సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-సిద్దిపేటఅర్బన్
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపి.. వారి న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని కొత్త బస్టాండ్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక సంఘం ఎన్నికలు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజ్ తదితర 32 డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం వేసిన అధికారుల కమిటీ 4 వారాల గడువు కోరడం సమ్మెను నీరుగార్చడమే అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే జేఏసీ నాయకులతో చర్చలు జరిపి, ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
అద్దె బస్సుల ముసుగులో సంస్థను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో భాగంగా జరుగుతున్న ఎలక్ట్రిసిటీ బస్సులను ప్రయివేటు వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి నడపడం మానుకోవాలన్నారు. ప్రభుత్వమే నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి, వాటిని సంపూర్ణంగా ఆర్టీసీ సంస్థకే అప్పగించాలన్నారు. డ్రైవర్, కండక్టర్ నియామకాలను వెంటనే చేపట్టి కార్మికులపై అదనపు పని భారాన్ని తగ్గించాలన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలను జరపకపోవడం అంటే వారి హక్కులను కాలరాస్తూ, కార్మికుల గొంతు నొక్కడమే అని విమర్శించారు. ఇది కార్మికవర్గం సాధించుకున్న చారిత్రక హక్కులపై దాడి అని.. తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 39 వేల మంది కార్మికులు రోడ్డున పడేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే ప్రయాణికులు, ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సమ్మె విరమింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి జాలిగాపు శిరీష, జేఏసీ నాయకులు రాజు, మహేశ్వరరెడ్డి, రాజయ్య పాల్గొన్నారు.
ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



