Friday, April 24, 2026
E-PAPER
Homeజాతీయంగూగుల్‌ నిర్వాసిత రైతులకు అండగా నిలిచిన సీపీఐ(ఎం) నాయకుల అరెస్టు

గూగుల్‌ నిర్వాసిత రైతులకు అండగా నిలిచిన సీపీఐ(ఎం) నాయకుల అరెస్టు

- Advertisement -

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు నేపథ్యంలో నిర్వాసిత రైతులను మద్దతు తెలపడానికి గురువారం ఆ గ్రామానికి వెళ్లిన సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. స్టేషన్‌కు తరలించి కొన్ని గంటలపాటు ఉంచి అనంతరం వారిని విడుదల చేశారు. భూములు కోల్పోయిన సుమారు 520 మంది రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే గూగుల్‌ డేటా సెంటర్‌ పనులు ప్రారంభించాలని ఇటీవల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం, నిర్వాసితులకు న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇవ్వడం తెలిసిందే. హామీలను అమలు చేయకుండానే ఈ నెల 28న గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయడానికి చకాచకా ఏర్పాట్లు జరుగుతుండడం, తర్లువాడలో సుమారు 400 మంది పోలీసులు మోహరించడం, గూగుల్‌ డేటా సెంటర్‌కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తుండడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వాసిత రైతులను గత పది రోజులుగా స్టేషన్‌కు పిలిపిస్తూ గూగుల్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే అక్రమ కేసులు పెడతామని, పాత కేసులు ఉంటే బయటకు తీస్తామని పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ విషయాలు తెలిసి నిర్వాసిత రైతులతో మాట్లాడడానికి, వారికి మద్దతు తెలపడానికి తర్లువాడ గ్రామానికి వెళ్లిన సీపీఐ(ఎం) 78వ వార్డు మాజీ కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, భీమిలి డివిజన్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తిలను పోలీసులు అడ్డుకొని బలవంతంగా జీపులోకి ఎక్కించి అరెస్టు చేశారు. ఈ ఘటనతో అక్కడున్న రైతులు నిర్ఘాంతపోయారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు ఆనందపురం స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటల తర్వాత వారిని విడుదల చేశారు. జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే ఇచ్చిన హామీ అమలు కాకపోవడం పట్ల నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులతో మాట్లాడనీయకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికం
ఈ సందర్భంగా గంగారావు, ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి మాట్లాడుతూ రైతులతో మాట్లాడనీయకుండా అడ్డుకొని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాకే గూగుల్‌ శంకుస్థాపన పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గూగుల్‌ డేటా సెంటర్‌లో భూములు కోల్పోయి పరిహారం అందని తర్లువాడ రైతుల దగ్గరకు వెళ్తున్న సీపీఐ(ఎం) నాయకులను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
గంగారావు అరెస్టు అప్రజాస్వామికం : సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన
అదానీ గూగుల్‌ సెంటర్‌ ఏర్పాటు కానున్న విశాఖజిల్లా ఆనందపురం మండలం తర్లువాడ రైతులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) నాయకులు, కార్పొరేటర్‌ బి.గంగారావును, కొంతమంది నాయకులను అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. అదానీ గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన వారిని గ్రామంలోకి రానీయకుండా రైతులతో ఎటువంటి సమావేశాలు నిర్వహించకుండా అరెస్టు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా గూగుల్‌ డేటా సెంటర్‌ పనులు చేపట్టకూడదని రైతులు ఆందోళన చేస్తుంటే అణచివేసేందుకు పోలీసులు భారీగా మోహరించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు పునరావాస ప్యాకేజీ, నష్టపరిహారం చెల్లించిన తరువాతే గూగుల్‌డేటా సెంటర్‌ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -