– వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో అక్రమాలు
– కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు సాగు పరికరాల ధరల పెంపు
– బహిరంగ మార్కెట్‌తో పోల్చితే సబ్సిడీ పథకంలోనే అధిక ధరలు
– అధికారులకు కాసుల వర్షం.. అవినీతి జరిగినట్టు ఆరోపణలు
– రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు : వ్యవసాయ అధికారి
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధి
‘ధరల మోత…సబ్సిడీల మేత’ అన్నట్టుగా మారింది వ్యవసాయ యాంత్రీకరణ పథకం. రైతులకు లాభదాయకంగా ఉండాల్సిన సబ్సిడీ పథకం అందుకు విరుద్ధంగా కొనసాగుతుంది. సబ్సిడీ యంత్రాల ధరలు బహిరంగ మార్కెట్‌తో పోల్చితే రైతులకు ఏలాంటి ఉపయోగంలేదు. యంత్రాల తయారీ కంపెనీల ప్రతినిధులతో కుమ్మక్కైన కొంతమంది అధికారులు అడ్డగోలుగా యంత్రాల ధరల్ని పెంచారు. యంత్రాల తయారీ కంపెనీలే నేరుగా సరఫరా చేస్తున్నందున మార్కెట్ కంటే తక్కువ ధరలకే రైతులకు అందించడమే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ముఖ్య ఉద్దేశం. కానీ..! అధికారుల కక్కుర్తి వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యంత్రాల ధరలను పెంచి దోపిడికి పాల్పడుతున్నట్టు పలువురు డీఏవోలు, ఏడీలు, ఏవోలపై రైతులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. జిల్లా వ్యవసాయాధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు.
వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగం పెరిగింది. సాగు పరికరాల కోసం రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా సబ్సిడీ పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. నల్లగొండ జిల్లాలో 1350 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 477మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 267 రైతులు 12 రకాల సాగు పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారులు యంత్రాల ధరలను ఎస్టిమేటెడ్ కాస్ట్ పెంచడం ద్వారా కంపెనీలకు లాభం చేకూర్చే పనులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులతో తమ కంపెనీ పరికరాలను మాత్రమే కొనుగోలు చేసేలా ఒప్పించాలని కంపెనీల ప్రతినిధులు అధికారులకు తాయిలాలను ఎరవేస్తున్నట్టుగా సమాచారం. తమ అభిప్రాయంతో సంబంధం లేకుండా కొంతమంది అధికారులు పలాన కంపెనీ యంత్రాలనే తీసుకోవాలని నిర్ణయించి కట్టబెడుతున్నట్టుగా పలువురు రైతులు చెబుతున్నారు. యాంత్రీకరణ పథకంలో పంపిణీ చేస్తున్న పరికరాల్లో కొన్ని రకాల పరికరాల ధరలు బహిరంగ మార్కెట్‌తో పోల్చితే అధికంగా ఉన్నట్టు తెలిసింది. రోటవేటర్, స్ట్రా బేలర్స్, తైవాన్ స్ప్రేయర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్ ధరలు అధికంగా ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. రోటవేటర్ ధర బహిరంగ మార్కెట్లో రూ. 1.15లక్షల నుంచి రూ.1.2 లక్షలుగా ఉంది. ఈ పథకంలో మాత్రం ఇదే రోటవేటర్ ధరను రూ. 1.40 లక్షలుగా నిర్ణయించారు. అంటే బహిరంగ మార్కెట్‌తో పోల్చితే సబ్సిడీ పథకంలో రోటవేటర్ ధర రూ. రూ. 20-25వేలు అధికంగా ఉండటం గమనార్హం. అదే విధంగా స్ట్రా బేలర్(గడ్డి కట్టలు కట్టే యంత్రం) ధర బహిరంగ మార్కెట్లో రూ. 3 లక్షల నుంచి రూ. 3.20 లక్షల వరకు ఉండగా సబ్సిడీలో దీని ధర రూ. 3.60 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిసింది.తైవాన్ స్ప్రెయర్లు, బ్యాటరీ స్ప్రెయర్ల ధరలు కూడా అధికంగా నిర్ణయించారు.
స్ట్రా బేలర్ (గడ్డి కట్టలు కట్టే యంత్రం) కుంభకోణం ..
నల్లగొండ జిల్లాలో 44 మంది రైతులు స్ట్రా బేలర్(గడ్డి కట్టలు కట్టే యంత్రం) సబ్సిడీ పై పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. భారత్ బేలర్ డీలర్‌తో ఒప్పందం జరిగింది. .స్ట్రా బేలర్(గడ్డి కట్టలు కట్టే యంత్రం) ధర బహిరంగ మార్కెట్లో రూ. 3 లక్షల నుంచి రూ. 3.20 లక్షల వరకు ఉండగా సబ్సిడీలో దీని ధర రూ. 3.80 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిసింది. అంటే బహిరంగ మార్కెట్‌తో పోల్చితే స్ట్రా బేలర్ ధర రూ. 40వేలు-60వేలు అధికంగా ఉంది. ఇలా 15 లక్షల అరవై వేల రూపాయలు పక్కదోవ పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒక్కో అధికారికి స్థాయిని బట్టి, పరికరాన్ని బట్టి రూ. 5వేల నుంచి రూ. 30వేల వరకు కమీషన్లు ముట్టినట్లు సమాచారం. పైగా రైతులకు రావాల్సిన సబ్సిడీ రావడం లేదని తెలిసింది.
సబ్సిడీ పొందిన రైతులకు తప్పని తిప్పలు.
యాంత్రీకరణ పథకంలో భాగంగా సబ్సిడీ ద్వారా పొందిన యంత్రాల నిర్వహణలో లోపాలు ఏర్పడితే రైతులకు తిప్పలు తప్పడం లేదు. స్ట్రా బేలర్(గడ్డి కట్టలు కట్టే యంత్రం) సబ్సిడీ పై పొందిన రైతులకు ఆ యంత్రాలపై అవగాహన కల్పించాల్సిన కంపెనీ సిబ్బంది సకాలంలో రైతుల వద్దకు వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు ఇబ్బంది పడుతున్నారు
సబ్సిడీ పథకం ద్వారా పొందిన సబ్సిడీ యంత్రాల నిర్వహణలో రైతుల్ని ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదు. యంత్రాలు చెడిపోయినప్పుడు రైతులకు సకాలంలో సేవలు అందించి యంత్రాలపట్ల అవగాహన కల్పించాలి. కంపెనీల ప్రతినిధులు మాత్రం తిప్పుకోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు.
– రైతు సంఘం మండల కార్యదర్శి దొండ కృష్ణారెడ్డి
రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో సబ్సిడీపై యంత్రాలను పొందిన రైతులకు కంపెనీ నుంచి సేవలు అందించడంలో ఇబ్బందులు కలిగించినట్టు రైతులు ఫిర్యాదు చేస్తే సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకుంటాం. సబ్సిడీ యంత్రాల ధరల విషయంలో అధికారులు అవినీతికి పాల్పడ్డారని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు.
-జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్


