Saturday, June 20, 2026
E-PAPER
Homeజిల్లాలుఅధికారం కోసం బీజేపీ కుట్రలు: త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్

అధికారం కోసం బీజేపీ కుట్రలు: త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్

- Advertisement -

వ్యవసాయ కార్మికులు ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభలో త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పిలుపు
నవతెలంగాణ – మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి
అధికారం కోసం బీజేపీ కుట్రలు చేస్తున్నదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజల హక్కులపై దాడులు చేస్తూ విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ గ్రౌండ్‌లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య అధ్యక్షతన జరిగిన సభలో మాణిక్ సర్కార్ మాట్లాడుతూ.. దేశంలో అత్యంత పేద వర్గం వ్యవసాయ కార్మికులేనని, వారు తిండి, బట్ట, ఇల్లు వంటి కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నది ఎర్రజెండానేనని పేర్కొన్నారు.

వామపక్ష పార్టీల ఎంపీల ఒత్తిడితో యూపీఏ–1 ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడం వల్ల గ్రామీణ పేదలు మళ్లీ ఉపాధి సంక్షోభంలోకి నెట్టబడ్డారని విమర్శించారు. దీంతో వ్యవసాయ కార్మికులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

మోడీ ప్రభుత్వ విధానాల కారణంగా ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండగా, మరోవైపు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల సమస్యల పరిష్కారం కంటే కార్పొరేట్ సంస్థల లాభాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యమవకుండా కులం, మతం, ప్రాంతం పేర్లతో విద్వేష రాజకీయాలు చేస్తున్నారని, ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు బీజేపీకి సహకరిస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తూ ప్రశ్నించే గొంతుకలపై సీబీఐ, ఈడీ వంటి సంస్థల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారని, మీడియా స్వేచ్ఛను కూడా అణచివేస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల సంఘాన్ని తన ప్రభావంలో ఉంచుకుని ఓటర్ల జాబితా సవరణల పేరుతో ప్రతిపక్ష ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, అధికారం కోసం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న ఆగడాలు ఎప్పటికీ కొనసాగవని, ప్రజలు తగిన సమయంలో తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

బీజేపీ పెరగట్లేదు.. కాంగ్రెస్ పెంచుతోంది

బీజేపీ అనేక రాష్ట్రాల్లో స్వయంగా బలపడలేదని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల వల్లే బీజేపీ బలపడుతోందని మాణిక్ సర్కార్ అన్నారు. దీనికి త్రిపుర రాష్ట్రాన్నే ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడ కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు పెద్దఎత్తున బీజేపీకి మారిందని, కమ్యూనిస్టులను ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యవహరించిందని విమర్శించారు.

త్రిపురలో బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, స్థానిక సంస్థల ఎన్నికలను సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రతిపక్షాలపై దాడులు పెరిగాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలపై చేస్తున్న దాడులు, కార్మిక హక్కులను కాలరాసే విధానాలు, మనువాద భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం ప్రజల్లో పోరాటాలను మరింత ఉధృతం చేయాలని సూచించారు.

ఈ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్సీ తమ్మినేని వీరభద్రం, ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ, ఏఐఏడబ్ల్యూయూ జాతీయ నాయకుడు శివదాసన్, ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. జయలక్ష్మి, ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. ప్రసాద్ లతో పాటు అలాగే ఎ. రాములు, జి. వెంకటరామిరెడ్డి, వెంకటస్వామి, బి. పద్మ, ఎం. ఆంజనేయులు, యు. గోపాల్, పి. నరసింహ, కే. మోహన్, బి. రాజు తదితర నాయకులు సభలో పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -