Saturday, February 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిభగవత్‌ (వి)భజన!

భగవత్‌ (వి)భజన!

- Advertisement -

హిందూ జనాభా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశ రాజకీయాల్లో విభజన రేఖలు సృష్టించాయి. జనాభా చర్చ పేరుతో మతాల మధ్య అనుమానాలు రేకెత్తించాయి. ఇవి దేశాన్ని ‘మెజారిటీ-మైనారిటీ’ కోణంలో నిలబెట్టి రాజకీయ లబ్ధిపొందే వ్యూహమా? లేక ‘విభజించు- పాలించు’ విధానాన్ని బలపరిచే కోణమా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మొన్న ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని సరస్వతీ శిశుమందిర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘హిందూ కుటుంబాలు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చేందుకు ఆలోచించాలి’ అన్నారు. భారత రాజ్యాంగం ప్రతిపౌరుడికి తన జీవనశైలిపై స్వేచ్ఛ ఇస్తుంది. కుటుంబ నిర్ణయాలను ఒక సిద్ధాంతపరమైన ఆదేశంలా చెప్పడం వ్యక్తిగత స్వేచ్ఛకు విరు ద్ధం. భగవత్‌ ‘ప్రేరణ’ రాజ్యాంగం కల్పించిన హక్కులపై పరోక్ష జోక్యా నికి ఆస్కారమిస్తుంది. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న జీవన వ్యయంలో ‘ఎంతమందిని పోషించగలము’ అన్నది కూడా ప్రధానం. ఇప్పుడు తల్లిదండ్రులు ఆలోచిస్తున్న ది- పిల్లలు ఎక్కువగా ఉండటం కన్నా, ఉన్న వారికి మంచి చదువు, ఉద్యోగం కల్పించాలని.
గణాంకాలు చెప్పేది ఏమిటంటే- దేశంలో జనాభా వృద్ధిరేట్లు క్రమంగా తగ్గడం వాస్తవం. విద్య, పట్టణీకరణ, ఉపాధి, ఆరోగ్య సదుపాయాల పెరుగుదల వంటి సామాజిక, ఆర్థిక కారణాల వల్లే కుటుంబ పరిణామం తగ్గుతోంది. ఇది ఒక సహజ పరిణామం. దీన్ని ప్రత్యేకంగా ఒక మతానికి అంటగట్టడం, సమాజంలో అనుమానం, భయాన్ని పెంచి ‘మనసంఖ్య తగ్గిపోతోంది’ అన్న ఆలోచనను నాటడం మత విభజనకు దారితీయడమే. ఇది ముస్లిం, మైనారిటీ వర్గాలతో ప్రమాదమని చూపించే కుట్రలో భాగమే! ఇంకా చెప్పాలంటే, హిందువులను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చి బంధించడం, ఇతరులు మనవారు కాదన్న ఆలోచనను నూరిపోయడం. మహిళల స్వాతంత్య్రం, కుటుంబ ఆర్థికస్థితి, పిల్లల విద్యావకాశాలు-ఇవన్నీ పక్కనపెట్టి సంఖ్యా రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడం. ఇదంతా సమాజాన్ని తిరోగ మనంలో పడేసే దిశ తప్పవేరే కాదు. ముగ్గురు పిల్లల్ని కనాలన్న ‘భగవత్‌ సూత్రం’ మహిళలను ‘వంటింటికే పరిమితం’ చేసే ధోరణి. వారు జనంపై రుద్దాలనుకుంటున్న మనుస్మృతి చెప్పేది కూడా అదే. స్త్రీలకు ఉద్యోగం, స్వతంత్ర నిర్ణయం వంటి వాటిని రెండోస్థానంలోకి నెట్టేయత్నం. అభివృద్ధి చెందిన దేశాలు మహిళల సాధి కారతను పెంచి జనాభాను స్థిరీకరి స్తుంటే, ఇక్కడ మాత్రం వారిని ‘పిల్లల్ని కనే యంత్రాలుగా’ చూడటం దారుణం.
‘ఇతర మతాల్లోకి వెళ్లినవారిని హిందూమతంలోకి తీసుకురావాలని’ కూడా వారు సెలవిచ్చారు. రాజ్యాంగం ప్రతిపౌరుడికి ఇచ్చిన హక్కు- తన మతాన్ని అనుసరించడం లేదా మార్చుకోవడం. అయినా బలవంతపు మతమార్పిడి అన్నది ‘ఆరెస్సెస్‌ కట్టుకథ’, దాని చుట్టూ అల్లిన భావోద్వేగపు వల. కేరళలో కూడా మత మార్పిడి జరుగుతుందని ప్రచారం చేసి లెక్కలు చెప్పమంటే భిక్కముఖ మేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నూట ఇరవై కోట్ల జనాభాలో మెజారిటీ హిందువులు ఎనభై శాతం. మిగతా అన్ని మతాల వారు కలిసి పద్దెనిమిది శాతానికి మించరు. ఇక్కడ ప్రమాదం పొంచి ఉందన్న పోలిక కూడా సరితూగదు. ఈ చర్చను భగవత్‌ ఇప్పుడెందుకు తీసుకొచ్చారు? ఎన్నికల ముందు ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ది పొందడం ‘సంఫ్‌ు పరివారానికి’ వెన్నెతో పెట్టిన విద్య. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మెజారిటీ హిందువుల ఓట్లను ‘తమ బుట్టలో’ వేసుకోవాలన్న ‘పన్నాగం’. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలు, పేద, ధనిక అసమానతలు వంటి ప్రశ్నలు, నిరసనల నుంచి ప్రజల దృష్టిమళ్లించడం.
ఆయన మాటల సారాంశం ప్రత్యక్షంగా ఎవరినీ లక్ష్యంగా చూపకపోయినా, పరోక్షంగా ఒక మతాన్ని ‘ఇతర’గా చూపించే వాతావరణం ఏర్పరుస్తుంది. మెజారిటీ, మైనారిటీ అన్న విభజనను సృష్టిస్తుంది. ఇది లౌకిక వాదానికి తీవ్రముప్పు. జనాభా, సంస్కృతి, మతం పేరుతో గీసే ప్రతీ విభజన రేఖను ప్రశ్నించడం, అడ్డుకోవడం పౌర సమాజం కర్తవ్యం. ‘ముగ్గురు పిల్లల్ని కనాలి’ అన్నది కూడా సామాజిక సలహా కాదు, అది వారి సిద్ధాంత ఎజెండాలో భాగం. ‘సంఖ్య తగ్గిపోతోంది’, ‘సంస్కృతి ప్రమాదంలో ఉంది’ అన్న భావన మెజారిటీ ఐక్యత పేరుతో చేసే రాజకీయ సమీకరణం. మైనారిటీలను అనుమానపు దృష్టితో చూపించడం, లౌకిక విలువలను బలహీన పరచడం వారి లక్ష్యాలు. అందుకే లెనిన్‌ అన్నారు-‘ ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనం దాగుందో తెలుసుకోలేనంత కాలం.. ప్రజలు మోసపోతూనే ఉంటారు’ అని.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -