నవతెలంగాణ – పరకాల
సర్పంచ్ ఎన్నికల సమయంలో ఎఫ్‌ఎస్‌టీ (ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్) బృందాల్లో విధులు నిర్వహించిన వీడియోగ్రాఫర్లకు నేటికీ వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పరకాల మండలంలో ఎఫ్‌ఎస్‌టీ టీమ్స్‌లో మొదటి మరియు రెండో షిఫ్టుల్లో వీడియోగ్రాఫర్లు విధులు నిర్వహించారు. నిద్రాహారాలు సైతం లెక్కచేయకుండా అహర్నిశలు శ్రమించి ఎన్నికల విధులను విజయవంతంగా పూర్తి చేశారు.
అయితే, ఆ సమయంలో చేసిన పనికి సంబంధించి రావాల్సిన వేతనాల కోసం వీడియోగ్రాఫర్లు గత కొంతకాలంగా పరకాల ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు రావాల్సిన కష్టార్జితం అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, బాధ్యతారహితంగా వ్యవహరించకుండా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆర్గనైజర్ కొడెపాక భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమైతే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.



