Friday, April 24, 2026
E-PAPER
Homeజాతీయంతగ్గిన బియ్యం ఎగుమతులు

తగ్గిన బియ్యం ఎగుమతులు

- Advertisement -

7.5 శాతం క్షీణించి 11.53 బిలియన్‌ డాలర్లకు
హెక్టారుకు 3.2 టన్నులకు ధాన్యం పెరిగినా..ఎక్స్‌పోర్టుల్లేక రైతుకు కష్టాలు
న్యూఢిల్లీ :
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం భారత బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఎగుమతులు 7.5 శాతం క్షీణించి 11.53 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా ఇరాన్‌, యుఎఇ, సౌదీ అరేబియా వంటి దేశాలకు ఎగుమతులు భారీగా తగ్గాయి. గత మార్చి నెలలోనే ఎగుమతులు 15.36 శాతం పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భారత బాస్మతి బియ్యానికి అతిపెద్ద మార్కెట్‌ అయిన ఇరాన్‌లో అస్థిరత నెలకొనడంతో ఆర్డర్ల రాక, చెల్లింపుల ప్రక్రియ, షిప్పింగ్‌ షెడ్యూళ్లు అన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఎగుమతిదారులు తమకు రావాల్సిన బకాయిల విషయంలో అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు.మరోవైపు దేశీయంగా బియ్యం దిగుబడి హెక్టారుకు 3.2 టన్నులకు పెరిగినప్పటికీ.. అంతర్జాతీయంగా తలెత్తిన ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్య రైతులపై, ఎగుమతిదారులపై భారంగా మారుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పడిపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. యుద్ధం వల్ల రవాణా ఖర్చులు పెరగడం, సామాన్యుడికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యవసాయ రంగం విదేశీ మార్కెట్లపై ఆధారపడటం ఈ విపత్కర పరిస్థితుల్లో శాపంగా మారుతోంది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే గ్లోబల్‌ మార్కెట్‌లో భారత్‌ తన ఆధిపత్యాన్ని కోల్పోవడమే కాకుండా దేశీయంగా రైతుల సంక్షేమం దెబ్బతినే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -