Friday, April 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడ్చల్‌ కలెక్టర్‌ నిర్ణయాలపై హైకోర్టు అసంతృప్తి

మేడ్చల్‌ కలెక్టర్‌ నిర్ణయాలపై హైకోర్టు అసంతృప్తి

- Advertisement -

ప్రయివేటు భూమి వ్యవహారంపై పలు ప్రశ్నలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం బౌరంపేటలోని సర్వే నెంబర్‌ 166/9/2 భూమి విషయంలో కలెక్టర్‌ నిర్ణయాలపై హైకోర్టు గురువారం అసంతృప్తి వ్యక్తం చేసింది. రికార్డులను పరిశీలించి సప్లిమెంటరీ సేత్వార్‌ జారీ చేయాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడం, రాజకీయ ఫిర్యాదుల ఆధారంగా పూర్వ ఉత్తర్వులను పక్కన పెట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. ప్రయివేటు భూమికి తాళం వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తొలగించాలని తహసీల్దార్‌, కలెక్టర్‌ను ఆదేశించింది. ఏప్రిల్‌ 13నాటి ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ ఎస్‌ జీవేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బి విజరుసేన్‌రెడ్డి విచారణ జరిపి, ఆ ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. స్థలానికి వేసిన తాళాన్ని తొలగించాలని ఆదేశిస్తూ, కేసును వచ్చే నెలకు వాయిదా వేశారు.

అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ చర్యలు నామమాత్రం
నగరంలో అక్రమ నిర్మాణాల నియంత్రణలో జీహెచ్‌ఎంసీ చర్యలు సరిపోవడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫిర్యాదులు అధికంగా వచ్చినప్పటికీ, కేవలం షోకాజ్‌ నోటీసులతో పరిమితమవుతోందని పేర్కొంది. అక్రమ నిర్మాణాల ఫిర్యాదులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలనీ, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించింది. కోఠి ప్రాంతంలో జ్ఞానశేఖర్‌ నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదని ముకుందాస్‌ సోని తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసి, స్థలాన్ని సందర్శించి సీలు వేశామని చెప్పినా తదుపరి చర్యలు లేకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

ఐలాపూర్‌ భూ వ్యవహారంలో ఉన్నతస్థాయి కమిటీపై మధ్యంతర ఉత్తర్వులు

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీపై హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వాటిని అమలు చేయరాదని జస్టిస్‌ విజరుసేన్‌ రెడ్డి గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. 2026 ఏప్రిల్‌ 15న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను సమన్వయకర్తగా ఉంచి ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఐలాపూర్‌ గ్రామంలోని సర్ఫ్‌-ఎ-ఖాస్‌ భూముల అంశాలను పరిశీలించే బాధ్యతను కమిటీకి అప్పగించింది. ఇదే సమయంలో 98 ఏండ్ల ఎంఏ షరీఫ్‌ తన భూములను ఏప్రిల్‌ 11, 12 తేదీల్లో హైడ్రా, రెవెన్యూ అధికారులు బలవంతంగా కూల్చివేశారని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ న్యాయస్థాన ప్రక్రియను పక్కన పెట్టేందుకు చేసిన ప్రయత్నమని పేర్కొన్నారు. ఇది చట్ట ప్రక్రియలకు సమాంతరంగా నడిచే చర్యగా మారిందన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, కమిటీ కేవలం వాస్తవాల సేకరణ కోసం ఏర్పాటు చేసినదని తెలిపారు. ఇది సాధారణ కార్యనిర్వాహక చర్య మాత్రమేననీ, న్యాయపరమైన సమీక్షకు లోబడదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి, కమిటీ తన పరిశీలన కొనసాగించేందుకు అనుమతి ఇచ్చినా, ఆ కమిటీ తీసుకునే ఎలాంటి నిర్ణయాలు అమల్లోకి రాకూడదని స్పష్టమైన షరతు విధించారు. విచార ణను వేసవి సెలవుల అనంతరం చేపడతామన్నారు.

సమగ్ర విధివిధానాలతో నివేదిక ఇవ్వండి : హైకోర్టు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలా, సహాయకుడు లేకపోతే చికిత్స ఇవ్వాలా అనే అంశాలపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేవలం ఆధార్‌ అంశంపైనే కౌంటర్‌ దాఖలు చేయడాన్ని తప్పు పట్టింది. సమగ్ర విధివిధానాలతో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తికి ఆస్పత్రిలో వైద్యం నిరాకరణ ఆరోపణల నేపథ్యంలో సుమోటోగా ప్రారంభమైంది. మరో కేసులో, ఆధార్‌ లేకపోయినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తు న్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వికారాబాద్‌ జిల్లాలో పాము కాటుకు గురైన బాలికకు అంబులెన్స్‌ సేవలు అందించినట్టు వెల్లడించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు, వైద్యం నిరాకరణ జరగలేదని గుర్తించి పిటిషన్‌ను కొట్టేసింది.

ఆక్రమణల తొలగింపునకు
తీసుకుంటున్న చర్యలేంటి? : హైకోర్టు

మెదక్‌ పట్టణంలో ప్రభుత్వ భూమి ఆక్రమణలపై దాఖలైన పిటిషన్‌లో, ఆక్రమణల తొలగింపునకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్‌ అధికారులను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కోరింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వ వైఖరి తెలిసిన తర్వాతే ఆ భూముల్లో నిర్మాణాల నిలుపుదలపై ఉత్తర్వులు జారీ చేయాలో లేదో తేల్చుతామని స్పష్టం చేసింది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -