Thursday, June 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపున:‘‘పరీక్ష‍’’

పున:‘‘పరీక్ష‍’’

- Advertisement -

ఈ నెల 21న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌‌ పున: పరీక్ష‍ ద్వారా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌‌టిఎ) తమ వైఫల్యాన్ని విద్యార్థుల భుజాలపై మోపింది. తప్పుకు బాధ్యత వహించాల్సిన వారు నిస్సిగ్గుగా అధికారంలో కొనసాగుతున్నా, శిక్ష అనుభవించింది మాత్రం విద్యార్థి లోకం. నెలల తరబడి కష్టపడి చదివిన లక్షలాది మంది అభ్యర్థులు మరోసారి అదే ఒత్తిడి, అదే ఆందోళన, అదే అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రవేశం లేదన్న కఠిన నిబంధనతో కొందరు గేట్ల ముందే ఆగిపోయారు. తల్లిదండ్రులు అధికారుల కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. విద్యార్థుల కన్నీళ్లకు ఏ హృదయమూ చలించలేదు. ఈ దృశ్యాల వెనుక ప్రశ్న ఒక్కటే. ప్రశ్నాపత్రం లీక్‌‌ను అడ్డుకోలేక పరీక్ష‍ను రద్దుచేసిన పాలనావ్యవస్థ వైఫల్యానికి మూల్యం విద్యార్థులు ఎందుకు చెల్లించాలి?

మే3న పరీక్ష రద్దు నిర్ణయం వెలువడిన క్షణం నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఒకసారి పరీక్ష పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో మళ్లీ పరీక్ష రాయాలని చెప్పడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బత ీసింది. వేలాది కుటుంబాలు అదనపు ఖర్చులు భరించాల్సి వచ్చింది. పరీక్షా కేంద్రాలు స్వస్థలాలకు దూరంగా ఉండటంతో ప్రయాణ వ్యయాలు, వసతి ఖర్చులు, ఉద్యోగాలకు సెలవులు, తల్లిదండ్రుల ఆర్థిక భారం అన్నీ కలిసి పునఃపరీక్షను ఒక సామాజిక సమస్యగా మార్చాయి. సుమారు పదిహేడు వందల మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ సంఖ్య వెనుక ఉన్న కారణాల్ని ఎవరూ చర్చించడం లేదు. వారు ఎందుకు రాలేకపోయారు? ఆర్థిక ఇబ్బందులా? మానసిక ఒత్తిడా? నిరాశా? లేక వ్యవస్థపై నమ్మకం కోల్పోవడమా? ఈ ప్రశ్నలకు ఎన్‌‌టిఎ వద్ద గానీ, కేంద్రం వద్దగానీ సమాధానం లేదు. కానీ, గైర్హాజరు విషయం మాత్రం ఈ ప్రక్రియపై విద్యార్థుల్లో ఏర్పడిన అసంతృప్తికి సంకేతంగా కనిపిస్తోంది.
ఇక పరీక్ష రోజు అమలైన ‘ఒక నిమిషం నిబంధన’ మరింత వివాదాస్పదమైంది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం లేదని ప్రకటించి, రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా కేంద్రాల వద్ద నిలిపివేశారు. ట్రాఫిక్, వర్షం, ప్రయాణ సమస్యలు, కేంద్రాల గుర్తింపులో ఇబ్బందులు వంటి కారణాలతో ఆలస్యమైన అభ్యర్థుల పట్ల కనీస మానవీయ దృక్పథం కూడా కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో తల్లిదం డ్రులు అధికారు లను వేడుకోవడం, పోలీసుల కాళ్లపై పడటం, విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకోవడం దేశం మొత్తం చూసింది. మరికొన్ని చోట్ల బయోమెట్రిక్‌ సమస్యలతో కూడా విద్యార్థులను అనుమతించనట్లు వార్తలొచ్చా యి. పేపర్ లీక్‌ను అడ్డుకోలేని వ్యవస్థ, లక్షల మందిని మళ్లీ పరీక్ష రాయించే వ్యవస్థ, రెండు నిమిషాలు ఆలస్యమైన విద్యార్థిపై మాత్రం కఠిన నిబంధనలను అమలు చేయడం ఎంతవరకు న్యాయం?

ఈ గందరగోళం కేవలం పరీక్షా నిర్వహణ వైఫల్యం మాత్రమే కాదు, ఇది విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిన సంక్షోభం. పరీక్ష రద్దు, అనిశ్చితి, పునఃపరీక్ష ఒత్తిడి నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు కనీసం డజనుకు పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఆత్మహత్య వెనుక ఒక కుటుంబం కూలి పోయింది. ఒక యువ జీవితం ముగిసింది. ఈ మరణాలను కేవలం వ్యక్తిగత నిర్ణయాలుగా కొట్టిపారేయలేం. విద్యావ్యవస్థ సృష్టించిన ఒత్తిడి, అస్థిరత, అనిశ్చితి కూడా ఇందుకు కారణమన్న ప్రశ్నను సమాజం ముందుం చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అసలు బాధ్యత ఎవరిది? దేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షను పారదర్శ కంగా, భద్రంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్‌‌టిఎది. ఆ సంస్థ పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత కేంద్ర విద్యాశాఖది. ప్రశ్నాపత్రం లీక్ కావడం, పరీక్ష రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం, లక్షలాది మంది విద్యార్థులను మళ్లీ పరీక్ష రాయించాల్సి రావడం సాధారణ పరిపాలనా లోపం కాదు. ఇది ఒక భారీ వ్యవస్థాగత వైఫల్యం. అయినప్పటికీ ఇప్పటివరకు రాజకీయ బాధ్యత ఎవరూ స్వీకరించలేదు.
ప్రజాస్వామ్యంలో బాధ్యత అనే సూత్రం కేవలం కింది స్థాయి అధికారులకు మాత్రమే వర్తించదు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఇంత పెద్ద సంక్షోభం ఏర్పడిన ప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి. ప్రశ్నాపత్రం లీక్ అయినా, పరీక్ష రద్దయినా, లక్షలాది మంది విద్యార్థులు మానసికంగా నలిగి పోయినా, పలువురు ప్రాణాలు కోల్పోయినా ఎవరూ బాధ్యత వహించకపోతే బాధ్యతాయుత పాలనకు అర్థమే ముంది? పరి పాలనా వైఫల్యాలకు రాజకీయ జవాబుదారీతనం లేకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం కావనీ గ్యారంటీ ఏముంది?

నీట్ వివాదం ఒక పరీక్ష గురించి మాత్రమే కాదు. ఇది భారత విద్యా వ్యవస్థ విద్యార్థులను ఎలా చూస్తోందన్న ప్రశ్న. లక్షలాది మంది యువత ఆశయాలు, కలలు, భవిష్యత్తు ఒక నిర్లక్ష్యమైన వ్యవస్థ చేతుల్లో పడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఈ ఘటన చూపించింది. విద్యార్థి కేంద్రంగా ఉండాల్సిన వ్యవస్థలో విద్యార్థే బలి కావడం అత్యంత విషాదకరం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్‌‌టిఎ తమ వైఫల్యాలను అంగీకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే పారదర్శకత, జవాబుదారీతనం, మానవీయ దృక్పథం తప్పనిసరి. లేకపోతే నీట్ వివాదం ఒక పరీక్షా కుంభకోణంగా మాత్రమే కాకుండా, విద్యార్థుల జీవితాలపై జరిగిన ఒక సామూహిక అన్యాయంగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -