– ఇప్పటికీ పోలీసుల అదుపులోనే వంద మంది కార్మికులు
– రాజ్యాంగం కల్పించిన అన్ని రక్షణలు ఉల్లంఘన
– ఐలు, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నోయిడా సమ్మె అనంతరం పోలీసుల చర్యలకు గురైన కార్మికులకు అన్ని రకాల న్యాయ సహాయం అందిస్తామని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు), డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు తెలిపారు. సుమారు వంద మంది కార్మికులు ఇప్పటికీ పోలీసుల అదుపులోనే ఉన్నారని, ఎఫ్‌ఐఆర్‌తో సహా పోలీసులు ఎలాంటి సమాచారాన్ని విడుదల చేయలేదని పేర్కొన్నారు. కార్మికుల సమ్మెకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. గురువారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐలు నేతలు సునీల్ కుమార్, సుభాష్ చంద్రన్, ఆద్రిజా భద్ర, డీవైఎఫ్‌ఐ నేతలు రిషి నంది, ఉపాసన గోయల్, ఎస్‌ఎఫ్‌ఐ నేత అచింత్య మాట్లాడారు. సమ్మె అనంతరం లాయర్స్ యూనియన్, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధుల బృందం నోయిడాకు చేరుకుని వాస్తవ నిర్ధారణ నివేదికను సిద్ధం చేసిందన్నారు. వెయ్యి మందికిపైగా పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకున్నారని, వారిలో 300 మందికిపైగా చిన్నారులు ఉన్నారని దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ”నోయిడాలో జరిగిన పరిణామాలు ఊహకు మించినవి. ప్రభుత్వ చర్య రాజ్యాంగం కల్పించిన అన్ని రక్షణలను ఉల్లంఘించింది. మహిళలు, పిల్లలపై దాడి జరిగింది. అదుపులోకి తీసుకున్న వారికి న్యాయ సహాయం నిరాకరించబడింది. పోలీసులు కనీసం యూనిఫాం కూడా లేకుండా చర్యలు చేపట్టారు. అదుపులోకి తీసుకున్న వారిని కోర్టు ముందు హాజరుపరచడానికి పోలీసులు సిద్ధంగా లేరు” అని వారన్నారు.
”విచారణ నివేదికను సిద్ధం చేయడానికి వెళ్లిన బృందాన్ని అడ్డుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నించారు. కార్మికులు, ప్రజలతో మాట్లాడకుండా బృందం సభ్యులను నిరోధించారు. అదుపులోకి తీసుకున్న వారి గురించి సమాచారం ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. మీరు బయటి వ్యక్తులు, ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటు న్నారు?” అని పోలీసులు బదులిచ్చారని ప్రతినిధులు తెలిపారు. నిరసనల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న సీఐటీయూ నాయకుడు గంగేశ్వర్ దత్ శర్మ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
నోయిడా కార్మికులకు న్యాయ సహాయమందిస్తాం
- Advertisement -
- Advertisement -


