– వారి డిమాండ్స్ పరిష్కరించకుంటే
ఉద్యమం ఉధృతం: సమ్మెలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ -జహీరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా.. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని, ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపోలో గురువారం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని, వేతన సవరణ చేయకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఉద్యోగ భద్రత ఊసే లేకుండా పోయిందని, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి స్కీము మహిళల ఉచిత ప్రయాణాన్ని ఆర్టీసీ కార్మికుల భుజాల మీద వేసుకొని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్న ముఖ్యమంత్రి.. ఎందుకు వారిని రోడ్లమీద వేసి ఇబ్బందికి గురి చేస్తున్నారని ప్రశ్నించారు.
ఎలక్ట్రికల్ బస్సులతో కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లిందన్నారు. కార్మిక సంఘాల అనుమతిని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ సమ్మెపై ప్రభుత్వం స్పందించి.. తక్షణమే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేష్, సహాయ కార్యదర్శి మహిపాల్, నాయకులు నరేష్, కిరణ్, బాల్ రాజ్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



