Friday, April 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతాంగ ఉద్యమాలు బలోపేతం కావాలి

రైతాంగ ఉద్యమాలు బలోపేతం కావాలి

- Advertisement -

మహాసభలో ప్రజా సంఘాల సౌహార్ద సందేశాలు
కొత్తగూడెం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి

దేశంలోను, రాష్ట్రంలోనూ రైతాంగ ఉద్యమాలు మరింతగా బలోపేతం కావాలని పలు ప్రజా సంఘాలకు చెందిన నేతలు ఆకాంక్షించారు. తద్వారా మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గురువారం ప్రారంభమైన రైతు సంఘం రాష్ట్ర మహాసభలో వారు సౌహార్ద సందేశాలనిచ్చారు.

కేరళ సర్కారుపై విమర్శలు సరికాదు : వ్యకాస ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకటరాములు
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేయటం మాని.. కేరళలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంపై బురద జల్లడమేంటని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు ప్రశ్నించారు. ఉపాధి హామీ పనులను 150 రోజులకు పెంచడం, రూ.400 కూలి, పట్టణ ప్రాంతాలకు విస్తరణ తదితర హామీలేమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సంక్షేమ పథకాలు వ్యవసాయ కార్మికుల దరి చేరడం లేదన్నారు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యపోరాటాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.
49 జీవోను తిప్పికొట్టాం : ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు -బండారు రవికుమార్‌
ఆదివాసీ గిరిజనులను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 49ని తీసుకొచ్చిందని, ఐక్య పోరాటాల ద్వారా దాన్ని తిప్పికొట్టామని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్‌ అన్నారు. తెలంగాణలో పోడు రైతులకు సంబంధించి 8 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంలో ఆదివాసీలపై పాలకులు చేస్తున్న దాడిని ఎత్తిచూపారు. దేశంలో తునికాకు సేకరణ చేపట్టని ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని విమర్శించారు. తెలంగాణలోనూ అలాగే చేయాలని చూస్తే దాన్ని తిప్పికొట్టామని గుర్తు చేశారు.
దేశాన్ని నిలబెట్టుతున్నది రైతే : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
దేశాన్ని నిలబెడుతున్నది రైతేనని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు పెరగాలనీ, వ్యవసాయ విద్యను విస్తృత పర్చాలని డిమాండ్‌ చేశారు. మోడీ సర్కారు విధానాలతో వ్యవసాయం కంపెనీల చేతుల్లోకి వెళితే… అన్నదాతలు కూలీలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఇలాంటి విధానాలపై రైతులు, విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలన్నారు.

మోడీ మెడలు వంచింది రైతులే : డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.వెంకటేశ్‌
మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి మోడీ సర్కారు మెడలు వంచి విజయం సాధించడం ఒక్క రైతులతోనే సాధ్యమైందని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.వెంకటేశ్‌ అన్నారు. పాలకుల విధానాలతో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్నదనీ, మరోవైపు సాగు ఖర్చులు పెరగడం, పంటలకు మద్దతు ధర దక్కకపోవడంతో యువ రైతులు వ్యవసాయం నుంచి తప్పుకుంటున్నారని చెప్పారు. దేశం నిలబడాలంటే రైతు నిలబడాలన్నారు.
అడవిబిడ్డలపై పాలకుల దాడి : గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాంనాయక్‌
కేంద్రంలోని బీజేపీ పాలకులు కార్పొరేట్లకు సాగిలపడి అడవిబిడ్డలపై దాడులు చేయిస్తున్నారని, అపారమైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు గిరిజనులను అడవుల నుంచి వెళ్లగొడుతున్నారని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం నాయక్‌ విమర్శించారు. గిరిజనులు, రైతులు ఒకే మాదిరిగా భూ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతాంగ పోరాటాల్లో గిరిజన సంఘం కూడా కలిసి వస్తుందని చెప్పారు.
చేతివృత్తులపై ప్రభావం : వృతి సంఘాల సమన్వయ కమిటీ నాయకులు పి.ఆశయ్య
కేంద్ర ప్రభుత్వం క్రమంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేస్తుండటంతో దాని ప్రభావం చేతి వృత్తులపై పడుతున్నదని వృత్తి సంఘాల సమన్వయ కమిటీ నాయకులు పి.ఆశయ్య చెప్పారు. పోరాటాల విషయంలో మిగతా ప్రజా సంఘాలకు రైతు సంఘం దిక్సూచి అని కొనియాడారు. మూడు నల్లచట్టాలను వెనక్కి కొట్టడంలో రైతులు విజయం సాధించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎమ్‌ఎస్‌.స్వామినాథన్‌ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -