– నేటితో ముగియనున్న విద్యాసంవత్సరం
– వార్షిక సమీక్ష లో అశ్వారావుపేట పై జిల్లా అధికారులు ప్రశంసలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గతేడాదితో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో అశ్వారావుపేట మండలం విద్యా రంగంలో గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. మంగళవారం నిర్వహించిన విద్యాశాఖ వార్షిక సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులు మండల విద్యా విభాగంపై ప్రశంసలు కురిపించారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గతేడాదితో పోలిస్తే 197 మంది విద్యార్థులు పెరగడం విశేషం. ఎన్రోల్మెంట్ విషయంలో మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనం. ముందస్తుగా నిర్వహించిన ‘ఇందిరా బడిబాట’ కార్యక్రమం కూడా ఈ ఫలితాలకు బలమైన పునాది అయింది.
ఎఫ్‌ఎల్‌ఎన్‌లో ప్రతిభా ప్రదర్శన
మండలంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమం సమర్థవంతంగా అమలైంది. గణితం, భాషా నైపుణ్యాల్లో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. కావడిగుండ్ల, కన్నాయిగూడెం, కొత్తూరు, తిరుమలకుంట వంటి మారుమూల ప్రాంతాల విద్యార్థులు కూడా భాషపై మంచి పట్టును సాధించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ అమలులో మండలం జిల్లాలో ద్వితీయ స్థానాన్ని సంపాదించడం విశేషం.
వినూత్న కార్యక్రమాలతో మెరుగైన ఫలితాలు
మండలంలో ఏడాది పొడవునా పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బాలమేళా, టాలెంట్ టెస్టులు నిర్వహించగా, 4వ, 5వ తరగతుల వారికి ప్రత్యేక గణిత పరీక్షలు చేపట్టారు. ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన టీఎల్ఎం మేళలో బోధనోపకరణాల ప్రదర్శన ఆకట్టుకుంది.
అదేవిధంగా, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు క్విజ్‌లు, ఉపన్యాసాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించారు. ఈ కార్యక్రమాల వల్ల విద్యార్థుల సామర్థ్యాలలో స్పష్టమైన మార్పు కనిపించగా, ఉపాధ్యాయులు కూడా మరింత ఉత్సాహంతో పని చేస్తున్నారు.
జిల్లా అధికారుల ప్రశంసలు – ఎంఈఓకి అభినందనలు
జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో అశ్వారావుపేట మండలం సాధించిన పురోగతిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, ఏఎంఓ నాగరాజు శేఖర్‌లు ఎంఈఓ ప్రసాదరావును అభినందించారు. మండలంలో విద్యా ప్రమాణాల పెరుగుదలకు ఆయన తీసుకున్న చర్యలను ప్రశంసించారు. మండల విద్యా విభాగం సాధించిన ఈ విజయాలకు గుర్తింపుగా ఎంఈఓ ప్రసాదరావుకు పలువురు అభినందనలు తెలిపారు.



