Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళల ఆర్థిక సాధికారతతోనే రాష్ట్ర అభివృద్ధి: మంత్రి సీతక్క

మహిళల ఆర్థిక సాధికారతతోనే రాష్ట్ర అభివృద్ధి: మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ 
మహిళలు ఆర్థికంగా సంపన్నులైతే రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం ఆలేరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్‌వాడీ టీచర్లకు 61 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ కల్పించామని, వారి సమస్యలను తెలుసుకుని దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మహిళలకు పెట్రోల్ బంకులు, గోదాములు, సోలార్ ప్లాంట్లు వంటి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో 60 సంవత్సరాలు దాటిన మహిళలకు స్వయం సహాయక సంఘాల్లో స్థానం ఉండేది కాదని, ఇప్పుడు వారికి కూడా సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నామని చెప్పారు.

మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించామని, మహిళా సంఘాల సభ్యులు రుణం తీసుకుని మరణిస్తే రూ.2 లక్షల రుణ బీమా సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా రూ.61 వేల కోట్ల మేర వడ్డీలేని రుణాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ.1,250 కోట్ల వడ్డీలేని రుణాలు అందించినట్లు వెల్లడించారు.

మహిళలు ఆర్టీసీ బస్సులకు యజమానులు కావాలనే లక్ష్యంతో వారికి డ్రైవింగ్ శిక్షణలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 67 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండగా, అందులో 12 లక్షల మందికి అక్షరాస్యత లేదన్నారు. ‘అమ్మకి అక్షరమాల’ కార్యక్రమం ద్వారా ఆరు లక్షల మందికి విద్యాబోధన చేసి పదో తరగతి ఉత్తీర్ణత సాధించేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆలేరులో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఏర్పాటు మహిళల స్వయం ఉపాధికి ఎంతో దోహదపడుతుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరుతో అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మహిళా సంఘాలు చెల్లించిన వడ్డీని తిరిగి వారికి అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం మహిళలతోనే ప్రారంభిస్తోందని తెలిపారు. ఆలేరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి మాట్లాడుతూ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మహిళలకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి వేదికగా నిలుస్తుందన్నారు. ఈ కేంద్రంలో వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా సమర్థవంతంగా వినియోగించి మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా 194 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.4.21 కోట్ల శ్రీనిధి బ్యాంకు లింకేజీ చెక్కులను, 621 స్వయం సహాయక సంఘాలకు రూ.58.58 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -