Friday, April 24, 2026
E-PAPER
Homeజాతీయం'విద్యా వివక్ష'

‘విద్యా వివక్ష’

- Advertisement -

ప్రయివేట్‌ పాఠశాలల యాజమాన్యాల
తీరు విద్యా హక్కు ఉల్లంఘనే
ఖరీదైన పుస్తకాల సూచనలతో పేరెంట్స్‌కు ఆర్థిక భారం
పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆందోళన
కేంద్ర విద్యాశాఖ, సీబీఎస్‌ఈ, తెలంగాణ, ఏపీ సహా అన్ని రాష్ట్రాలకు నోటీసులు
30 రోజుల్లో పాఠ్య పుస్తకాల జాబితాలపై ఆడిట్‌ చేయాలని ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశవ్యాప్తంగా ఉన్న ప్రయివేట్‌ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల ఎంపిక, అధిక ధరలకు ప్రయివేట్‌ పబ్లిషర్ల పుస్తకాల విక్రయంపై వస్తున్న ఫిర్యాదులను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంలో ప్రయివేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరును ‘విద్యా వివక్ష’గా అభివర్ణిస్తూ, తెలంగాణ, ఏపీ సహా అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు, సీబీఎస్‌ఈకి నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లో పాఠ్యపుస్తకాల జాబితాలపై దేశవ్యాప్త ఆడిట్‌కు ఆదేశించింది. ఏప్రిల్‌ 9న అందిన ఈ ఫిర్యాదులు, మీడియా కథనాలపై తాజాగా ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందించి ంది. ఎంపిక చేసిన ప్రచురణ సంస్థల నుంచి కాకుండా, ప్రయివేట్‌ పుస్తకాలు కొనుగోలు చేయాలని తమను బలవంతం చేస్తున్నారని, ఏటా సవరించబడుతోన్న ఈ పుస్తకాలు తమకు ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై నమో ఫౌండేషన్‌ దాఖలు చేసిన ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రియాంక్‌ కనూంగో నేతృత్వంలో జరిగిన విచారణలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రయివేట్‌ పాఠశాలలు సూచిస్తున్న ఈ ఖరీదైన పుస్తకాలతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడంతో పాటు పిల్లలను విద్యకు దూరం చేసే ఆందోళనలు రేకెత్తిస్తోందని అభిప్రాయపడింది.
విద్యా హక్కు ఉల్లంఘనే
ఈ పరిస్థితులు బాలల ఉచిత, నిర్భంధ విద్యా హక్కు(ఆర్టీఈ) చట్టం ఉల్లంఘనలను సూచిస్తోందని ఎన్‌హెచ్‌ఆర్సీ పేర్కొంది. ఈ చట్టంలోని సెక్షన్‌ 29ని ఉటంకిస్తూ… నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌ సీఈఆర్టీ) వంటి నియమిత విద్యా అధికార సంస్థలే పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాలను రూపొందించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ప్రయివేట్‌ పుస్తకాలను సూచించడం అదనపు ఆర్థిక భారాన్ని మోపవచ్చని, అలాగే ఉచిత, సమానమైన ప్రాథమిక విద్యా అనే చట్టం ఉద్దేశాన్నే దెబ్బతీయవచ్చని పేర్కొంది. ఇది జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)-2020 లక్ష్యాలను నీరుగార్చే ప్రమాదం ఉందని తెలిపింది.
రెండంచెల విద్యా వ్యవస్థ ఏర్పడే ప్రమాదం
అనేక ప్రయివేట్‌ ప్రచురణలను సూచించడం వల్ల పిల్లల స్కూల్‌ బ్యాగ్‌ల బరువు పెరిగి, వారి ఆరోగ్యాలపై ప్రమాదం చూపే అవకాశం ఉందని పేర్కొంది. తద్వారా జాతీయ విధానాన్ని ఉల్లంఘించడమే అవుతుందని గుర్తు చేసింది. ఈ కారణాలతో వాణిజ్య ప్రయోజనాలతో నడిచే ‘రెండంచెల విద్యా వ్యవస్థ’ ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ విషయంలో ఆర్టీఈ నిబంధలను పాటించేలా ఆదేశాలు జారీ, 30 రోజుల్లో నిర్థేశిత పుస్తకాల స్కూల్స్‌ వారీగా ఆడిట్‌ చేయాలని రాష్ట్రాలను కోరింది. అలాగే ఎన్సీఈఆర్టీ వంటి సంస్థల పాత్ర, ప్రాథమిక స్థాయిలో పరీక్షా బోర్డులకు ఏమైనా అధికార పరిధి వంటి అంశాలపై 15 రోజుల్లో స్పష్టం చేయాలని కేంద్ర విద్యా శాఖను కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -