ఏడాదిలో గూగుల్ ఆవిరి చేసిన మంచినీరు 6.1 మిలియన్ గ్యాలన్లు
కరువు ప్రాంతాల్లో పెనుముప్పు
పర్యావరణం పైనా తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ : కృత్రిమ మేధ…అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఎవరి నోట విన్నా వినిపిస్తున్న పేరు. ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక సదస్సులు, సమావేశాలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోనూ దీనిపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. దీనికి ప్రధాని నరేంద్రమోడీ సహా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.
పలు దేశాలకు చెందిన ఏఐ సంస్థల అధినేతలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థల మధ్య వేలకోట్ల రూపాయలు విలువైన ఒప్పందాలు జరిగాయి. ఇదంతా నాణేనికి ఓ వైపు.మరోవైపు ఏఐ చేస్తున్న పర్యావరణ విధ్యంసం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తుంది. భారీగా ఏర్పాటు చేసే ఏఐ డేటా సర్వర్లు శీతల వాతావరణంలోనే పనిచేస్తాయి. వాటిని చల్లబర్చేందుకు బిలియన్ల కొద్దీ గ్యాలన్ల తాజా నీటిని వినియోగిస్తారు. దీనివల్ల మానవాళికి తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందని ఐటీరంగ నిపుణులు చెప్తున్నారు. కరువు కాటకాలతో విలవిలల్లాడే ప్రాంతాల్లో ఏఐ సర్వర్లను ఏర్పాటు చేస్తే, అక్కడి ప్రజలకు మరిన్ని నీటి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
చల్లదనం ఎందుకు?
డేటా సెంటర్లకు చల్లదనం అవస రాన్ని సాంకేతిక నిపుణులు చక్కగా విశ్లేషించారు. కంప్యూటర్లు తీవ్రమైన వేడిని ఉత్పత్తి చేస్తాయి. మీరు ఏఐని ఒక కవిత రాయమనో లేదా ఓ చిత్రాన్ని గీయమనో అడిగితే ఒకేసారి వేలాది ప్రాసెసర్లు పనిచేయాల్సి ఉంటుంది. ఫలితంగా తీవ్రమైన థర్మల్ ఎనర్జీ వెలువడుతుంది. ఆ వేడికి కోట్లాది రూపాయలు ఖరీదు చేసే యంత్రాలు కరిగిపోయే ప్రమాదం ఉంది. దానిని నివారించేందుకే డేటా కేంద్రాలు కూలింగ్ టవర్లను ఉపయోగిస్తాయి. ఈ వ్యవస్థలు ఆవిరైపోయే చల్లదనం ద్వారా పనిచేస్తాయి. వేడిగా ఉన్న ఉపరితలాలపై నీటిని వెదజల్లడం ద్వారా వాతావరణాన్ని చల్లబరుస్తారు. ఈ నీటిలో 80 శాతం ఆవిరి రూపంలో వాతావరణంలో కలిసి పోతుంది. ఆవిరిని రీసైక్లింగ్ చేయలేము కాబట్టి అది స్థానిక నీటి చక్రం నుంచి అదృశ్యమైపోతుంది. అంటే దీనర్థం ఏమిటి? ప్రతి రోజూ మిలియన్ గ్యాలర్ల నీరు ఆవిరైపోతుంది కానీ అందులో ఒక్క చుక్క కూడా తిరిగి ఉపయోగపడదు.
రీసైక్లింగ్ నీరు వాడితే…
టెక్ కంపెనీలు రీసైక్లింగ్ నీరును లేదా కాలుష్య కారక వ్యర్థ జలాలను ఉపయోగించుకోవచ్చు కదా అనే ప్రశ్న సహజం. కానీ నీటిలో సహజంగానే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. శీతలీకరణ ప్రక్రియ ద్వారా నీరు ఆవిరై పోతుంది. అంటే ఈ ఖనిజాలు మరింతగా కేంద్రీకృతమవుతాయన్న మాట. చివరికి అవి లైమ్స్కేల్ (గట్టి సున్నపు నిక్షేపం. ఇది తరచుగా వేడి నీటి కోసం ఉపయోగించే బాయిలర్లు, పైపుల లోపల పేరుకుపోతుంది) అనే గట్టి పెంకును ఏర్పరుస్తాయి. ఇది చాలా హానికరమైనది.
మందపాటి దుప్పటి మాదిరిగా పనిచేస్తూ వేడిని బంధిస్తుంది. పంపులలో ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. రీసైకిల్ చేసిన నీటిలోని ఖనిజాలు ఏఐ డేటా సెంటర్లలోని ఉష్ణ వినిమయాలను నష్టపరుస్తుంది. రీసైకిల్ చేసిన నీటిలో సహజంగానే ఖనిజాలు అధికంగా ఉంటాయి. కాబట్టి అది మొదటి నుంచే తన ప్రభావాన్ని చూపుతుంది. ఆ నీటిని సురక్షితంగా ఉపయోగించాలంటే కంపెనీలు పెద్ద ఎత్తున ఆన్-సైట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో ఒక శాతం కంటే తక్కువ నీరే రీసైక్లింగ్ అవుతోంది. రీసైక్లింగ్ అయిన నీటిని పారిశ్రామిక ప్రాంతాలకు అందించే మౌలిక సదుపాయాలు కూడా అనేక నగరాలలో లేవు. కాబట్టి రీసైక్లింగ్ నీటితో పోలిస్తే డేటా సెంటర్లకు మంచి నీరే చౌకగా లభిస్తోంది.
చల్లదనం ఉంటేనే పనిచేస్తాయి
డిజిటల్ ప్రపంచం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎందుకు సజావుగా నడుస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా? భారీ గిడ్డంగులలో నిరంతరం పని చేసుకుంటూపోతున్న సర్వర్లే దీనికి కారణం. అయితే అలా పనిచేస్తూ పోవాలంటే చల్లదనం అవసరం. గూగుల్ కంపెనీకి చెందిన డేటా సెంటర్లు ఒక సంవత్సర కాలంలో 6.1 బిలియన్ గ్యాలన్ల తాజా నీటిని వినియోగించుకున్నాయని ఆ సంస్థకు చెందిన పర్యావరణ నివేదిక (2024) తెలిపింది. నీటి వినియోగం యదార్థమేనని ఆ టెక్ దిగ్గజ సంస్థ అంగీకరించింది. 2014తో పోల్చినప్పుడు గూగుల్ డేటా సెంటర్లు 2023లో వాడుకున్న నీటి వినియోగం 17 శాతం పెరిగింది. అదే సమయంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని ఆ నివేదిక తెలియజేసింది.
సముద్రంలో నీటి చుక్క కాదు
ఈ నీటి వినియోగాన్ని కేవలం సముద్రంలో ఓ నీటి చుక్కగా చూడకూడదు. అమెరికా నైరుతి ప్రాంతంలో ఉన్న 41 గోల్ఫ్ కోర్సులకు నీటి పారుదల సౌకర్యం కల్పించేందుకు ఏటా ఎంత నీరు అవసరం అవుతుందో ఆ పరిమాణంలో నీటిని గూగుల్ డేటా సెంటర్లు వాడుకుంటున్నాయి. కృత్రిమ మేధ దిశగా సాంకేతిక పరిజ్ఞానం పరివర్తన చెందుతున్న తరుణంలో సర్వర్ల నీటి ‘దాహాన్ని’ తీర్చడం నానాటికీ కష్టమవుతోంది.
పర్యావరణంపై ప్రభావం
కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం కోసం డేటా సెంటర్లు మంచి నీటిని అధిక పరిమాణంలో వినియోగించడం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. మోర్గాన్ స్టాన్లే నివేదిక ప్రకారం ఏఐ డేటా సెంటర్ల నీటి వినియోగం 2028 నాటికి 11 రెట్లు పెరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లోనే డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏఐ సర్వర్లను చల్లగా ఉంచడం కోసం మంచి నీటికి పెరుగుతున్న డిమాండ్ కరువు పీడిత ప్రాంతాలలో నీటి సరఫరాకు ముప్పును కలిగిస్తోంది. కృత్రిమ మేధ మన జీవితాలతో పెనవేసుకుపోతున్న కొద్దీ మనకు అత్యంత విలువైన సహజ వనరులపై ఒత్తిడి మరింత తీవ్రమవుతోంది.



