Thursday, June 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రశ్నిస్తే నేరమా…!?

ప్రశ్నిస్తే నేరమా…!?

- Advertisement -

భరత్ భూషణ్ తివారి 28 సంవత్సరాల యువకుడు. ప్రజల సమస్యల మీద పోరాడుతూ, ప్రశ్నిస్తూ, రాజ్యానికి ఎదురు తిరిగి నిలిచాడు. అంతే రాజ్యం అతనిని జూన్ 17వ తేదీన పోలీస్ ఎన్‌‌కౌంటర్‌‌లో కాల్చి చంపేసింది. ఈ వార్తను ప్రధాన మీడియా విస్మరించినా, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఎలాంటి నేర చరిత్ర లేని, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించే ఒక యువకుడ్ని పోలీసులు కాల్చి చంపడం పై ప్రజలు, ప్రతిపక్షాలు హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు జరిపిన ఈ ‘ఫేక్ ఎన్‌‌కౌంటర్’ పై విమర్శలు వెల్లువెత్తడంతో బీహార్ ప్రభుత్వం దిగొచ్చి, రిటైర్ హైకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణకు ఆదేశాలిచ్చింది. సంబంధిత నలుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగ టంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తూ, బీహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలైంది.

బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా బిలౌటి గ్రామానికి చెందిన భరత్ భూషణ్ తివారి తాను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాడైనప్పటికీ, తన ప్రాంతంలోని అణగారిన వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం, కు‌ళ్లిపోయిన ఈ వ్యవస్థలతో పోరాడాడు. గ్రామంలోని రోడ్ల దుస్థితి, తన ప్రాంతంలో గంగా నది వరదలు, అవినీతి, లంచగొండితనంపై సోషల్ మీడియా వేదికగా గళమెత్తుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రజా ఆదరణ పొందాడు.తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా, పోలీసు ముట్టడి మధ్య కూడా వెనకడుగు వేయకుండా ,ప్రజల సమస్యలను లైవ్ ద్వారా సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి వినిపించాడు, వ్యవస్థల్ని ప్రశ్నించాడు. లోపాలను ప్రజలకు ఎత్తి చూపాడు. పరిష్కారం కోసం పోరాడాడు. దోపిడీ శక్తులకు తలనొప్పిగా మారాడు. ఇంకేముంది భరత్ తివారిని ఎన్‌‌కౌంటర్ చేసి చంపేసింది ఈ రాజ్య వ్యవస్థ. ఎప్పటిలాగే పోలీసులు తమ ఆత్మ రక్షణ కోసమే ఎదురు కాల్పులు జరిపామని కథలు చెప్పారు. కానీ ఘటనకు కొద్ది నిమిషాల ముందు భరత్ తన ఫేస్‌‌బుక్‌ లైవ్ ద్వారా రికార్డు చేసిన వీడియోలు పోలీసులు చెప్పినవి నిజం కాదని తెలిపాయి. భరత్ ఒక బహిరంగ మైదానంలో నిలబడి తన చేతిలోని పిస్టల్ ను పోలీసుల వైపు విసిరేసి, లొంగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. నిరాయుదుడిగా మారిన తర్వాత కూడా పోలీసులు అతన్ని టార్గెట్ చేసి కాల్చారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఊహించిన భరత్… తన మరణానంతరం శరీర అవయవాలను దానం చేయాలంటూ ఎన్‌‌కౌంటర్ కంటే ముందే చేసిన వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తుంది. అతడి అంత్యక్రియలకు వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు. అంటే అతడు ఎంత ప్రజాదరణ పొందాడో అర్థం అవుతుంది.‘ప్రజల గొంతుకను నొక్కెందుకే ఈ హత్య చేశారు’అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.

అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సంచనాలకు పేరుగాంచిన విజయవాడ సిటీలో తాజాగా గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు జాతీయస్థాయిలో హాట్ టాపిక్గా నిలిచింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న 24 గంటల్లోగా స్థానిక మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలని చట్టం చెబుతుంది. కానీ పోలీసులు ఆ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సాయికృష్ణను మాయం చేశారని, కుటుంబ సభ్యులు, సామాన్యుల నుంచి మేధావుల వరకు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి నిందితుడిపై ఎన్ని తీవ్రమైన కేసులు ఉన్నా… జ్యుడీషియల్ కాస్టడీ(జైలు)కి తరలించాలి లేదా విచారణ నిమిత్తం తిరిగి పోలీసులకు అప్పగించాలి అని స్థానిక మెజిస్ట్రేట్ నిర్ణయిస్తారు. ఇవేమీ జరగకుండా సాయి కృష్ణ మిస్సింగ్ ఓ మిద్యగా మారింది. తన కొడుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ నలభై రోజులు అతన తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న అవమానమే మిగిలింది. కనీసం ‘నా కొడుకుని ఒక్కసారి చూపించండి చాలు, వెళ్లిపోతా’ అని ఆ పిచ్చి తల్లి ప్రాధేయపడిన రక్షకభటులు కనకరించకపోవడం మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. పైగా స్టేషన్ హౌస్ ఆఫీసర్…‘నీ కొడుకు చచ్చాడు అనుకోని ఫొటోకు దండేసుకో’ అని అతి క్రూరంగా మాట్లాడటం ప్రతి తల్లి హృదయాన్ని కలచి వేస్తుంది. తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి… అసలు మనిషినే కనిపించకుండా చేయడం ఏమిటి? అంటూ ఈ సమాజం రక్షక భటులు అని పిలవబడే వారిని ప్రశ్నిస్తూ ఉంది… నిలదీస్తూ ఉంది…

‘చట్టం ముందు అందరూ సమానమే’ అని రాజ్యాంగం చెబుతుంది. అలాగే రాజ్యాంగంలోని అత్యంత విలువైన ,ముఖ్యమైన హక్కు జీవించే హక్కు (A-21). ఈ హక్కును చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప ఒక వ్యక్తి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. ఏదైనా తప్పు చేస్తే శిక్షించే హక్కు చట్టప్రకారం న్యాయస్థానాలకు మాత్రమే ఉంటుంది. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఇక చట్టాలు… రాజ్యాంగం, న్యాయస్థానాలు ఎందుకు? ఇటీవల తండ్రి, కొడుకులను చిత్రహింసలకు గురిచేసి లాకప్‌‌డెత్‌ ‌చేసిన తొమ్మిదిమంది పోలీసులకు తమిళనాడులోని మధురై జిల్లా కోర్టు మరణశిక్ష విధించటం అభినందనీయం. ఇలా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన అధిక శాతం మంది నిందితులైన పోలీసులకు శిక్షలు పడిన దాఖలాలు చాలా అరుదు. జాతీయ నేర నివేదిక గత పది సంవత్సరాల కాలంలో 2,253 లాకప్ డెత్ లు జరిగాయని తెలిపింది. సగటున ఏడాదికి 92 లాక్ అప్ డేత్ మరణాలు సంభవిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో 2020 నుంచి 2022 మధ్యకాలంలో సుమారు 146 మరణాలు జరిగినట్లు నివేదిక తెలిపింది ఇక్కడ విశేషమేమంటే చట్టాన్ని సంరక్షించాల్సిన వ్యవస్థలే ‘కంచె చేనుమేసినట్లు’ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, మానవ హక్కులను హరిస్తున్నాయి. చారిత్రకంగా రాజ్య వ్యవస్థ అనే దానికి వచ్చిన ఒక నాగరీకత విలువే జీవించే హక్కు. ఈ హక్కును ప్రతి పౌరుడికి గ్యారెంటీ ఇవ్వకపోతే రాజ్యాంగపు విలువలు, స్ఫూర్తి ఏమి కావాలి? ఈ మానవ హక్కుల హననం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అధికారం ఈ దేశంలో ఎవరికి లేదు. చివరకు రాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు కూడా.వారు కూడా రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. మరి ఘనత వహించిన ఈ దేశంలో అత్యున్నత ఉద్యోగంగా చెప్పుకునే ఐపిఎస్ అధికారులకు ఈ సంగతి తెలియదా? వీరు ప్రజలకు జవాబుదారులు కాదా? ఇలా ఈ దేశ పౌరులను ఎన్‌‌కౌంటర్ పేరిట చంపుకుంటూ పోతే దేశంలో అరాచకం ప్రబలదా? అందుకే నేడు రాజ్యం, సంక్షేమం, విలువలు ,మానవ హక్కుల మీద చర్చ జరగాలి. విలువలతో కూడిన ఒక మానవీయ సమాజం ఏర్పడాలి. ఈ బాధ్యత నేటి యువతరం మీద ఉంది. యువతరం మతం మత్తులో కొట్టుకొని పోకుండా, ప్రజల మౌలిక సమస్యల మీద దృష్టి పెట్టి పనిచేయాలి. ఈ దేశంలో ఒక ఉన్నత మైన సమసమాజ నిర్మాణం జరగాలి. అప్పుడే ఈ దేశ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లభిస్తాయి.
షేక్‌. క‌రిముల్లా, 9705450705

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -