Thursday, June 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యుత్ సంస్కరణలు అప్పుడు-ఇప్పుడు

విద్యుత్ సంస్కరణలు అప్పుడు-ఇప్పుడు

- Advertisement -

“మాంసాహారం ఆరగించే పువ్వు ఈ సమాజం” అని పారిస్‌లోని సోర్బోన్ విశ్వ విద్యాలయ గోడల మీద రాసున్న ఈ నినాదం మన దేశ విద్యుత్ రంగాన్ని చూస్తే అర్థమైనంతగా మరెక్కడా అర్థంకాదు. ‘కోతలు’ లేని కరెంటు, అందుబాటులో టారిఫ్‌లు ఇవే కదా జనం కోరుకునేది. సరిగ్గా దీన్నే వివిధ పాలమ వర్గాల నేతలు ‘సద్వినియోగం’ చేసుకున్నారు. పాలకుల మాటలూ అర్థంకావు, చేతలు అసలే అర్థంకావు. రెండవది విద్యుత్‌ రంగంలో అనేక సాంకేతిక అంశాలుండటంతో సామాన్యులు గందరగోళానికి గురౌతున్నారు. అడుగడు గునా పెట్టుబడి దారులకు ‘కంచిగరుడసేవ’ నడుస్తూంటుంది.
దీనికి అన్నం అంతా పట్టుకు చూడక్కర్లేదు. ఒక్క మెతుకు చూద్దాం. అది మరెక్కడో కాదు, పడమటనున్న పుణ్య భూమిలోనైతే అందరికీ ‘విశ్వాసం’ ఉండచ్చు. నేటి భారత ప్రధాని ముఖ్యమంత్రిత్వం వెలగబెట్తున్న రోజుల్లో సోలార్ విద్యుత్‌కు సంబంధించి 42 విడివిడి కంపెనీలతో పీపీఏలు సదరు గుజరాతీ సర్కారు కుదుర్చుకుంది. వాటిలో అసలు బాంధవుడు ఇపుడు దేశమంతా తెల్సిందే కదా! కీలక విషయం ఇవన్నీ కాదు, ఈ పీపీఏలన్నీ యూనిట్‌కు రూ.15 ఉండగా అదే సమయంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ ఆధ్వర్యంలో నడిచే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీపీఎస్‌యు)తో మాత్రం యూనిట్‌కు రూ.4.50కి ఒప్పందం చేసుకున్నారు. గిట్టని వారెవరో మోడీ మీద వేసిన అపవాదు కాదు ఇది. అసెంబ్లీలో నాటి ఇంధన శాఖా మంత్రి సౌరభ్ పటేల్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన జవాబును ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్` (28.11.2019) ప్రచురించింది.

ఛీ.. ఛీ.. మోడీ అవినీతి పరుడుకాదు. ఆయనకేమైనా పెళ్లామా? పిల్లలా? ఈ సంపాదనంతా ఎక్కడ పెట్టుకుంటాడు? నాగపూర్ ‘దేవాలయం’లో పాతరేస్తాడన్న వారి కండ్లు పేలిపోవా?!
మీ కిబ్లా వాషింగ్టనే!
పూర్వ భారతీయ దౌత్యవేత్తతో ఇరాన్ దౌత్యవేత్త అన్నమాటది! నమాజ్ చేసేవారు కాబా ఎటువైపుందో అటువైపు తలతిప్పి ప్రార్థన చేసే దిక్కును కిబ్లా అంటారు. బ్రెట్టన్‌వుడ్ కవలలుగా పేరుపొందిన అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రపంచ బ్యాంకులు రెండూ వాషింగ్టన్‌లోనే ఉన్నాయి. ఇరాన్ దౌత్యవేత్త దెప్పి పొడిచింది కూడా అందుకే! అబ్బా! ఈ మూడు ముక్కల వాక్యంలో ఇంత అర్థముందా అని కొందరికి ఆశ్చర్యమేయొచ్చు.
నేటి మధ్య ఆసియా యుద్ధంలో భారతదేశ రాజనీతి చూస్తే అర్థమయ్యేది అదే. ఇజ్రాయిల్‌తో సహా, అమెరికా సైనిక స్థావరాలున్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, బహ్రెయిన్‌లన్నింటిలో అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు మోడీ సాబ్. వాటన్నింటినీ నేడు ఇరాన్ చెరిపేస్తోంది. అటు ఇరాన్‌తో ఘర్షణ పడకుండా ఓడలు రప్పించుకుంది. ఇక ఆ బాధ కూడా లేకుండా అమెరికా నుండే కొనుగోలుకు ప్రయత్నిస్తోంది. స్వామికార్యం! స్వకార్యం!

ఉమ్మడి రాష్ట్ర కాలం నుండి సీపీఐ(ఎం) చేసిన క్యాంపెయిన్ పుణ్యమా అని ప్రపంచ బ్యాంకు అంటే చంద్రబాబు అని గుర్తుకొస్తున్నాడు. బషీర్‌బాగ్ కాల్పులు జ్ఞాపకమొస్తాయి. కీలకమైనవి మన మనసు కాగితాలపై నుండి చెరిగిపోయినాయి. ఏపీఎస్‌ఈబీని ముక్కలు చేసే తరుణంలో బాబుగారి ప్రవచనాలకు మన మనసులపై శిలాక్షరాలై నిలిచిపోవాలి. అన్ని రాష్ట్రాల్లో అన్ని బూర్జువా పార్టీల నాయకులందరూ చెప్పిన డైలాగులొక్కటే. నిట్టనిలువుగా జనరేషన్ ట్రాన్సిమిషన్, పంపిణీలు కలిసి ఉండటం వల్లే బోర్డులు నాశనం అయినాయనీ, వీటిని ముక్కలు చేసి (అన్‌బండిల్) ఎన్నో విద్యుదుత్పత్తి కంపెనీలు (బోలెడు ప్రయివేటు వాటితో కలిపి) ఎన్నో ప్రయివేటు పంపిణీ కంపెనీ లుంటే వినిమయదారులకు చౌకలో విద్యుత్ అందుబాటులోకి వస్తుందనీ, ఎందుకంటే వారి మధ్య ‘పోటీ’ వల్లనే ఇది సాధ్యమని చెప్పారు. ఇక్కడ ఈ రెండు మాటలూ గుర్తుంచుకోవాలి. ఒకటి ప్రయివేటు, రెండు ‘పోటీ’! కొందరు అతి తెలివిపరులు సెల్‌ఫోన్ రేట్లు ఎలా తగ్గిపోయాయో చూడండని కూడా చెప్పారు.
ఒరిస్సా విద్యుత్ బోర్డు (ఓఎ‌స్‌ఈబీ), ఏపీఎస్‌ఈబీలు ‘పరమపదించి’ (1997-98) నలభయ్యేండ్లు. బీజూ పట్నాయక్ చెప్పింది నాకు తెలీదుగాని బాబుగారు చెప్పింది బాగా గుర్తుంది. విద్యుత్ ఉద్యోగులు బద్ధకస్తులు, వసూళ్లు చేయక బకాయిలు పేరుకుపోయాయి. ఇతర వాటితో పాటు ఉద్యోగుల అవినీతి కూడా నాటి ఏపీఎస్‌ఈబీలో మేట వేసిందని కదా బాబుగారు ప్రవచిం చింది. కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులకూ ఇలాంటి అభిప్రాయమే ఉండటం మన ప్రారబ్దం.

ఈ ప్రశ్నకు బదులేదీ?
అయితే ఒక విషయం ఇటు ఈ ‘సంస్కర్తలూ’ అటు వంతపాటగాళ్లూ చెప్పగలరా?! 1992-93లో దేశంలోని అన్ని విద్యుత్ బోర్డుల నష్టాలు కలిపి రూ.2325 కోట్లుండగా, తర్వాతి పదేండ్లలో 2002లో అన్ని డిస్కాంల నష్టాలు 9 రెట్లు పెరిగి రూ.24,837 కోట్లు,, 2016-17 నాటికి 140 రెట్లు పెరిగి రూ.3.8 లక్షల కోట్లకూ, 2025-26 నాటికి రూ.6.47 లక్షల కోట్లకూ చేరాయి. అన్ని డిస్కాంల అప్పులూ కలిపి రూ.7.26 లక్షల కోట్లకు చేరాయి. అప్పులూ పెరిగాయి. నష్టాలూ పెరిగాయి. దీనికి కారణాలు చెప్పిండి పాలకులారా! మీకు తెలీయదు. తెల్సినా నోరు పెగలదు. విపరీతంగా పెరిగిన దిగుమతి చేసుకున్న యంత్రాల ధరలు (ఆనాటి సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, రాసిన స్టాప్ ది బీహెచ్‌ఇఎల్స్ డేంజరస్ ట్రక్ విత్ సీమెన్స్ చదవండి ధైర్యముంటే). ఇన్సూరెన్స్ ప్రీమియమ్‌లు, ఎన్రాన్ కేసులో ఓమన్, కతార్‌ల నుండి దిగుమతి చేసుకున్న ఎల్ఎన్‌జీ ధరలు కీలకం. చివరికి క్రిష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ ముఖేష్ అంబానీ ఉత్పత్తి చేసిన గ్యాసుకు కూడా అంతర్జాతీయ ధరలతో సమానంగా ధర కట్టివ్వాలని మొండికేసి సాధించుకోవడం (ఎంఎంబిటియు) మిలియన్ మెట్రిక్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ (గ్యాస్ వేడిని కొలిచే యూనిట్) ధర డాలర్లలో చెల్లించడానికి నాటి కాంగ్రెస్ సర్కార్ అంగీకరించింది. అప్పటిదాకా గ్యాస్ ఉత్పత్తి చేసే ఆ బావిని పడావు పెడ్తే ఆ సర్కార్ నోరిప్పితే ఒట్టు. పక్కనున్న ఓఎన్‌జీసీ బావి నుండి గ్యాస్ తోడుకున్నారని వార్తలొచ్చాయి. దానిపై అటు అంబానీ గానీ, ఇటు భారత ప్రభుత్వంగాని నోరిప్పలేదు. అసలక్కడ గ్యాసుందని పరిశోధన చేసిందే ఓఎన్‌జీసీ. ఆ లాభమంతా ముఖేష్ అంబానీ గుటకాయ స్వాహా. విద్యుత్ ధరలు పెరగడానికి కీలక కారణాలివి.

7,8,9 పంచవర్ష ప్రణాళికల్లో విద్యుత్ రంగ కేటాయింపులు ఇరవై శాతానికి తగ్గించారు. అంతకు ముందు ప్రతి ప్రణాళికలోనూ నలభై శాతం కేటాయించేవారు. అయినా బీహెచ్‌ఇఎల్ అనేక అంతర్జాతీయ పోటీ బిడ్డింగుల్లో పాల్గొని ప్రాజెక్టులు దక్కించుకుంది. మన దేశ కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్‌ఇఎల్ గొంతు ఆ విధంగా నులిమేశారు. కండక్టర్లు (మన భాషలో కరెంటు తీగలు)లో నుండి కొంత శాతం విద్యుత్ బయటికి పోతూంటుంది. అలా నష్టం జరగని ‘సూపర్ కండక్టర్ల’ని బీహెచ్‌ఇఎల్ (ఆరఅండ్‌డి) శాస్త్రవేత్తలు రూపొందించారు. సరైన నిధులుంటే మరింత అభి‌వృద్ధి చేసుండేవారు. ఒక యూనిట్‌ని భద్రపరచుకోవడమంటే ఒక యూనిట్‌ను సృష్టించుకోవడం (వన్‌య యూనిట్ సేవ్డ్ ఈజ్ వన్ యూనిట్ ప్రొడ్యూస్డ్) అనే సూత్రం విద్యుత్ రంగం గురించి పరిచయమున్న వారందరికీ తె‌లిసిందే!
పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టమన్నాట్ట ఎవరో! ఈ దశలో వాజ్‌పాయ్ సర్కార్ విద్యుత్ చట్టం 2003 తెచ్చింది. దీంతో అంతకుముందున్న విద్యుత్ చట్టాలన్నీ రద్దయిపోయాయి. అంతకుముందు పంచవర్ష ప్రణాళికల్లో దేశానికి ఎంత విద్యుత్ అవసరం ఉంది, రాష్ట్రాలెంత తయారుచేయాలి? కేంద్రం (ఎన్‌టిపిసి, ఎన్‌హెచ్‌పిసి) ఎంత తయారు చేయాలి? అని ప్లాన్ చేసేవారు. దానికి సెంట్రల్ ఎలక్ర్టిసిటీ అథారిటీ (సీఈఎ) ఉండేది. పేరుకి ఇపుడూ ఉంది. కాని విద్యుదుత్పత్తి అంతా డీలైసెన్స్ చేశారు. జనరేషన్ స్టేషన్ పెట్టదల్చుకున్నవాడు ఆ మున్సిపాలిటీకో, గ్రామ పంచాయ తీకో ఒక మాట చెప్పి ప్లాంటు ప్రారంభించు కోవచ్చు.
‘కోల్‌గేట్‌’ కుంభకోణమని మన్మోహన్ సింగ్‌పై బీజేపీ నానాయాగీ చేసినవారు ఇక్కడ ఉన్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2012లో గుర్తించింది. అదానీవి నాలుగు ప్రాజెక్టులు బకాయిలు రూ. 24,100కోట్లు, లాంకో 5 ప్రాజెక్టులు రూ.21,100 కోట్లు బకాయి, రిలయన్స్ ఏడీఎజీ 3 ప్రాజెక్టులు రూ.32,600 కోట్లు బాకాయి, ఈ లిస్టు చాంతాడంత ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకుల మెడలొంచి అప్పులిప్పిస్తున్నారు. 2015 నాటికే ప్రభుత్వ బెయిల్ ఔట్ తప్పనిసరి పరిస్థితిలో ఇవున్నాయి. 2013-15 మధ్య కేంద్ర సర్కార్ బెయిల్ ఔట్ చేసిన రూ.1.14 లక్షల కోట్లు, 2016లో బెయిల్ ఔట్ చేసిన రూ.60 వేల కోట్లలో అత్యధికం విద్యుత్ ప్రాజెక్టులే.
2003 విద్యుత్ చట్టం వచ్చిందే పంపిణీ ప్రయివేటీ కరణకు. దీనిలో కీలకమైంది ఓపెన్ యాక్సెస్ విధానం. విద్యుత్ ఉత్పత్తి చేసిన వాడికి మధ్యలో ట్రాన్స్‌కో, డిస్కాంలతో సంబంధం లేకుండా నేరుగా వినియోగ దారు(ల)ను ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది. ప్రస్తుతం వివిధ రకాల వినిమయ దారుల నుండి వివిధ ఛార్జీలు వసూలు చేస్తుంది డిస్కాం. దాన్నే క్రాస్ సబ్సిడీ విధానం అంటారు. భారీ పరిశ్రమలో, పెద్ద వాణిజ్య సముదాయాల్లో గ్రిడ్‌లో నుండి బయటికి పోతే డిస్కాంకు మిగిలేది గృహ, వ్యవసాయ వినియోగదారులే. వారి నుండి అధిక రేటు వసూలు చేయాలి, లేదా డిస్కాం దివాళా ఎత్తాలి. ఇందులో ఏది జరిగిన నష్టమే.
ఇది కూడా కార్పొరేట్లకు సం‌తృప్తినియ్యలేదు. 2025 సవరణ బిల్లు తెచ్చింది మోడీ సర్కార్. నెట్‌వర్క్, సబ్ స్టేషన్లు, అన్నీ ప్రభుత్వానివే ఉంటాయి. దీన్ని ‘కారియర్‌’ అంటారు. అందులో ప్రవహించే కరెంటు మాత్రం (కంటెంట్) అదానీదో, అంబానీదో ఉంటుంది. ఇపుడు మనకు కరెంటుపోతే సబ్ స్టేషన్‌కో, ఎఫ్‌ఓసీకో ఫోన్ చేస్తాం. అపుడు ఎవరికి చేయాలి? వినియోగదారుల బాధలు వర్ణనాతీతం.
పెట్టుబడిదారుల లాభాలకై విద్యుత్‌రంగ ప్రయివేటీకరణ
దీని కోసం బీహె‌చ్‌ఈఎల్ హత్య, ఎస్‌ఇబీల మారణహోమం
ఈ విధ్వంసం ప్రారంభించింది కాంగ్రెస్ సంపూర్తికానిస్తున్నది బీజేపీ
ముందు ఉత్పత్తి నాశనం, ఇపుడు పంపిణీ కార్పొరేట్లకు సమర్పయామీ!
బలిపశువు వినిమయదారే!
ఆర్‌.సుధాభాస్కర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -