Monday, June 22, 2026
E-PAPER
Homeకవర్ స్టోరీనాన్నకు ప్రేమ కావాలి...

నాన్నకు ప్రేమ కావాలి…

- Advertisement -

నాన్నలెప్పుడూ నిజాలు చెప్పరు. ‘ఎందుకు నాన్నా అలా ఉన్నావ్‌?’ అని అడిగితే ‘బానే ఉన్నానే’ అనేస్తారు. ఆ అబద్ధాల వల్లే కదా మగవాళ్లలో ఇన్ని గుండె పోటులు. నాన్నలెప్పుడూ దేనికైనా వెంటనే ‘సరే’ అనరు. ‘టూర్‌ కి వెళ్తా నాన్నా..’ అంటే ‘వద్దు’ అనేస్తారు. డబ్బులు లేవనో, తెలియని చోటులో మీ భద్రత గురించి భయమనో చెప్పరు. నాన్నలెప్పుడూ తప్పుని ఒప్పుకోరు. ‘అమ్మని ఎందుకు అరిచావు?’ అని అడిగితే ‘పెద్దాళ్ల గొడవలు మీకెందుకు?’ అని తిరిగి అరుస్తారు. ఏ భావాన్నైనా సరే, సరిగ్గా వఞజూతీవరర చేయనీయకుండా, ‘నువ్‌ మగాడివి..’ అని మోయలేని బరువుని నా గుండె మీద పెట్టారు అని ఒప్పుకోరు. నాన్నలంతే…

”వాడు సాయంత్రం ఫ్రెండ్‌ ఇంటికి వెళ్తాడట, మీ నాన్న వద్దన్నారు అని చెప్పేశా. మీరూ అదే చెప్పండి” అని అమ్మ చెప్పినదానికి తలాడించి పిల్లల ముందు విలన్‌ అవుతాడు. ”అమ్మ వద్దంటోంది, నువ్వే చెప్పు నాన్నా..” అని కళ్ళ నీళ్లుబెట్టుకుంటే అతి గారం చేసి పాడు చేస్తున్నందుకు భార్యతో తిట్లు తింటాడు. నాన్నలంతే. ఎటూ చెప్పలేక, దేన్నీ ఒప్పుకోలేక సతమతమవుతారు. అమ్మ ప్రేమనీ, త్యాగాన్నీ కీర్తించినంతగా తమని కీర్తించలేదని నాన్నలు నొచ్చుకోరు.
గ్రాంటెడ్‌గా తీసుకుంటాం ‘దూడకి పాలిచ్చి వస్తా’ అని పులిని బతిమిలాడి, ఇంటికొచ్చి దూడకి మంచి చెడులు చెప్పిన గంగిగోవు కథను చెప్పుకుంటాం కదా. అమ్మే తొలి గురువు అని పాటలు పాడి, కవితలు రాసి కీర్తిస్తాం కదా. పదిహేను వందల డిగ్రీల వేడి ఉక్కు మీద పడి, తొంభై శాతం కాలిపోయినా, ”తమ్ముడిని విసుక్కోకు, ఇద్దరూ బాగా చదువుకోండి, అమ్మని బాగా చూసుకోండి”

అని పెద్ద కొడుక్కి చెప్పిన విశాఖ స్టీల్‌ ప్లాంట్లో ప్రమాదానికి గురి అయిన కార్మికుడు ఆ గంగిగోవు కంటే ఏం తక్కువ! కూతురి బాక్సింగ్‌ కలలని నిజం చేయటం కోసం ఉద్యోగాన్ని వదిలి, సమాజాన్ని, కట్టుబాట్లని ఎదిరించే సాహసం చేసిన నిఖిత్‌ జరీన్‌ తండ్రి జమీల్‌ అహ్మద్‌ – ప్రేమ పాటలు, కవితలు రాయటానికి ఎందుకు చాలదు! వీళ్లలా త్యాగాలు, సాహసాలు, ఆరాటాలు, పోరాటాలు చేసే తండ్రులు మన చుట్టూ ఉన్నారు. మన ఇంట్లో ఉన్నారు. మనం ఒకోసారి గుర్తిస్తాం. ఒకోసారి నిర్లక్ష్యం చేస్తాం. చాలాసార్లు ‘గ్రాంటెడ్‌’గా తీసుకుంటాం. మనకి తండ్రి పాత్ర బరువు అర్థం అయ్యేసరికి, మన నాన్నలు ఎక్కడ ఉంటారో, ఎలాంటి స్థితిలో ఉంటారో, అసలు ఉంటారో లేదో కూడా చెప్పలేం. ఒక స్త్రీ తల్లిగా ఎదుర్కొనే సవాళ్లు ఎన్ని ఉంటాయో, ఒక పురుషుడు నాన్నగా ఎదుర్కొనే సవాళ్లు కూడా అన్ని ఉంటాయి. పిల్లలను ప్రేమించాల్సిన, వారిని దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉన్న గంభీరమైన ‘నాన్న’ పాత్ర రెండు అంచుల కత్తి. ఏ వైపుని ఒడుపుగా పట్టుకోవాలో అర్థం అయ్యేసరికి, యుద్ధం ముగుస్తుంది.

ఆర్థిక యంత్రాలుగా మారుతున్న నాన్నలు
ముందు తరాల్లోని తండ్రుల కంటే గ్లోబలైజేషన్‌ యుగం మొదలయ్యాక తండ్రులకి ఎదురవుతున్న సవాళ్లు చాలా ఎక్కువ. కులవత్తుల మీద మాత్రమే ఆధారపడిన ఆర్థిక, విద్యా వ్యవస్థలు బీటలు వారాయి. స్వతంత్రం తర్వాత అందరికీ చదువు కునే హక్కును మన రాజ్యాంగం ఇచ్చింది. గ్లోబలైజేషన్‌ కాలం మొదలయ్యాక విదేశాలు వెళ్లి నచ్చినది చదువుకోటానికి, ఉద్యోగాలు చేయటానికీ అవకాశాలు మరింత పెరిగాయి. అవకాశాలు పెరిగాయి కానీ, మన సమాజంలో మారాల్సినంతగా జెండర్‌ రోల్స్‌ మారలేదు. అంటే తల్లి బాధ్యతలు ఇవి, తండ్రి బాధ్యతలు ఇవి అని చెప్పే సాంఘిక నియమాలు, అభిప్రాయాలు మారలేదు అన్నమాట. మన వ్యవస్థల ప్రకారం సంపాదించే పాత్ర తండ్రిదే. అందువల్ల ఈ గ్లోబలైజేషన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌ అన్నీ తండ్రి మీదే పడ్డాయి. వాటిలో కొన్ని.. అదనపు పని గంటలు, పెరిగే ధరలు. ఇవి చాలదు అన్నట్టు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయి, ప్రైవేట్‌ స్కూల్స్‌ సంఖ్య పెరిగింది. వర్క్‌ ఫోర్స్‌ లో ఇప్పటికీ తగినంత స్థాయిలో మహిళలు లేరు కాబట్టి, ఆర్థిక భారం ఎక్కువగా మగవాళ్ల మీద పడింది. అంటే తండ్రుల మీద పడింది. ఈ ఆర్థికపరమైన ఒత్తిడిని తట్టుకోటం తేలిక కాదు. లక్షల రూపాయల ఫీజులు, పెరుగుతున్న ఖర్చులు మగవాళ్ల మీద ఒత్తిడిని పెంచేశాయి. ఈ ఆర్థిక భారాన్ని మోయటం కోసం ఎక్కువ గంటలు పని చేయటం, రెండేసి ఉద్యోగాలు చేయటం, గల్ఫ్‌ దేశాలకో వేరే ప్రాంతాలకో వలస వెళ్ళటం లాంటి ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్న వారూ ఉన్నారు

వ్యధని మిగిల్చే ప్రశ్న
చీమలా కూడబెట్టే ప్రతి రూపాయినీ తండ్రి పిల్లల కోసమే ఖర్చు పెడతాడు. పిల్లల తిండి, పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్లు, పిల్లల కోసం ఇళ్ళు, పొలాలు, బ్యాంకు ఖాతాలు, వెండి బంగారాలు.. ఈ జాబితాలో చివర్లో ఉండేవి తన ఆరోగ్యం, తమ వద్ధాప్యంలో కావాల్సిన డబ్బు. ముందు తరాల్లో వారిలా తండ్రి వత్తినే కొనసాగించి, తండ్రి ఇంట్లోనే ఉమ్మడిగా అందరూ ఉండే తరాలు కావు ఇవి. పైగా ఒకరు ఇద్దరు పిల్లలే ఉంటారు కాబట్టి, తల్లిదండ్రుల బాధ్యత ఆ ఒకరిద్దరిదే అవుతుంది. పిల్లల చదువులకి డబ్బు అవసరమైన దశలోనే, తన తల్లిదండ్రులు వద్ధాప్యంలో ఉంటారు. చేతిలో ఉన్న రూపాయిని తనని కన్నవాళ్ళకి పెట్టాలా? తాను కన్న వాళ్లకి ఇవ్వాలా? అనేది నాన్నలకి వ్యధని మిగిల్చే ప్రశ్న. ఈ రెండిటి మధ్య తన అవసరాలని ఒక మూలకి నెట్టేస్తాడు. ఆర్థిక భారం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. కుటుంబ బంధాలని దెబ్బ తీస్తుంది. అరవై నిండకుండా మంచాన పడుతున్నారు. ‘మా నాన్న మాకు టైం ఇవ్వడు’ అనే నిందనూ మోస్తున్నారు.

ఏడ్చే స్వతంత్రం కూడా లేనిది తండ్రి పాత్ర
‘తండ్రి’ అనేవాడు ఆకాశం నుండి ఊడిపడదు కదా! ఈ భూమి మీదే పుట్టి పెరుగుతాడు. పిల్లలని పిల్లలుగా చూసే మంచి అలవాటు ఉన్న వ్యవస్థ కాదు మనది. మన సమాజంలో పిల్లలు అంటే ఆడపిల్లలు, మగపిల్లలు. ఈ విభజనతో పాటు, మనం కొన్ని బరువులు కూడా పిల్లల మీద పెట్టేశాం. చీకటికో, పీడకల వచ్చో మగపిల్లలు భయపడితే, దగ్గరకి తీసుకుని ధైర్యం చెప్పాల్సింది పోయి, ‘నువ్వు మగాడివిరా.. భయపడకూడదు’ అని ఊహాజనిత బలాన్ని అందిస్తాం. దుఃఖం వచ్చి ఏడిస్తే, ‘ఏరు ఆడపిల్లలా ఆ ఏడుపేంటి?’ ఎద్దేవాగా నవ్వుతాం. గాంభీర్యం, గుండె ధైర్యం లాంటివి తప్ప ప్రేమ, దగ్గరతనాన్ని కోరుకోటం, బాధ.. అన్ని రకాల ఎమోషన్స్‌ మగతనానికి వ్యతిరేకమైనవి అని మగపిల్లలకి నూరిపోస్తాం. మనసులో మాటలని భాషలోకో, స్పర్శలోకో తర్జుమా చేయటం నేర్చుకోనివ్వం. ‘మగవాడు’ అంటే ఇలాగే ఉండాలేమో అనే భ్రమలో పెరిగిన పిల్లలు పెద్దయి, వారికి పిల్లలు పుట్టాక కూడా అలాగే ఉంటారు. తమ పిల్లలు కూడా అలాగే పెరగాలి అనుకుంటారు. మగవాడే కుటుంబ పెద్ద, అంటే తండ్రి కుటుంబ పెద్ద, ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలబడాలే తప్ప, భార్యా పిల్లల ముందు బేలతనం కనపడనివ్వకూడదు అనుకుంటాడు. ‘మగవాడు ఏడవకూడదు’ అనేదానికి ఎంత కండిషన్‌ అయిపోయి ఉంటారంటే రోగం, రొస్టు, చావు బతుకుల సమయంలో కూడా ఏడుపుని అదుపు చేసుకుంటారు. తన తల్లిదండ్రులు చనిపోటంలాంటి అరుదైన సందర్భాలలోనే, ‘నాన్న’ ఏడుస్తూ కనిపిస్తాడు. ఉద్వేగాలను అణిచేసుకోటం మానసిక ఒత్తిడిని, కుటుంబ సభ్యులతో దూరాన్ని పెంచుతున్నా సరే ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించక తప్పని స్థితికి ‘తండ్రి’ అలవాటుపడి ఉంటాడు పాపం.

నలుగుర్లో నలిగిపోయేది నాన్న పేరే
పిల్లల విజయాలే తల్లిదండ్రుల విజయాలుగా లెక్క కట్టే విషసంస్కతి మనది. ‘ఇంటి పేరు నిలబెట్టావురా..’, ‘మీ నాన్నకి తగ్గ కూతురివి’ అనటమే మనకి తెలిసిన పొగడ్తలు. దాని విష ఫలాలకి బలయ్యేది కూడా మొదట నాన్నలే. మంచి మార్కులు, గొప్ప ర్యాంకులు, విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు, అయిదంకెల జీతాలు.. ఇవి సాధించినవారే గొప్ప. వారికే గుర్తింపు. వారే ఇంటి పేరు నిలబెట్టేది. తండ్రికి తగ్గ పిల్లలు అయ్యేది. ఈ ఇంటి పేరు ఎలాగూ నాన్నదే. ‘ఫలానా వాళ్ల అబ్బాయి అనో అమ్మాయి అనో’ అని చెప్పేది తండ్రి పేరే. ఈ పేరు కోసం, ఈ గౌరవం కోసం తండ్రి పడని పాట్లు ఉండవు. ‘అంత పెద్ద ఉద్యోగమైనా సరే, నాన్న మాటకి ఎంత విలువ ఇస్తాడనీ..’ అనే గుర్తింపు కోసం తండ్రులు పెట్టే కంట్రోల్‌కి అంతు ఉండదు. ‘మా నాన్నకి నేనేమైపోయినా పర్లేదు’ అనే ఫీలింగ్‌ పిల్ల్లల్లో మిగులుస్తాడు. ఇష్టమైన చదువో ఉద్యోగమో చేయలేక, ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకోలేక పిల్లలు జీవితాంతం నలిగిపోయినా, ‘అలవాటు పడతారులే’ అని సర్దిచెప్పుకుంటాడు.

‘కూతురంటే ఎంత ప్రేమ! ఫారిన్‌ పంపాడు, బోలెడు కట్నం ఇచ్చి, పెద్ద సంబంధం తెచ్చి, లక్షలు తగలేసి పెళ్లి ఖర్చు చేశాడు’ అనే స్టాంప్‌ కోసం అప్పు చేసో, ఉన్నదంతా ఖర్చు చేసో, వద్ధాప్యంలో చిల్లిగవ్వ లేకుండా మిగులుతాడు. ఉన్నదంతా ఊడ్చేసి పెళ్లి చేసిన నాన్నకి తన కాపురంలోని సమస్యలు చెప్పుకోటానికి కూతురు ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకోలేడు. ఒకవేళ తల్లిదండ్రులకి ఆ సంగతులు చెప్పినా, విడాకులు ఇప్పించి బిడ్డని పుట్టింటికి తెచ్చుకోటానికి, రకరకాల సంశయాలు దాటడానికి మానసిక శ్రమ పడతాడు. ఇంత కష్టం దేనికీ? ‘పిల్లలు ఆనందంగా ఉండాలంటే తండ్రిగా తాను చేయాల్సింది ఇది’ అనే రూల్‌ బుక్‌ని తూచ తప్పకుండా పాటించడం వల్ల. పిల్లలకి ఏం కావాలో నాకు తెలుసు అనే మూర్ఖత్వం వల్ల. నలుగురు ఏం అనుకుంటారో అనే భయం వల్ల. తండ్రుల మీద పరువు అనే ఊహాజనిత విలువకు మించిన ఒత్తిడి మరోటి ఉండదు.

తండ్రులని ఇంతటి చిక్కులో పడేసింది ఎవరు
తండ్రులు ఇంత మంచి వాళ్లు, ఇంత త్యాగమూర్తుల కదా. మరి కట్నం కోసం వేధించేది ఎవరు? పరువు హత్యలుగా చలామణి అయ్యే కుల హత్యలు చేసేది ఎవరు? తాగి వచ్చి, అమ్మలని పిల్లల ముందే కొట్టేది ఎవరు? ఆడపిల్లలకి భద్రత లేకుండా చేస్తోంది ఎవరు? ఇష్టం లేని చదువులని, పెళ్లిళ్లని పిల్లల మీద రుద్దుతోంది ఎవరు? పితస్వామ్యం అనే ఊబిలో దిగిన మగవాళ్లు. ఈ ఊబిని తయారు చేసేదీ, దాని నుండి తమలోని ‘నాన్న’లని బైటపడకుండా చేసేదీ మగవాళ్లే. అందుకే తండ్రులు ఎదుర్కొనే సమస్యలకి పరిష్కారాలు దొరకటం ఇంత జటిలమయింది. కూతురుకి కష్టం వస్తే తట్టుకోలేని నాన్న, భార్య కష్టానికి కారణం అవుతాడు. ఇష్టం లేని పని చేస్తూ జీవితంలో రాజీ పడ్డవాడు పిల్లలని అదే పని చేయమంటాడు. కూతురుకి కట్నం ఇవ్వటానికి అప్పులు పాలయ్యేవాడే మరో మగవాడిని అప్పులపాలు చేసి, కొడుక్కి కట్నం తీసుకుంటాడు. వారసులు అంటే కొడుకులు మాత్రమే అనేది లాజిక్‌ కి నిలవని మూఢనమ్మకం అనేది అర్థం చేసుకోరు. కొడుకుల్లో అహంభావాన్ని, కూతుర్లలో అస్తిత్వానికి సంబంధించిన గందరగోళాన్ని సష్టిస్తారు. ఎంత దుఃఖం అయినా సరే, గుండెల్లో దాచుకుని నిద్రలేమితో డిప్రెషన్‌తో బాధపడేవాడే, ‘నువ్‌ మగాడివిరా..’ అని కొడుక్కి నేర్పిస్తాడు.

ఈ విషవలయాన్ని, జనరేషనల్‌ ట్రామాని ఛేదించటం నిజానికి అంత కష్టమేమి కాదు. విజయవంతంగా ఈ విషవలయాన్ని ఛేదిస్తున్న వాళ్ళూ ఉన్నారు. తమ పిల్లలకి అదే నేర్పిస్తున్న వారు ఉన్నారు. తండ్రులు ఆ పని చేస్తున్నారు కాబట్టే భార్యలకి మద్దతునిచ్చే భర్తల సంఖ్య పెరిగింది. కూతుళ్లని కొడుకులతో సమానంగా పెంచే తండ్రుల సంఖ్య పెరిగింది. తక్కువ శాతమే అయినా కట్నాలు తీసుకోని వారు కొందరైనా ఉన్నారు. సమాజం, వ్యవస్థలు పెట్టే ఒత్తిళ్లకి లొంగకుండా పిల్లల అభిప్రాయాలకి విలువ ఇచ్చేవారి సంఖ్య పెరిగింది. విడాకులు తీసుకున్న కూతురిని బ్యాండ్‌ మేళంతో పుట్టింటికి ఆహ్వానించిన ‘తండ్రులు’ పుట్టారు. బిడ్డ పుట్టిన తర్వాత వారిని చూసుకోటానికి ‘పాటర్నిటీ లీవ్‌’ తీసుకోవాల్సిన అవసరాన్ని మన వ్యవస్థలు గుర్తిస్తున్నాయి. కేవలం డబ్బులు ఇచ్చే ఎకానమీ ఏజెంట్లుగా ఉండకుండా పిల్లల పెంపకంలో ఇతర బాధ్యతలని కూడా పంచుకుంటున్న తండ్రుల సంఖ్య పెరిగింది. అయితే జరగాల్సినంత మార్పు జరిగిందా? కుటుంబాలు ఆనందంగా ఉండగల స్థితిని అందుకుంటున్నాయా? లేదు అని మనందరికీ తెలుసు. మరి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆర్థిక యంత్రాల్లా, కుటుంబ పెద్దల్లా లేని మారిపోయే వాళ్ళని నాన్నలుగా మాత్రమే మిగుల్చుకోటం ఎలా?

నాన్నకు కానుక
ఈ పితస్వామ్య వ్యవస్థలో మగవాళ్లు నాన్నలుగా చేసే పోరాటాలని అందరం గుర్తించాలి. ఆ సంకెళ్లని తెగ్గొట్టడంలో ‘నాన్న’కు తోడు నిలవాలి. అదే మనం ‘నాన్న’కు ఇవ్వగలిగిన కానుక. పిల్లల సామర్థ్య పరిధిలోనే నాన్నకి సపోర్ట్‌గా చేయగల పనులు ఉన్నాయి. బ్రాండెడ్‌ బట్టలు, ఖరీదైన విద్యాసంస్థల్లో చదువు, ఆడంబరమైన పెళ్లిళ్లు లాంటివి స్టేటస్‌ యాంగ్జైటీని సష్టిస్తాయని పెద్దలూ, పిల్లలూ గుర్తించాలి. జీవితంలో ఆర్థికంగా స్థిరపడటానికి కావాల్సిన విద్యని, నైపుణ్యాలని తక్కువ ఖర్చుతో, ఎక్కువ శ్రమతో సాధించగలం అనటానికి లివింగ్‌ ఫ్రూఫ్స్‌గా ఎందరో విజేతలు ఉన్నారు. సంపాదించే స్థాయిలో ఉన్న పిల్లలు తల్లిదండ్రులకి హెల్త్‌ పాలసీ తీసుకోవాలి. ప్రతి ఏడాది హెల్త్‌ చెక్‌ అప్‌ చేయించాలి. చదువుకునే వయసులోనే ఉన్న వాళ్లు అయితే, హెల్త్‌ పాలసీలు తీసుకోమని, అవసరం అయితే తమ వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకుంటాం అని నచ్చజెప్పాలి. తల్లిదండ్రులు డాక్టర్లు దగ్గరకి వెళ్తే, కూడా వెళ్ళాలి. ఈ చిన్న పనులు ఇచ్చే మానసిక ధైర్యం, జీవేచ్చ మరేదీ తండ్రులకి ఇవ్వలేదు.

అమ్మమ్మ, నానమ్మ , తాతల ఆరోగ్యాన్ని పట్టించుకోటం కూడా అవసరం. పిల్లల కోసం తాపత్రయపడే వయసులో ఉన్న తండ్రులు తమ పెద్దల గురించి పట్టించుకోలేరు. పెద్ద వాళ్ళని గమనించుకునే పిల్లలు ఉన్నారు అనే భరోసా ఇవ్వగలిగే ఆనందం నాన్నలకు మరేదీ ఇవ్వదు. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉండాలి. ‘ఎలా ఉన్నావు?’ అని అడగటానికి, నాన్న చెప్పేది మొత్తం వినటానికి పదిహేను నిమిషాలు కూడా పట్టదు. ఈ చిన్న చర్య నాన్న మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కుంగుబాటు నుండి కాపాడుతుంది. నాన్నలకే కాదు, పిల్లలకీ మేలు చేస్తుంది. సమాజం నుండి వచ్చే గుర్తింపు కంటే పిల్లల నుండి వచ్చే గుర్తింపే నాన్నలు మన ఇష్టాలని అర్థం చేసుకోటానికీ, ఆమోదించటానికీ పునాది వేస్తుంది. చేయగలిగే శక్తి ఉన్నా లేకపోయినా, ‘నేనున్నాను నాన్న..’ అనే ప్రేమ నిండిన మాటే నాన్నకి ఎవరైనా ఇవ్వగల కానుక.

– చైతన్య పింగళి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -