సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ కార్మిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేసేదిగా, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ విమర్శించారు. శుక్రవారం రోజున సీఐటీయూ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటి సమావేశం జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం 53 లక్షల 47 వేల 315 కోట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటికీ కార్మికులకు కేటాయించింది శూన్యం అన్నారు. బడ్జెట్‌లో ఉద్యోగ హామీ, అసంఘటిత రంగ కార్మికులు,కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమానికి తగిన కేటాయింపులు చేయలేదన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సరిపడ నిధులు కేటాయించకపోవడం వల్ల గ్రామీణ పేదల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు, ఉత్పత్తి ప్రోత్సాహకాలు, ప్రత్యేక ప్రోత్సాహక పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవ్వడం ప్రజావ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ప్రజల పన్ను డబ్బుతో కార్పొరేట్లను ప్రోత్సహించడం సరైంది కాదని, ఆ నిధులను ఉపాధి సృష్టి, కనీస వేతనాల పెంపు, పింఛన్లు , సామాజిక భద్రతకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల కనీస వేతనం రూ.26,000 గా నిర్ణయించాలని, కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ,సమగ్ర సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ కార్మిక, రైతు, మధ్యతరగతి ప్రజల ఆశలను వమ్ము చేసిందని, దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.
తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు బిజెపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయించడంలో ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. రైల్వేలు కానీ ఇతర ప్రాజెక్టులో కేటాయింపు లేకపోవడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు.బిజెపికి రాజకీయ స్వార్థం తప్ప తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఇష్టం లేదని విమర్శించారు.
ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, మాయ కృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శులు తుర్కపల్లి సురేందర్ ,గొరిగే సోములు, పైళ్ల గణపతి రెడ్డి, పొట్ట యాదమ్మ, చెక్క రమేష్,జిల్లా కమిటి సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, గంధమల్ల మాతయ్య, బత్తుల దాసు,పోతరాజు జహంగీర్, తూటి వెంకటేష్, శ్రీరాములు, కసగోని లలిత, బుర్రు అనిల్ లు పాల్గొన్నారు.



