Saturday, February 21, 2026
E-PAPER
Homeజాతీయంఎప్‌స్టీన్‌ ఫైళ్ళలో పేరు..హర్‌దీప్‌ సింగ్‌ను తొల‌గించాలి: సీపీఐ(ఎం)

ఎప్‌స్టీన్‌ ఫైళ్ళలో పేరు..హర్‌దీప్‌ సింగ్‌ను తొల‌గించాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఎప్‌స్టీన్‌ ఫైళ్ళలో పేరు, ప్రస్తావన వున్న కేంద్ర పెట్రోలియం, ఖనిజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీని తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ఎప్‌స్టీన్‌ ఫైళ్ళలో తీవ్ర అభ్యంతరకరమైన, హేయమైన అంశాలు ప్రతి రోజూ బయటపడుతున్నాయి. అమెరికా న్యాయ శాఖ, ట్రంప్‌ ప్రభుత్వం వాటన్నింటినీ మసిపూసి మారేడుకాయ చేయడానికి ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవాలు వెలుగులోకి వస్తూనే వున్నాయి.

రాజకీయ నేతలు, ఆర్థికాధిపతులు, టెక్‌ దిగ్గజాలు, ప్రముఖులతో సహా అధికార సంపన్నులందరితో ముడిపడిన ఈ నెట్‌వర్క్‌ దారుణమైన నేర స్వభావం, పైగా శిక్షల భయం లేకపోవడం గురించి ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఈ క్రిమినల్‌ నెట్‌వర్క్‌లో వీరందరు భాగస్వాములు కాగా, ఎప్‌స్టీన్‌ ముఖ్య సూత్రధారిగా వున్నాడు. ఇందుకు సంబంధించి వెలుగులోకి వచ్చిన అనేక అంశాలపై అనేక దేశాల్లో నిర్దిష్ట చట్టపరమైన, శిక్షా చర్యలు తీసుకుంటున్నారు. బ్రిటన్‌లో రాజు చార్లెస్‌ సోదరుడు ప్రిన్స్‌ అండ్రూకు రాజ బిరుదులన్నీ తొలగించారు. అరెస్టు చేశారు. ఈ కారణంగా ఇతర దేశాల్లో కూడా అనేకమంది వారి పదవులకు రాజీనామాలు చేయాల్సి వచ్చింది.

కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ, ప్రముఖ పారిశ్రామికవేత్త అనీల్‌ అంబానీ పేర్లు ఈ ఫైళ్లలో వున్నట్లు స్పష్టమైన సాక్ష్యాధారాలు వున్నప్పటికీ వారు వివరణ ఇచ్చేందుకు, జవాబుదారీగా వుండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు.

పార్లమెంట్‌ వేదికపై ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌పై ఎలాంటి చర్చ జరిగేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. ప్రస్తుతం అందుబాటులో వున్న సాక్ష్యాధారాల నేపథ్యంలో హర్‌దీప్‌ సింగ్‌ పూరి తాను ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలోనే అబద్ధం ఆడుతూ దొరికిపోయారు. అయినా, ఆయనను మంత్రి పదవి నుండి తొలగించడానికి బదులుగా, మోసపూరితమైన మార్గాల ద్వారా అన్ని రకాలుగా ఆయనను కాపాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులను, అవమానాన్ని నివారించేందుకు గానూ ప్రధాని తక్షణమే కేంద్ర మంత్రి పూరిని మంత్రివర్గం నుండి తొలగించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -