ఈర్ష్య.. పతనానికి నాంది. ఎవరైనా బాగా ఉంటే చాలు ఈర్ష్య పడిపోతుంటారు కొందరు. అది కుదురుగా కూర్చొనివ్వదు. పని చేసుకోనివ్వదు అంతా చిరాకు. అంతులేని ప్రేమలో అంతు చిక్కకుండా దాగి ఉంటుంది ఈర్ష్య. ఇది లేనివారు ప్రపంచంలో చాలా తక్కువ. ప్రతి వారిలో ఏదో ఒక మూల ఎంతో కొంత మోతాదులో దాగి ఉంటుంది. మనిషిని ఇంతలా విచ్చినం చేస్తున్న ఈర్ష్యను తగ్గించుకోవడం ఎలా? నిపుణులు సలహాలు ఎంటో తెలుసుకుందాం.
మన జీవితంలో చేదు అనుభవాలు, మధురానుభూతులు రెండూ ఉంటాయి. వీటిని ఓ సారి తులన్మాతకంగా విశ్లేషించుకోవాలి. జీవితంలో అన్నీ చేదు అనుభవాలే ఉండవు కొంతైనా మంచి సంఘటనలు ఉంటాయి. ఏదైనా మనం చూసే దష్టిని బట్టే ఉంటుంది. ఓటములనే గుర్తుచేసుకుంటూ ఉంటే మనలో ప్రతికూల భావాల గురించే ఆలోచిస్తాం. అదే సానుకుల ధక్పథాన్ని అలవరచుకున్నప్పుడు మనలోని ప్రతికూల భావాల్ని కొంతవరకు బ్యాలెన్స్ చేస్తాయి.
ఇతరుల అలవాట్లను చూసినప్పుడు, వారి భావాలను విన్నప్పుడు ఈర్ష్య పుడుతోంది. అలాంటి భావన సమంజనమేనా అని కాస్త ఆలోచించాలి. ఆ ఆలోచనే మీలో మార్పునకు మొదటి మెట్టు. మనతో సాధ్యపడనిది ఇతరులకు సాధ్యమైనప్పుడు వారి పట్ల ఈర్ష్య కలుగుతుంది. ఈ విషయాన్ని ఓ సారి సరిగ్గా విశ్లేషించుకోవాలి. వాళ్ల దగ్గర ఉన్నది మీ దగ్గర లేదనో.. ఒకరికి కలిగిన మధురానుభూతి మీకు కలగలేదనో.. మీరు అభద్రతా భావానికి లోను కాకుండా జీవితంలో ఓ మంచి అనుభవాన్ని గుర్తుచేసుకోండి.
మీతో పాటు అందరికీ తీపితో పాటు చేదు అనుభవాలు ఉంటాయనే విషయం అర్థం చేసుకోండి. వారు ఆ సమయంలో సంతోషంగా కనిపించవచ్చు కానీ అంతకు ముందు వారు ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కో న్నారనే విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చకునేవారు జీవితంలో విజయం సాధించడంలో సఫలం అవుతారు.
ఎవరిమీదైనా మనకు ఈర్ష్య ఇప్పటికే ఏర్పడిపోయిందేమో మనలోకి మనమే తరచి చూసుకోవాలి. ఉంటే అనుమానం లేకుండా ఈర్ష్యకు లోన య్యామనే విషయాన్ని ఒప్పుకోవాలి. దీంతో మీ లోపాన్ని మీరు గుర్తించినట్లు అవుతుంది. అప్పుడే దీన్నుంచి త్వరగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది.
ప్రపంచంలో ఎవరూ ఎవరి అధీనంలోనూ ఉండరని గ్రహించాలి. అది కుటుంబ సభ్యులైనా సరే.. ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుందని ముందుగా గుర్తించాలి. ఆలోచనే కాదు.. ప్రయత్నం కూడా ముఖ్యం. ఇక మీలో ఉన్న ఈర్ష్యను పక్కకు పెట్టి మారడానికి ప్రయత్నించండి.