‘‘నాకు చాలా విషయాలు తెలుసు! నిజం చెబితే నేను ఇబ్బందుల్లో పడతాను. వాళ్లు చాలా శక్తివంతులు. సమయం వచ్చినప్పుడు నేనే మాట్లాడతాను! అప్పటి వరకు నన్ను అడక్కండి’’ ప్రస్తుత బీజేపీ ఎంపీ, ఉత్తరప్రదేశ్‌కి చెందిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈనెల 17వ తేదీన మీడియాతో చేసిన వ్యాఖ్యలివి.
నిప్పు లేకుండా పొగరాదని… అయోధ్య ఆలయంలో వందల కోట్ల రూపాయలు తినేశారని బహిరంగంగా బ్రిజ్ భూషణ్ ఆరోపించారు. ఈయన అంతలా భయపడి పోవటానికి కారణ మైన ఆ పెద్ద మనుషులు ఎవరు? రామ జన్మభూమి ఉద్యమంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన, ఆరుసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన బ్రిజ్ భూషణ్ లాంటి వ్యక్తే ఇలా భయపడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?
ధర్మసేనకు చెందిన సంతోష్ ధూబే మాట్లాడుతూ తాము కర్ సేవక్ పురంలో భద్రపరిచిన బంగారు, వెండి, అష్టధాతువులతో తయారైన 1250 రామ్ శిలలు (ఇటుకలు) దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి వచ్చినవి కనపడటం లేదని వాటి స్థానంలో మట్టి ఇటుకలు ఉన్నాయని ఆరోపించారు. రామ మందిరం ట్రస్ట్ లోని కొందరు కీలక పదాధికా రులపై అనుమానాలు ఉన్నాయని, వారి పేర్లను ప్రస్తావిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పోలీసులు తిరస్కరించడంతో, కోర్టులో కేసు దాఖలు చేశారు. రామ జన్మభూమి కేసులో కీలకమైన వ్యక్తిగా పనిచేసిన మహంతు ధర్మదాసు మాట్లాడుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో కాదు. సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి, రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేన్ మిశ్రా మాట్లా డుతూ అయోధ్య ఆలయ నిర్వహణలో ప్రక్షాళన అవసరమని, తీవ్ర లోపాలున్నాయని, భక్తుల విశ్వాసాలను దెబ్బ తీయడంతో పాటు, ఆలయ పరిపాలనా వ్యవస్థలోని లోపాలు కళ్లకు కట్టినట్టు తన అనుభవాన్ని వివరించారు. ఆలయంలో 1500 మంది విధులు నిర్వహిస్తున్నారని, వీరిలో చాలా మంది వలంటీర్లని వీరికి బాధ్యతలు అప్పగించడానికి సరైన వ్యవస్థ లేకపోవడం, జవాబు దారీతనం లోపించటం, విరాళాల లెక్కల్లో అవకతవకలు చోటు చేసుకోవడం, ఒక ఆలయ ఉద్యోగి ఇంటి నుంచి నగదు స్వాధీనం చేసుకోవడం వంటివి తనను కలతకు గురిచేశాయని అన్నారు. ఆలయ నిర్వహణను అనుభవజ్ఞులైన వారికి అప్ప చెప్పాలని ఆయన కోరారు.
దీనిపై స్పందించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్య యోగి మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాముని ఆలయం కోసం 500 ఏళ్లు ఆగాము. సిట్ నివేదిక వచ్చేవరకు పదిహేను రోజులు ఆగలేరా? ఆధారాలు ఉంటే సిట్‌కు సమర్పించండి’’అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
రామాలయంలో ఏం జరుగుతోంది?
అయోధ్య రామాలయంలో ఏం జరుగుతుందన్న ప్రశ్న భక్తుల నుంచి ఎదురవుత ున్నది. భక్తులు ఇచ్చిన సొమ్ములు, బాల రాముని అభరణాలు, ఆస్తులు భద్రమేనా? అన్న సంశయం వీరిలో వ్యక్తమవుతున్నది. అయోధ్య ఆలయంలో భక్తులు ఇచ్చిన కానుకలు, రాముని ఆభరణాలు చోరీకి గురి అయ్యాయని గత కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ స్పందించలేదు. పైగా ఇవి ఆరోపణ లేనని కొట్టిపారేస్తూ వచ్చారు. రామ జన్మభూమి ట్రస్టులో వివాదాలు ముదిరి ఒకరిపై… మరొకరు ఆరోపణలు చేసుకునే స్థాయికి వెళ్లటంతో రాముని ఆలయంలో ఏం జరుగుతుందన్న చర్చ … జాతీయ మీడియాలో చోటు చేసుకోవడంతో ఈ సమస్యపై యూపీ ప్రభుత్వం అనివా ర్యంగా స్పందించాల్సి వచ్చిం ది. ముగ్గురు అధికారులతో ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది.
రామాలయానికి చెందిన రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్, లవకుష్ మిశ్రా, అను కల్ప్ మిశ్రా మరో ఇద్దరి ఆధ్వర్యంలో చోరీలు జరిగాయని ఫిర్యాదులు వచ్చినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. వీరిలో లవకుష్ మిశ్రా ఇంటి నుంచి 12 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేయకపోవడం విశేషం. సిట్ విచారణలో పదకొండు నెలల్లో ఆలయ భద్రత కోసమే పది కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్టు తేలింది. అయినా గడచిన 45 రోజుల సీసీ ఫుటేజ్ మాత్రమే అందుబాటులో ఉందని, ఉన్న ఫుటేజ్ కూడా ట్యాంపరింగ్‌కు గురైందని అంటున్నారు. హుండీల నుంచి నగదు, నగలు మాయమవడం, ఇతర చోరీ వ్యవహారాల గురించి 200 మందికి పైగా విచారిస్తున్నారని, ఇందులో 125 మంది విచారణ పూర్తయిందని మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి..
2025 జనవరి, ఫిబ్రవరి నెలలలో జరిగిన మహా కుంభమేళా సంద ర్భంగా హుండీల ద్వారా వచ్చిన సొమ్ముకు లెక్కా … పత్రం లేకుండా పోయిందని సిట్ గుర్తించింది. బంగారం, వెండి, నగలు, వజ్రాలు వంటి కానుకలకు వచ్చిన రశీదులకు… ఆలయంలో ఉన్న రికార్డులకు సరిపోవటం లేదని తేలింది. మహా కుంభమేళా సందర్భంగా ప్రతిరోజు పది లక్షల మంది భక్తులు అయోధ్యను సందర్శించారని హుండీలు గంటల వ్యవధిలో నిండి పోయేవని, రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగిందని, ఈ రెండు నెలల పాటు వచ్చిన విరాళాలు, కానుకలకు సరైన లెక్క లు లేవని తేలింది. సీసీటీవీ ఫుటేజీలు డిలీట్ చేసి ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో ఆలయ సిబ్బంది తమకు తెలియకుండా అయోధ్య విడిచి వెళ్లకూడదని సిట్ ఉద్యోగులకు ఆంక్షలు పెట్టింది. దేశంలోని ఆలయాలన్నింటినీ ప్రభుత్వ పెత్తనం నుంచి తొలగించి… అయోధ్య తరహాలో హిందూ సమాజానికి అప్పగించాలని, ఆరెస్సెస్ అనుయాయ సంఘాలు దేశమంతటా హిందూ శంఖారావ సభలు పెట్టి యాగీ చేస్తున్న సందర్భాలను ఒకసారి గుర్తుకు చేసుకోండి. స్వయంగా ప్రధాని మోడీ పదకొండు రోజులపాటు ప్రత్యేక దీక్షను చేపట్టి 2024 జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన అతిథిగా పాల్గొని మోడీ చేసిన ప్రసంగం గుర్తు చేసుకుంటే శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికామని, రామమందిరాన్ని దేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా అభివర్ణించిన విషయం గుర్తుందిగా!
పైన పటారం..లోన లొటారం
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆలయం… పైన పటారం కనిపిస్తున్నది. మేడిపండు చందంగా తయారైన ఈ వ్యవహారంలో బీజేపీ పరివారానికి దేవుని మీద భక్తి కంటే… దేవుని ఆస్తులు, కానుకలు, హుండీల మీదనే కన్ను ఉన్నట్టుగా నిరూపితమైంది.అయోధ్యలోని రామ మందిర నిర్వహణ ట్రస్టు విడుదల చేసిన ఆదాయ వివరాలను పరిశీలిస్తే 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ఆలయం మొత్తం ఆదాయం సుమారు రూ.327 కోట్లుగా ఉంది. ప్రకటించిన ఆదాయంలో భక్తుల విరాళాలు రూ..153 కోట్లుగా పేర్కొన్నారు.
రూ.5 వేల కోట్ల ఆస్తులున్న తిరుమలలో భక్తుల సంఖ్య రోజుకు 70 వేల నుంచి 75 వేల మంది వస్తుంటారు. సెలవు, ప్రత్యేక దినాలలో 90 వేల నుంచి లక్ష మందికి పైగా వస్తుంటారు. టీటీడీకి రోజుకు సరాసరిన 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. తిరుమల ఆలయంలో లక్ష మంది లోపు దర్శించుకుంటే సరాసరిన రోజుకు నాలుగు కోట్ల ఆదాయం వస్తుంటే అయోధ్య ఆలయాన్ని 2025 జనవరి, ఫిబ్రవరి నెలలలో రెండు నెలల పాటు సరాసరిన పది లక్షల మంది ప్రతిరోజూ దర్శించుకుంటే ఆదాయం ఏ స్థాయిలో ఉండాలి? అన్న ప్రశ్న ఉత్పన్నమ వుతుంది. రామ మందిరం ట్రస్ట్ ప్రకటించిన వార్షిక ఆదాయంపై అనుమానాలు ఎవరికైనా తలెత్తుతాయి.
అయోధ్య ఆలయంలో జరుగుతున్న తంతుపై కిమ్మనకుండా హిందుత్వ వాదులు కూర్చున్నారు. దేశంలోని ఆలయాలను హిందూ సమాజానికి అప్పజెప్పాలని, ప్రభుత్వ పెత్తనం నుంచి విముక్తి కల్పించాలని, దేశ మంతటా హిందూ శంఖారావం పేరిట సభలు జరుపుతున్న విశ్వ హిందూ పరిషత్ పెద్దలకు, అయోధ్య ఆలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధుసంతులకు ఎందుకు నోట మాట రావడం లేదు. తిరుమల ఆలయ వివాదాలైతే అయినదానికి… కాని దానికి విరుచుకుపడే పెద్ద మనుషులకు నోరు పెగలక పోవడానికి కారణం? ఈ వివాదాల వెనుక మోడీ పరివారం ఉందనే కదా! బాల రాముడికి… బాలారిష్టాలు తప్పిపోయి… భక్తి విశ్వాసాలతో భక్తులు సమర్పించిన కానుకలకు భద్రత రావాలని కోరుకుందాం.
కందారపు మురళి
9490098840
‘అయోధ్య’లో దొంగలు పడ్డారు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



