Sunday, February 22, 2026
E-PAPER
Homeసోపతిప్రియ రాజ్‌ వంశ్‌ ప్రేమ ఒక జీవితం - పగ ఒక మరణం

ప్రియ రాజ్‌ వంశ్‌ ప్రేమ ఒక జీవితం – పగ ఒక మరణం

- Advertisement -

”ఆజ్‌ సోచాతో ఆంసూ భరాయే రహె గయీ జిందగీ దర్ద్‌ బన్‌ కే, దర్ద్‌ దిల్‌ మే చుపాయే చుపాయే” స్తే జఖ్మ్‌ (1973)
లండన్‌ నగరం. 2000 సంవత్సరం మార్చి 3, అర్ధరాత్రి. గాఢ నిద్రలో ఉన్న కన్వల్‌ సుందర్‌ అలియాస్‌ గుల్లు సింగ్‌కి పీడకల పడింది. ఇండియాలోని బొంబాయి నగరంలో ఉన్న తన సోదరి, నటి వెరా సుందర్‌ సింగ్‌ దారుణంగా ఊపిరాడక బాత్రూంలో నిర్జీవంగా పడి ఉన్న దశ్యాలు ఆ కలలో కనిపించినవి. లేచి దిగ్గున కూర్చున్నాడు. నిజానికి ఆయన చాలా రోజులుగా తన సోదరి పట్ల ఆందోళనగానే ఉన్నాడు. ఇండియాలో ఆమె చుట్టూ కొంత ప్రమాదకరమైన వాతావరణం ఉండటం వల్ల లండన్‌ వచ్చేయమని అతను చెబుతూనే ఉన్నాడు. ఆమె కూడా వస్తానంటూ చెబుతూ వాయిదా వేస్తూ వచ్చింది.
విషాదం ఏమిటంటే మూడు వారాల తర్వాత 2000 మార్చి 27న, ఆమె అదే బాత్రూంలో చంపబడింది. ఆమె మతదేహాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు అతనికి లండన్‌ వెళ్లడానికి ఆమె రిజర్వేషన్‌ చేసుకున్న విమాన టిక్కెట్లు దొరికాయి. ఆమె చివరకు బొంబాయిని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నది. కానీ తమ ఆస్తి పంపకాలకు అడ్డు వస్తుందని నలుగురు కలిసి ఆమెను ఈ లోకం నుండే పంపించారు. బాలీవుడ్‌ లో నూతన సహస్రాబ్దిలో సంచలనం రేపిన హత్యోద్యంతమిది.
ఒక అందమైన గ్రీకు విషాదంగా వర్ణించదగిన వేరా సుందర్‌ సింగ్‌ ఎవరో కాదు హిందీ ప్రేక్షకులకు బాగా తెలిసిన, 1960,70లలో బాలీవుడ్‌ హీరోయిన్‌గా వాసిలో ఎంచదగిన చిత్రాల్లో నటించిన ‘ప్రియ రాజ్‌ వంశ్‌’.. ఆమె భారతీయ తెరపై గ్రేటా గార్బో కంటే అందమైన నటి.



ఎవరీ ‘ప్రియ రాజ్‌ వంశ్‌’?
ప్రియా రాజ్‌వంశ్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌గా కన్నా, చేతన్‌ ఆనంద్‌ ఎంచుకున్న ఊహ సుందరిగా హిందీ సినిమాల్లోకి ప్రవేశించింది. ప్రియా రాజ్‌వంశ్‌లో సినిమా రంగంలో అందరూ భావించే సాంప్రదాయకమైన ఆకర్షణీయంగా లేదు. ఆమెది అరుదైన అందం. ఆలోచనాత్మకంగా కనిపించే మెరుపు కళ్ళు, కెమెరా దగ్గరగా వంగి చూసే నిశ్చలతల హకీఖత్‌, హీర్‌ రాంఝా, హస్తే జఖ్మ్‌ , ఖుద్రత్‌ వంటి చిత్రాలలో ఆమె విషాదాన్ని ఎంత చిక్కదనంతో ప్రదర్శించిందో హిందీ సినిమా ప్రేక్షకులకు ఇంకా గుర్తుంది. సిమ్లాలో వేరా సుందర్‌ సింగ్‌ అన్న అసలు పేరుతో ప్రియరాజ్‌ వంశ్‌ 1936హొడిసెంబరు 30న జన్మించింది. ఆమె తండ్రి సుందర్‌ సింగ్‌ అటవీ శాఖలో కన్జర్వేటర్‌. ఆమె ఆక్లాండ్‌ హౌస్‌, సిమ్లాలోని కాన్వెంట్‌ ఆఫ్‌ జీసస్‌ అండ్‌ మేరీలో, 1953 లో సిమ్లాలోని సెయింట్‌ బెడెస్‌ కళాశాల నుండి ఇంటర్‌ పూర్తి చేసింది. భార్గవ మునిసిపల్‌ కాలేజ్‌లో చేరింది. తండ్రి ఐక్యరాజ్యసమితి నియామకంలో ఉండటంతో గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఆమె లండన్లోని రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రామాటిక్‌ ఆర్ట్‌ (రాడా) లో చేరింది.

”మొదటి సంవత్సరం అమాయక విద్యార్థినిగా కనిపించిన ఆమె ఆ తర్వాత కళారంగంలో ఒక్కసారిగా ప్రతిభ గల ఆర్టిస్టుగా వెలుగులోకి వచ్చింది. అప్పటి కాలేజీ యువతరమంతా కూడా ప్రతిరోజూ ఆమె చర్చలే. ఆమె ఉపన్యాసాలు, నాటకాలలో అనేక బహుమతులు గెలుచుకుంటున్నట్లు వార్తలు అక్కడ సర్వసాధారణమైనవి. ఆమె తన ‘కొద్దిమంది ఎంపిక చేసిన’ సహ కళాకారులు, విద్యార్థులతో కలిసి షిమ్లాలోని ప్రసిద్ధ గెయిటీ థియేటర్‌లో నాటకాలు వేసింది. ఆమె అందరితోనూ స్వేచ్ఛగా, నిస్సంకోచంగా ఉండేది. దాంతో ఆమె చదువుకునే కళాశాలలో సహ విద్యార్థులే గాక జూనియర్‌, సీనియర్‌ విద్యార్థులు కూడా యువతరంగపు ఉత్సాహంతో వారి నడుమ జరిగే చర్చలకు కేంద్ర బిందువు అయ్యేది. ఆమెను అందం, వ్యక్తిత్వం, ప్రతిభ అన్నీ కలబోసిన ఒక విభిన్న సౌందర్య రాశిగా అభివర్ణించేవారు. ఒక రకంగా అవి ఆమె ప్రజాదరణకు పరాకాష్ట రోజులు. ఒక రోజు ఆమె కూడా చేతన్‌ ఆనంద్‌ కనుగొన్న కల్పనా కార్తీక్‌, షీలా రమ్మానిల్లాగా, బొంబాయి సినిమాల్లోకి వస్తుందని అందరూ భావించారు. ఆ తర్వాత అదే నిజమైంది. ఆమెను ఎందరో యువకులు ఆరాధించడం మొదలుపెట్టి కవిత్వం రాయడం ప్రారంభించి, పుస్తకాలు వేసి ‘వేరా’కు అంకితం చేశారు. ఆ రోజుల్లో షిమ్లాలోని సాహిత్యవేత్తలు, ప్రముఖులందరికీ ఆరాధ్యురాలు మాత్రమే కాదు, కాఫీ-హౌస్‌ కబుర్లలో ఆమె ఒక హాట్‌ టాపిక్‌.

హిందీ సినిమాల్లో ఆమె ప్రస్థానం ఆసక్తికరమైంది. ”ఆమె లండన్‌లోని రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రామాటిక్‌ ఆర్ట్స్‌లో చదువుతున్నప్పుడు, ఎవరో సబ్‌వేలో ఆమె ఫొటో తీశారు. ఆ చిత్రం బొంబాయికి చేరింది. అక్కడ చేతన్‌ కంట పడింది. అంతే, అతను హీరోయిన్‌గా ఎంపిక చేసుకుని ‘ప్రియ రాజ్‌ వంశ్‌’ అనే తెర పేరు పెట్టాడు. ఆ తర్వాత రాబోయే చేతన్‌ ఆనంద్‌ సినిమాలకు ఆస్థాన కథానాయికగా మారింది. ప్రియ రాజవంశ్‌ పేరు ‘న’ అక్షరంతో ముగిసింది. చేతన్‌ తన సినిమాలను ‘న’ అక్షరంతోనే ప్రారంభించాడు. వాటిలో మొదటిది ‘హకీకత్‌'(1964) ఇప్పటివరకు వచ్చిన ఉత్తమ యుద్ధ చిత్రం. ఈ సినిమాలో ప్రియ నటన అద్భుతంగా ఉంటుంది. కానీ హిందీలో ఆమె డైలాగ్‌ డెలివరీ నిరాశపరిచింది. బెర్నార్డ్‌ షా రాసిన ఆంగ్ల నాటకాలను చదివి పెరిగిన ప్రియ తన మొదటి చిత్రంలోనే హిందీ-ఉర్దూ సంభాషణలలోని సూక్ష్మ భావాలను గ్రహించలేకపోయింది. షిమ్లా వేదికపై ఆంగ్ల భాషలోని సంపూర్ణ అవగాహనతో ఆమె నటించడం చూసిన సిమ్లా వాసులు ఆమె సంభాషణల ఉచ్చారణను చూసి ఆశ్చర్యపోయారు. ఆమె తదుపరి సినిమా విడుదల కోసం ఎదురుచూడటం ప్రారంభించారు. మన స్మితాపాటిల్‌, షబానా, నసీరుద్దీన్‌ షా, ఓం పూరీల కంటే చాలా ముందుగానే ప్రియ అలవోకగా స్టానిస్లావ్‌స్కీ నటనా శైలిని అనుసరించింది.

సిమ్లా కళాశాలలో జూనియర్‌ విద్యార్థిగా ఉన్న ఆర్‌.పి. చద్దా ఆమెకు నివాళిగా రాసిన వ్యాసంలో ”హకీకత్‌ సినిమాను చండీగఢ్‌ శివార్లలో చిత్రీకరించనున్నారని మాకు తెలిసింది. షిమ్లాకు చెందిన మా పాత స్నేహితులలో కొందరం ఆ ప్రదేశాన్ని సందర్శించాము. మరో షాట్‌ కోసం సిద్ధమవుతున్నందున షూటింగ్‌లో కాసేపు విరామంలో మేము ప్రియ ఒక దిబ్బపై కూర్చుని ఉండటం చూశాము. అకస్మాత్తుగా మాకు 50వ దశకానికి చెందిన మా సీనియర్‌ క్లాస్‌మేట్‌ను ఎందుకు కలవకూడదని అనిపించింది. మేము ఆ యూనిట్‌ సభ్యుడి సహకారంతో ఆమెను కలుసుకున్నాము. ఆమె సమక్షంలో ”మేము మీరు షిమ్లాలో చదువుకున్న అదే సంస్థకు చెందినవారము. మిమ్మల్ని ఒక సినీ నటిగా చూడటం మాకు సంతోషంగా ఉంది” అని ఏదో గొణుగుతూ చెప్పాము. ఇది విన్న ఆమె సముద్రం నీలి కళ్ళు ప్రకాశవంతంగా మెరిశాయి. ఆమె చిరునవ్వులతో ”ధన్యవాదాలు, నేను మీకు గుర్తు ఉన్నానని తెలిసి నాకు సంతోషంగా ఉంది” అంది ఆనందంతో.”
తర్వాత మరో సినిమా కూడా వచ్చింది.అది కూడా కవితాత్మక కావ్యం. ఆమె అప్పటి సంచలన హీరో ‘జానీ’ రాజ్‌ కుమార్‌తో జతగా.ఆ సినిమా ‘హీర్‌ రాంఝా”(1970).

హీర్‌-రాంఝా ఒక కాలాతీత సూఫీ కథ. రెండు ఆత్మల దైవిక ప్రేమ ఎలా ఐక్యమవుతుందో అద్భుతంగా చూపించిన సినిమా. వారి ఎడబాటు ఆధ్యాత్మిక సాక్షాత్కారంతో అంతిమంగా ఒకటవుతుంది. ఈ ఏకత్వం సూఫీ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. ‘హీర్‌ రంఝా’లో ఆమె సంభాషణలు పలకడంలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. ఆమె ప్రతి ఫ్రేమ్‌లో రాజ్‌ కుమార్‌ నటనకు దీటుగా నిలిచింది. ఈ చిత్రంలో ప్రియ నటన హిమాలయా శంగాన్ని అందుకున్నది.
చేతన్‌ ఆనంద్‌ కొన్ని విజయవంతమైన, కొన్ని పరాజయం పాలైన చిత్రాలను నిర్మించాడు. ‘హిందుస్థాన్‌ కీ కసమ్‌'(1973), ‘హస్తే జఖ్మ్‌'(1973), సాహెబ్‌ బహదూర్‌ (1977). చివరిగా 1985లో ప్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం’హాథోం కీ లఖీరేం’ (1986). ”కుద్రత్‌” (1981) చిత్రంలో హేమా మాలిని ప్రధాన పాత్రలో నటించగా, ప్రియ సమాంతర పాత్రను పోషించింది. 22ఏళ్ళ కెరీర్‌లో ఆమె నటించిన చిత్రాలు ఏడే.

ప్రియ – చేతన్‌ ఆనంద్‌ల మధ్య దర్శకుడు-గురువుల స్నేహం వారి సంబంధానికి ప్రధానాధారంగా మారింది. వారు వివాహమనే అధికారిక బంధం లేకుండా దాదాపు 30 సంవత్సరాలు కలిసి జీవించారు. వారిద్దరి నడుమ ఉన్న పరస్పర ప్రేమానురాగాలు చేతన్‌ ఆనంద్‌ జీవించినంత కాలం చెక్కుచెదరలేదు. ఆమెకు సిమ్లా, లండన్‌ అంటే చాలా ఇష్టం. ప్రయాణం, కవిత్వం, సంగీతం, సాహిత్యం ఆమె అభిరుచులు. సినిమాలు ఆమె జీవితం. ఆమె చేతన్‌ సినిమా నిర్మాణంలోని ప్రతి అంశంలో పాలుపంచుకుంది. అన్నీ తానై చూసుకున్నది ఆమెనే. ఆమె హస్తే జఖ్మ్‌, కుద్రత్‌ స్క్రిప్ట్‌లు కూడా రాసింది.
1997లో తన గురువు-స్నేహితుడు చేతన్‌ ఆనంద్‌ మరణం తర్వాత ఆమె పరిశ్రమ నుండి మరింతగా దూరమైంది. చేతన్‌ మరణం తర్వాత ఆయన మొదటి భార్య సంతానంతో ప్రియకు ఆస్తి పంపకాల వివాదం మొదలైంది. చేతన్‌ బతికి ఉన్నప్పుడే ఆమెకు చెందవలసిన ఆస్తులను ఇచ్చేసాడు. కానీ ఆయన కొడుకులు ఇందుకు అంగీకరించక ప్రియను ఆస్తుల నుండి బేదఖలు చేయాలనుకున్నారు. ఇందులో ఆమె తనపై ఏదైనా అఘాయిత్యం తల పెడతారేమోనన్న అనుమానాన్ని కూడా అంచనా వేసి లండన్‌ వెళ్ళిపోవాలనుకుంది. కానీ అంతకు ముందే 2000 మార్చి 27న రుయా పార్క్‌ బంగ్లాలోని బాత్రూంలో గొంతు నులిమి హత్య చేశారు. ఈ దురాగతానికి పాల్పడిన వారు చేతన్‌ ఆనంద్‌ కుమారులు వివేక్‌, కేతన్‌, పనిమనిషి మాలా, ఆమె బంధువు అశోక్‌. నేరం రుజువై వీరికి ముంబై సెషన్స్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది.

చేతన్‌, బొంబాయి ఆమె జీవితంలో అతిపెద్ద విషాదాలైనవి. చేతన్‌ ఆమెను ఇతర దర్శకులతో పనిచేయలేదు. ఆమె చివరి చిత్రం ‘హిందుస్థాన్‌ కీ కసమ్‌’ తప్ప మిగతా అన్ని సినిమాల్లో ఆమె పాత్ర చనిపోతుంది. ఆమె చేతన్‌ ప్రేమకు పూర్తిగా అంకితమైంది. ఆయన కొడుకుల పగకు బలయింది.
ప్రియా రాజ్‌ వంశ్‌ చప్పట్లను, వెంటాడే ఫిల్మ్‌ సెట్‌లలో మెరిసిపోవాలనుకోలేదు. ఆమె తనదంటూ ఒక ప్రత్యేక జీవనశైలిలో జీవించింది. పొదుపుగా పనిచేసింది. మనుషులను తీవ్రంగా ప్రేమించింది. అదే ఆమె విధేయత. దానికి భారీ మూల్యం చెల్లించింది. ప్రియ రాజ్‌వంశ్‌ హిందీ సినిమా చరిత్రలో అత్యంత నిగూఢమైన నాయికలలో ఒకరిగా మిగిలిపోయింది. ఆమెను ఆ తరం అభిమానులు మరచిపోలేదు. నిజంగా ఆమె ఒక బయల్పడని రహస్యం.
(వ్యాసకర్త సినీ చరిత్ర పరిశోధకులు)

హెచ్‌ రమేష్‌ బాబు, 7780736386

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -