– ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లలో 29 పరిష్కారానికి సిద్ధం
– మిగతా వాటికి సమయం కోరుతోంది.. త్వరలో శుభవార్త వస్తుంది : ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి
– గత ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు తీవ్ర నష్టం : ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి.చంద్రశేఖర్
– బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, త్వరలో ప్రభుత్వం నుంచి కార్మికులు శుభవార్త వింటారని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి తెలిపారు. టీజీఎస్‌ఆర్‌టీసీ, ఐఎన్‌టీయూసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టడం బాధాకరమన్నారు. ఐఎన్‌టీయూసీ తరపున సమ్మెకు మద్దతు తెలపడంతోపాటు నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నామని చెప్పారు. ఐఎన్‌టీయూసీ అనుబంధ సంస్థలు ఇప్పటికే సీఎం ఎ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఆర్టీసీ ఎండి వై.నాగిరెడ్డిని కలిసి కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశాయని చెప్పారు. అయితే, ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదించిన 32 డిమాండ్లలో 29 డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోపాటు కార్మిక సంఘాల పునరుద్ధరణ అంశాలపై విశ్లేషించేందుకు సమయం కోరుతోందని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేస్తే పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు హరీశ్‌రావుతోపాటు బీఆర్‌ఎస్ నేతలు కార్మికులపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందుతున్నాయని, పెండింగ్‌లో ఉన్న 2017 పీఆర్సీ, డీఏలను క్లియర్ చేసిందని తెలిపారు. 2013 పెండింగ్ బాండ్స్ క్లియర్ చేయడంతోపాటు రూ.1205 కోట్లు ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించినట్టు చెప్పారు. రూ.690 కోట్లు ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించారన్నారు. ఇవే కాకుండా నెల వారీగా పీఎఫ్, సీసీఎస్‌కు రూ.75 కోట్లు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులపై పని భారం పడకుండా 4,538 ఉద్యోగ నియామకాల భర్తీ త్వరలోనే పూర్తవుతుందని, సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 1,134 కారుణ్య నియామకాలు చేపట్టినట్టు వివరించారు. గత ప్రభుత్వంలో వివిధ కారణాలతో శాశ్వతంగా సర్వీసు నుంచి రిమూవ్ అయిన వారిలో ఇప్పటి వరకు దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇచ్చినట్టు తెలిపారు.
ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం సక్సెస్ కావడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా కీలకమైందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.నాగన్నగౌడ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌లో ఉన్న ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులపై పని భారం తగ్గించడంతోపాటు తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్టీసీ స్టాఫ్, వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేష్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గొడిశాల అబ్రహం, ఎస్ డబ్ల్యూయూ నాయకులు ఎర్రోళ్ల జయ, అఫీజ్ ఖాన్, సురేందర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



