ఇరాన్‌తో అణు ఒప్పందంపై వైట్ హౌస్ వెల్లడి
శ్వేతసౌధం: ఇరాన్‌తో అణు ఒప్పందంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యూహాన్ని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇరాన్ విషయంలో తొలుత దౌత్యానికే తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని, అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇరాన్‌కే క్షేమమని పేర్కొంది. మరోవైపు అమెరికా ఇప్పటికే ఈ విషయంలో ఇజ్రాయిల్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో శ్వేతసౌధం సెక్రెటరీ కరోలిన్ లీవిట్ కీలక అంశాలపై మాట్లాడారు. ‘ఇరాన్‌పై దాడి విషయంలో ఎవరి వాదనలు వారు చేయొచ్చు. కమాండర్-ఇన్-చీఫ్‌గా అధ్యక్షుడు ట్రంప్ గతం లో ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్’ చేపట్టి ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశారు.
ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇరాన్ విషయంలోనైనా లేదా మరే ఇతర దేశం విషయంలో నైనా దౌత్యమే మొదటి ప్రాధాన్యత అని అధ్యక్షుడు ఎప్పుడూ స్పష్టంగా చెబుతుంటారు. అధ్యక్షుడు ప్రస్తుతం చాలా మందితో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తన జాతీయ భద్రతా బృందంతో చర్చిస్తున్నారు. ఇరాన్ విషయాన్ని అధ్యక్షుడు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. అమెరికా, దేశ ప్రజలకు ఏది అత్యుత్తమ ప్రయోజనకరం అనే అంశంపై ఆయన లోతుగా ఆలోచిస్తున్నారు. దాని ఆధారంగానే సైనిక చర్యపై ఆయన ఒక నిర్ణయానికి వస్తారు’ అని శ్వేతసౌధం సెక్రెటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.
ఇజ్రాయిల్‌తో సంప్రదింపులు
ఇరాన్‌పై చర్యకు ఎటువంటి కచ్చితమైన సంకేతాలు ఇవ్వనప్పటికీ, అమెరికా దళాలు మాత్రం ఇజ్రాయిల్‌తో సంప్రదింపులు జరుపుతున్నాయని అని లీవిట్ చెప్పడం గమనార్హం. అంతేకాకుండా, జెనీవాలో ఇరాన్ అధికారులతో జరుగుతున్న చర్చల్లో పురోగతి లభించిందని, అయితే కొన్ని అంశాల్లో రెండు దేశాల మధ్య ఇంకా భేదాభిప్రాయాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. రాబోయే రెండు వారాల్లో ఇరాన్ అధికారులు పూర్తి వివరాలతో తిరిగి వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.



