Sunday, June 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సాగు రంగాన్ని తీవ్ర ఆందోళనలో పడేసిన నైరుతి రుతుపవనాల స్తబ్దత ఎట్టకేలకు ముగిసింది. గత రెండు వారాలుగా బలహీనపడి, తీవ్ర వర్షపాత లోటుకు కారణమైన రుతుపవన వ్యవస్థలు.. ప్రస్తుతం పుంజుకుని మధ్య భారతదేశం వైపు వేగంగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఈ ఏడాది రుతుపవనాలు జూన్ 4న ఆలస్యంగా కేరళను తాకినప్పటికీ, పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల దేశంలో వర్షాలు ముఖం చాటేశాయి. జూన్ మధ్య నాటికి దేశవ్యాప్తంగా ఏకంగా 41 శాతం వర్షపాత లోటు నమోదైంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని విదర్భ వంటి వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు తీవ్రమైన పొడి వాతావరణం, ఎండలతో అల్లాడిపోయాయి. ముంబై నగరానికి తాగునీరు అందించే జలాశయాల్లో నీటి నిల్వలు 9 శాతానికి పడిపోవడంతో నీటి కోతలు కూడా విధించారు.

ఈ నేపథ్యంలో ఐఎండీ జారీ చేసిన తాజా బులెటిన్ రైతులకు, సామాన్య ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తోంది. సరికొత్త వాతావరణ మార్పులు, అరేబియా సముద్రం నుంచి వీస్తున్న బలమైన తేమ గాలుల కారణంగా వర్షాలు కురిపించే మేఘాలు మళ్లీ దేశవ్యాప్తంగా దట్టంగా అలుముకుంటున్నాయి. జూన్ 19 నుంచి 25 మధ్య కాలంలో మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణం నుంచి విస్తారమైన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా జూన్ 21-23 తేదీల మధ్య గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు, దక్షిణ ద్వీపకల్పంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు తీర ప్రాంతాలతో పాటు, ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్‌లలో నేడు (21న) అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అక్కడ ప్రత్యేక అలర్ట్ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -