ఉదయాన్నే హడావుడిగా లేవాలి. సమయానికి పనులన్నీ పూర్తి చేసుకోవాలి. ఇలా కాలంతో పాటుగా చాలామంది మహిళలు పరుగెత్తుంటారు. మరి మీలోని గడియారం సంగతేంటి అదీ వేళలు పాటిస్తుందా? పనుల్లో పడి దాన్ని అస్తవ్యస్తం చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. కనుక దాన్నీ నిర్లక్ష్యం చేయొద్దని అంటున్నారు. అందుకే మన జీవ గడియారం సరిగ్గా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం…
ఆరోగ్యంగా తిన్నా అలసట, నెలసరి ఇబ్బందులు, హార్మోనుల్లో అసమతుల్యత ఇలాంటివి చాలామంది మహిళల విషయంలో వింటూనే ఉంటాం. జీవ గడియారం సరిగా పనిచేయకే ఈ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇది 24 గంటలు పనిచేస్తునే ఉంటుందని చెబుతున్నారు. నిద్ర – మెలకువ, హార్మోన్ల ఉత్పత్తి, ఆహార అలవాట్లు, చివరికి శరీర ఉష్ణోగ్రతల్నీ నిర్దేశిస్తుందని పేర్కొంటున్నారు. అయితే మనం రోజు వారి చేసే పొరపాట్లు, వేళల్ని పాటించకపోవడం వంటివి దీనిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తేల్చి చెబుతున్నారు. అందుకే ఇన్ని సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇవి దూరమవ్వాలంటే.. జీవ గడియారాన్ని సెట్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
మెదడు తికమకపడుతుంది
జీవనశైలి, వాతావరణ అంశాలు మన జీవ గడియారం మీద ప్రభావం చూపే ప్రధాన అంశాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రే అన్నీ సర్దిపెట్టుకుందామనో, ఒక్క సిరీస్ చూద్దామనో చాలామంది మహిళలు నిద్రను ఆలస్యం చేస్తున్నారట. కానీ ఆ మార్పులను అలవాటు చేసుకోలేక మెదడు తికమకపడుతుంది. కాస్త సమయం దొరికితే చాలు.. స్క్రీన్లకే అతుక్కుపోతుంటారని వివరిస్తున్నారు. దీని నుంచి వెలువడే నీలికాంతి ఇది ఇంకా పగలేనంటూ మాయ చేస్తుందని తెలియజేస్తున్నారు. నిద్ర హార్మోను మెలటోనిన్ విడుదల కాకుండా ఆపుతుందని చెబుతున్నారు.
వేళ కానివేళల్లో…
శరీరానికి చురుకుదనం, బ్రేక్ కావాలంటూ వేళ కానివేళల్లో టీ, కాఫీలను అతిగా తీసుకున్నా చాలు… అవీ నిద్రను దరిచేరనీయవట. అంతేకాదు చక్కెర, కెఫిన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా నిద్ర డిస్ట్రబ్ అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఉదయం పూట పనుల మధ్య తీరిక లేక ఉదయపు ఎండలోకి అడుగుపెట్టని ఆడవాళ్లే ఎక్కవ మంది ఉన్నారు. ఫలితంగా విటమిన్ డి లోపించడంతో పాటు ఇప్పుడు పగలు అన్న సంకేతం మెదడుకు చేరకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జీవగడియారం పనితీరుని అస్తవ్యస్తం చేస్తున్నాయని అంటున్నారు. సూర్యుడి నుంచి సరైన విటమిన్ డి సప్లిమెంట్ పొందడానికి, సూర్యరశ్మికి ఉత్తమ సమయం మధ్యాహ్నం అని అధ్యయనాలు చెబుతున్నాయి.
మరి ఏం చేయాలీ..?
-రోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. ఇది ప్రశాంతమైన నిద్రని అలవాటు చేయడమే కాదు, జీవ గడియారాన్ని బాగు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే కాసేపు ఎండలో గడపాలని సూచిస్తున్నారు. తద్వారా రోజంతా మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు రాత్రుళ్లు మంచి నిద్రకీ సహయపడుతుందట. అంతేకాదు, శరీరానికి విటమిన్ డి అందుతుందని పేర్కొంటున్నారు.
-నిద్రపోయే ముందు 30-60 నిమిషాల పాటు ఎలాంటి పరికరాలు వాడకుండా ఉండేలా సమయాన్ని కేటాయించుకోవాలి. ఒకవేళ తప్పనిసరి అయితే బ్లూలైట్ ఫిల్టర్లను పెట్టుకుని అయినా వాడమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
-రోజూ పడుకునే ముందు పుస్తకం చదవడం, గోరువెచ్చని నీటితో స్నానం, మంచి సంగీతం వినటం వంటివి అలవాటు చేసుకోవాలి. ఇది శరీరానికి సూచికలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే, వేళకి నిద్రపోయేలా చేస్తుందట.
-కడుపు నిండుగా ఉండే కంటి నిండా నిద్ర పడుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. కనుక రాత్రి భోజనాన్ని నిద్రపోయే సమయానికి కనీసం మూడు గంటల ముందు తీసుకోవాలని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అలాగే రాత్రిపూట పొట్ట కాస్త ఖాళీగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ఆకలిగా అనిపిస్తే గోరువెచ్చని పాలు, నట్స్, గింజలు వంటివి తీసుకోవచ్చు. వీటిలోని మెగ్నిషియం, ట్రిప్టోఫాన్ వంటివి నిద్రకీ సాయపడతాయని సలహా ఇస్తున్నారు.
-రోజూ కనీసం 30 నిమిషాల నడక, చిన్న వ్యాయామాలకు కేటాయించుకోవాలంటున్నారు. ఈ అలవాటు ఒత్తిడి తగ్గింస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, నిద్రకు ముందు మాత్రం చేయొద్దని సలహా ఇస్తున్నారు. నిద్రపోయే ముందు మెదడును చురుకుగా చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.



