నవతెలంగాణ-హైరదాబాద్: యూకేలో గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్‌హామ్ ప్రత్యేక ఉప ఎన్నికలో ఘన విజయం సాధించి యూకే పార్లమెంట్‌కు తిరిగి ఎన్నికైన విషయం తెలిసిందే. వాయవ్య ఇంగ్లాండ్‌లోని మేకర్‌ఫీల్డ్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించి మళ్లీ పార్లమెంట్‌లోకి ప్రవేశించారు. దీంతో ఆయన ప్రధానమంత్రి పదవికి పోటీ పడే అవకాశాలు మరింత బలపడ్డాయి. లేబర్ పార్టీలో స్టార్మర్ నాయకత్వంపై అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో బర్న్‌హామ్ పీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు నిజమైయ్యయి. తాజాగా బ్రిటన్ ప్రస్తుత పీఎం కీర్ స్టార్మర్ ఆ దేశ ప్రధాని పదవికి రాజీనామా చేశారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. ఈ మేరకు ఆయన మీడియా నిర్వహించి తెలియజేశారని వెల్లడించాయి.
రాజీనామా ప్రకటించినప్పటికీ, లేబర్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు స్టార్మర్ ప్రధానమంత్రిగా కొనసాగనున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌లో పార్లమెంట్ తిరిగి సమావేశమయ్యేలోపు కొత్త నాయకుడిని ఎంపిక చేసే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
కాగా, క్యాబినెట్ మాజీ మంత్రి అయిన బర్న్‌హామ్ దాదాపు పదేండ్లుగా గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన లేబర్ పార్టీకి అత్యంత కీలక సమయంలో పార్లమెంట్‌లోకి తిరిగి వచ్చారు. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి 14 ఏండ్ల తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే స్టార్మర్ నాయకత్వంలో ఆ పార్టీ ప్రజాదరణ వేగంగా పడిపోయింది. మే నెల ప్రారంభంలో జరిగిన స్థానిక కౌన్సిల్ ఎన్నికల్లో లేబర్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదే సమయంలో రిఫార్మ్ యూకే పార్టీ గణనీయమైన విజయాలు నమోదు చేసింది. దీంతో లేబర్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు స్టార్మర్ రాజీనామా చేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. అయితే పార్టీ నియమాల ప్రకారం ప్రస్తుత ఎంపీలు మాత్రమే పార్టీ నాయకత్వానికి పోటీ చేయగలరు. బర్న్‌హామ్ అప్పటివరకు ఎంపీ కాకపోవడంతో ఆయన అధికా రికంగా నాయకత్వ పోరులో దిగలేకపోయారు. అందువల్ల స్టార్మర్‌కు సవాల్ విసరగల నాయకుడు ఎవరూ ముందుకు రాలేదు. అయితే అలాంటి పరిస్థితుల్లోనే బర్న్‌హామ్ ఉప ఎన్నికలో విజయం సాధించడం కీలక మలుపుగా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.



