Friday, April 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీ కార్మికుల నిరసనలు

ఆర్టీసీ కార్మికుల నిరసనలు

- Advertisement -

– ఆందోళనలకు సీఐటీయూ మద్దతు
– నర్సంపేట, ఖమ్మంలో ఇద్దరు డ్రైవర్ల ఆత్మహత్యాయత్నం
– ప్రయివేట్‌ డ్రైవర్లతో బస్సులు నడిపించే యత్నం
– పలుచోట్ల అడ్డుకున్న కార్మికులు
– కార్మికులకు టెంట్లు ఇవ్వొద్దని తాండూరులో పోలీసుల వార్నింగ్‌ నోటీస్‌ వైరల్‌

రెండో రోజూ ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతంగా సాగింది. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణం తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు నినదించారు. సమ్మె శిబిరాల్లో పాల్గొన్న ఇద్దరు డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట డిపో ఎదుట డ్రైవర్‌ బోలా శంకర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతని పరిస్థితి విషమించి మృతిచెందాడు. అదేవిధంగా భద్రాచలం డిపో డ్రైవర్‌ లింగారెడ్డి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఖమ్మంలో పురుగుల మందు తాగాడు. నల్లగొండలో ఒకరు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ పోలీసులు ఓవరాక్షన్‌ చర్చనీయాంశంగా మారింది. సమ్మెలో ఉన్న కార్మికులకు టెంట్లు, ఇతర సామాగ్రి ఇవ్వొద్దంటూ టెంట్‌ హౌస్‌, ఫంక్షన్‌ హాల్‌ యజమానులకు వార్నింగ్‌ ఇస్తూ ఇచ్చిన నోటీసు వైరల్‌ అయింది. మరోవైపు సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రయివేటు డ్రైవర్లతో కొన్ని బస్సులను నడిపించారు. ఈ క్రమంలో పలుచోట్ల కార్మికులు బస్సులను అడ్డుకోవడంతో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
నవతెలంగాణ- మొఫసిల్‌ యంత్రాంగం
ఆదిలాబాద్‌లో కార్మికులు బస్టాండ్‌ నుంచి తెలంగాణ చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రయివేటు డ్రైవర్లతో వాహనాలు నడిపించేందుకు ప్రయత్నించడంతో బస్సులను అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. మిర్యాలగూడలో ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట డిపోలో పోలీసుల సమక్షంలో బస్సులను బయటికి తీస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. మెదక్‌ జిల్లా కేంద్రంలో బస్సులను కార్మికులు అడ్డుకున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో సీఐటీయూ నాయకులు సమ్మెకు మద్దతుగా కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో సమ్మెలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు పాల్గొన్నారు. సిద్దిపేట, కరీంనగర్‌లో కార్మికుల సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మద్దతు తెలిపారు. ప్రయాణీకులు ప్రయివేటు సర్వీసులు, కర్నాటక, మహారాష్ట్ర బస్సుల్లో ప్రయాణం చేశారు.

మహబూబ్‌నగర్‌లో తెల్లవారుజాము నుంచి ప్రయివేట్‌ బస్సులు నడిచాయి. అదే సమయంలో ఆర్టీసీ డిపో గేటు ఎదుట కార్మికులు పెద్దఎత్తున ధర్నా చేశారు. డిపో నుంచి బస్సును బయటకు తీస్తుండటంతో కార్మికులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌ వెళ్లడానికి ప్రయివేట్‌ బస్సులో దాదాపు ఒక్కరికి రూ.200 వసూలు చేస్తున్నట్టు సమాచారం. కల్వకుర్తిలో ఓ మహిళా కార్మికురాలు విధులు నిర్వహిస్తున్న ప్రయివేట్‌ బస్సు డ్రైవర్‌పై కారం చల్లి నిరసన తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రయాణికులకు గులాబీ పూలు
కల్వకుర్తి పట్టణంలో ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. డిపో నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీగా వచ్చిన కార్మికులు అక్కడ ప్రయాణికులకు గులాబీ పూలు అందజేసి సమ్మెకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగింది. డిపోల వద్ద కార్మికులు మహాధర్నాలు నిర్వహించారు. వీరికి వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
టెంట్‌హౌస్‌, ఫంక్షన్‌ హాల్‌ యజమానులకు పోలీసుల హెచ్చరిక
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ పోలీసులు టెంట్‌ హౌస్‌, ఫంక్షన్‌ హాల్‌ యజమానులకు వార్నింగ్‌ ఇచ్చారు. తాండూర్‌ పట్టణ పరిధిలోని టెంట్‌ హౌస్‌ యజమానులు, ఫంక్షన్‌ హాల్స్‌, కమ్యూనిటీ, కన్వెన్షన్‌ హాల్స్‌ నిర్వాహకులు ఎవరూ కూడా సమ్మె చేస్తున్న వారికి సహకరించొద్దని సీఐ పరమేశ్వర్‌ హెచ్చరించారు. సమ్మె శిబిరాల ఏర్పాటుకు టెంట్లు, ఇతర సామాగ్రిని సరఫరా చేస్తే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఖమ్మంలో సమ్మె నేపథ్యంలో డ్రైవర్లు, కండెక్టర్లు విధులకు హాజరుకాలేదు. ప్రజా రవాణా వ్యవస్థకు (బస్సులు) ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, ఆటంకాలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని టౌన్‌ ఏసీపీ రమణమూర్తిని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ ఆదేశించారు. సత్తుపల్లిలో దీక్షలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మద్దతు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపో పరిధిలో ఆర్టీసీ కార్మికులను తెల్లవారుజామున పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పోలీస్‌ రక్షణ మధ్య మణుగూరు డిపో నుంచి 52 బస్‌ సర్వీసులను నడిపించారు. ఆధార్‌ కార్డు లేకుండానే అందరికీ ఉచిత ప్రయాణం కల్పించారు. భద్రాచలం డిపో డ్రైవర్‌ లింగారెడ్డి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఖమ్మంలో పురుగుల మందు తాగాడు. అతనికి ఖమ్మంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వివిధ పార్టీల నాయకులు ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లలో రద్దీ..
హైదరాబాద్‌లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నగరంలోని ప్రధాన బస్‌ స్టేషన్లు ఖాళీగా కనిపించాయి. ఎంజీబీఎస్‌, సికింద్రాబాద్‌ జేబీఎస్‌తోపాటు జంట నగరాల్లోని డిపోలు నిర్మానుష్యంగా మారాయి. ప్రయివేటు వాహనాలు అధిక చార్జీలు వసూలు చేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఎక్కువ మంది ప్రయాణికులు హైదరాబాద్‌ మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ సేవలను ఆశ్రయించారు. కూకట్‌పల్లి డిపో ముందు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా సీపీఐ(ఎం) నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -