ఎటువైపు నుంచి చూసినా
ఒకే సమాధానం కానొస్తోంది
ఎవరి బతుకులు వారివే
ఎన్ని ప్రశ్నల ముళ్లులతో గుచ్చినా
స్పర్శలేని తీరుబడికి
ఒకే దారి మార్గం చూపుతోంది
ఎవరి గమ్యం వారిదే
నాల్కలన్నీ సమాజం కోసమే
నాగు పాములై ఆడుతాయి
విషపు తిత్తుల్ని లోలోపల దాస్తూ
పడగలిప్పి నీడను ఇస్తాయి
డప్పులతో దర్పాన్ని చూపిస్తూ
డబ్బులతో బలగాన్ని పోగేస్తూ
విసురుకోడాలు కసురుకోడాలు
అయినా మాకు తెల్వకడుగుతాం
గారడీలతోనే కాలం గడిచిపోతే
అజెండా చిట్టా సంగతి ఏమైనట్టు?
ఒక ప్రశ్న సంధించడానికి
ఒక గుండె చాలదన్నట్టు
ఎంత బిగువును భరించాలిప్పుడు?
కొలమానం లేని సంపదతో
అనంతమైన అత్యాశ సంద్రంలో
తిమింగళమై జీవిస్తున్నవారెందరు?
ప్రశ్నించాలంటే ఊపిరి గట్టిగా బిగబట్టి
అసమానత సమాజం పైకి ఊదితే
అడిగినందుకు చేతులు కట్టుకుని
పరాభవాన్ని స్వీకరించాలి
హక్కును వాక్కుతో ప్రశ్నించరాదు
స్వేచ్ఛను కూడా అడిగే వాడుకోవాలి
స్వతంత్రం ఇప్పుడు
స్వదేశానికే చాలా అవసరం
ప్రశ్నే లేని జవాబుదారీ పెత్తనంలో
మునకలేయడం అలవాటైపోవాలి
ఒక ప్రశ్న ఎన్ని ఆయుధాలకు
పదును పెడుతుందో తెలియదు మరి
నరెద్దుల రాజారెడ్డి, 9666016636
ఒక ప్రశ్న..?!!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



