్టిగా పని చేయటం వల్లే ఇది సాధ్యమైందంటూ పేర్కొంది. వారందరినీ ఐక్యంగా ముందుకు నడిపించిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ కాంగ్రెస్‌కు మరింత జవసత్వాలను చేకూర్చిందంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో గురువారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఖర్గే, రాహుల్‌తోపాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మోడీ సర్కారు వివిధ చట్టాల్లో చేస్తున్న మార్పులు, చేర్పుల గురించి ఈ సందర్భంగా అగ్రనేతలు చర్చించారు. వాటిని వ్యతిరేకిస్తూ చేపట్టాల్సిన కార్యాచరణపై సమాలోచనలు చేశారు.
ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలు, కాంగ్రెస్ సాధించిన విజయం గురించి సీఎం రేవంత్ రెడ్డి… అగ్రనేతలకు వివరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ఈ విజయానికి కారణాలని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరసగా జరిగిన పార్లమెంటు, శాసనసభ ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్లలో పార్టీ జయకేతనం ఎగరేసిందని గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి, మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్, తాను కలిసి అమలు చేసిన వ్యూహాలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పుకొచ్చారు. తద్వారా తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చి, తిరుగులేని శక్తిగా మలిచామని పేర్కొన్నారు. మున్ముందు నిర్వహించబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైతం ఇవే ఫలితాలు పునరావృతమవుతాయంటూ సీఎం ఏఐసీసీ పెద్దలకు హామీ నిచ్చారు. ఆ మేరకు ఇప్పటి నుంచే కృషి చేస్తున్నామని ఆయన వివరించారు.
గతంలో బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత వల్ల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలించిందని వాదిస్తున్న వారికి.. ఈ ఫలితాలు చెంపపెట్టు లాంటివని ఖర్గే వ్యాఖ్యానించినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంది కాబట్టే…లోకల్ బాడీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామంటూ ఆయన విశ్లేషించారు. సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌కు అసలైన ఆయుధాలని, అందువల్ల వాటి అమల్లో రాజీపడొద్దని ఖర్గే సూచించారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పని తీరుపట్ల కాంగ్రెస్ అగ్రనేతలు ఈ సందర్భంగా సంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఇక్కడితో ఆగిపోవద్దని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు పోవాలని వారు రాష్ట్ర నేతలకు మార్గదర్శనం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి గురించి వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీటి అమలు తీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉందంటూ రాహుల్ గాంధీ… సీఎం, డిప్యూటీ సీఎంలను ఆరా తీశారు. రాష్ట్రంలో వరి సాగు, ధాన్యం కొనుగోళ్ల గురించి ఖర్గే వివరాలు అడిగారు. తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్టు మంత్రి తుమ్మల ఆయనకు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ముందు నిర్వహించాలా? లేక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లను ముందు నిర్వహించాలా? అనే విషయమై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. దీనిపై క్యాబినెట్‌లో చర్చించి, నిర్ణయం తీసుకోవాలంటూ ఖర్గే, రాహుల్ గాంధీ… రేవంత్ రెడ్డికి సూచించినట్టు సమాచారం.
‘రాజ్యసభ’పై చర్చ…
కాగా రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీ గురించి సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్… ఖర్గే, రాహుల్‌తో చర్చించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ఆయా స్థానాల్లో ఎవరెవరిని పోటీకి నిలబెట్టాలనే దానిపై సమావేశంలో స్పష్టత రాలేదని ఆయా వర్గాలు వివరించాయి. మరోవైపు పార్టీ అధికారానికి దూరంగా, కష్టకాలంలో ఉన్నప్పుడు దాన్ని అంటిపెట్టుకుని ఉన్న నాయకులకు ఇప్పుడు న్యాయం చేయాలంటూ అగ్రనేతలు సూచించారు. వీరిలో కొందరికి నామినేటెడ్ పోస్టులు, మరికొందరికి పార్టీ పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించాలంటూ వారు సీఎం, పీసీసీ చీఫ్‌లను కోరారు. ఆ మేరకు వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తామంటూ సీఎం వారికి వివరించినట్టు గాంధీ భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
బీఆర్‌ఎస్, బీజేపీని మరింత కట్టడి చేయండి
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్‌పై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని తాజా ఫలితాల ద్వారా వెల్లడైందని అధిష్టానం స్పష్టం చేసింది. ప్రజలకు చేరువైతేనే పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పింది. అయితే ఇదే సందర్భంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, విపక్ష బీజేపీని మరింత కట్టడి చేయాలని అగ్రనేతలు సూచించారు. ఎప్పటికప్పుడు ఆ పార్టీ ఎత్తుగడలకు చెక్ పెడుతూ వారి విస్తరణ ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు.
శాఖల వారీగా ఆరా…
సుదీర్ఘ భేటీలో ఖర్గే, రాహుల్ గాంధీ శాఖల వారీగా స్కీంల పరిస్థితిపై ఆరా తీశారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు… అన్ని శాఖల మంత్రులతోనూ అగ్రనేతలు కాసేపు ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఆయా శాఖల్లో తాజా పరిస్థితులు, ప్రజలకు చేరువయ్యేలా తీసుకుంటున్న నిర్ణయాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీలు /గిరిజనులు, దళితులు, గిగ్ వర్కర్లలకు సంబంధించిన అంశాలపై తెలుసుకునేందుకు రాహుల్ ఆసక్తి చూపారు. ఇటీవల జరిగిన మేడారం జాతర గొప్పతనాన్ని మంత్రి సీతక్కను అడిగి మరి రాహుల్‌గాంధీ తెలుసుకున్నారు.
మరింత టీం వర్క్ అవసరం
తాజా ఎన్నికల ఫలితాలు రెండేండ్ల పాలనకు నిదర్శనమే అయినా… 2029 ఎన్నికలు టార్గెట్ అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఈ విషయంలో టీం వర్క్ మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకొని మంత్రులు మనస్పర్ధలు తెచ్చుకోవద్దనీ, సర్దుకుని పోతూ సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
గిగ్ వర్కర్లకు చట్టాన్ని త్వరగా తీసుకురండి
గిగ్ వర్కర్లకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పాలసీని తెలుసుకునేందుకు రాహుల్ ఆసక్తి చూపారు. ఇందులో రాష్ట్ర కార్మిక శాఖ చేస్తోన్న కసరత్తు, పాలసీలోని ముఖ్య అంశాలు, విధివిధానాలను ఆ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని అడిగి తెలుసుకున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో గిగ్ వర్కర్లు, ఆ అసోసియేషన్ల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో తన దృష్టికి వచ్చిన… గిగ్ వర్కర్ల భద్రత, ఆర్థిక భరోసా, మహిళ గిగ్ వర్కర్ల సమస్యలను సమావేశంలో రాహుల్ వివరించారు. ముఖ్యంగా దళిత, గిరిజనులు ఈ సెక్టార్లో ఎక్కువగా ఉన్నారని వారికి అన్ని విధాలుగా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
పార్టీ భేష్ పాలన శభాష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



