నిజమే మరి.. బీహార్‌లో అరవై ఐదు లక్షలు, పశ్చిమ బెంగాల్ తొంభై లక్షలకు పైగా ఓట్ల తొలగింపు, పరిస్థితులను, పరిణామాలను చూసిన వారెవరికైనా తెలంగాణలో ‘సర్’ అంటే వణుకు పుట్టటంలో ఆశ్చర్యం లేదు. జూన్ 25 గురువారం నుంచి రాష్ట్రంలో ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో ఎన్ని వింతలు, విశేషాలు చూడాల్సి వస్తుందో. ‘ఏ ఒక్క కులాన్నిగాని, మతాన్ని గానీ సర్ ద్వారా టార్గెట్ చేయబోం.. అర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రసక్తే లేదంటూ ఎన్నికల సంఘం బల్లగుద్ది మరీ చెబుతున్నా.. ఎందుకో నమ్మబుద్ధి కావటం లేదు. దొంగ ఓట్ల తొలగింపు, ఒకే పేరుతో అనేక చోట్ల ఉన్న ఓట్లను తొలగింపు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు అనేదే సర్ ముఖ్యోద్దేశమని ఉన్నతాధికారులు చెబుతున్నా… దీనికి ఎలాంటి స్పష్టత లేకపోవటం అనేక అనుమానాలను తావిస్తోంది. పైగా బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఓడిపోయిన ప్రముఖులకు వచ్చిన ఓట్లు, ఆయా నియోజక వర్గాల్లో తొలగించిన ఓట్ల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతోంది. కఠినమైన డాక్యుమెం టేషన్ అవసరాల కారణంగా పేదలు, మైనారిటీలు, దళితులు, వలస కార్మికులు తమ ఓట్లను కోల్పోయేలా చేయటానికే సర్‌ను రూపొందించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్లిష్టమైన గుర్తింపు పత్రాలు లేని అట్టడుగు వర్గాలకు ఇది ఆశనిపాతమే. సామూహిక పత్రాల పరిశీలన అనేది ఇక్కడ వారికి రాజ్యాంగమిచ్చిన హక్కును కాలరాయటానికే అని చెప్పక తప్పదు. ఇది ఒకరకంగా ప్రజాస్వామ్యంపై దాడే. ఇది సార్వత్రిక వయోజన ఓటు హక్కును దెబ్బతీస్తుందనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పౌరసత్వాన్ని నిరూపించు కోవాల్సిన భారాన్ని అకస్మాత్తుగా సాధారణ ఓటర్లపైకి నెట్టి, సమాంతరంగా ఎన్‌ఆర్‌సి (జాతీయ పౌర పట్టిక)ని నిర్వహించడానికి సర్‌ను వాడుకుం టున్నారనే మేధా వులు, నిపుణులు హెచ్చరిం చటం గమనార్హం.
ఇప్పుడు తెలంగాణలో ప్రతీ ఒక్క ఇంటికీ ఎన్యుమరేటర్లు మూడు సార్లు వస్తారు, మ్యాపింగ్ చేస్తారంటూ ఈసీ అధికారులు సెలవిస్తున్నారు. కానీ ఇతర రాష్ట్రాల్లో అనుభవ పూర్వకంగా తేలిందే మంటే ఇంటింటి ధృవీకరణ కోసం నిర్దేశించిన అవాస్తవిక, సంక్షిప్త కాలపరిమి తులు భారీ పొరపాట్లకు, సామూహిక ఓటు హక్కు రద్దుకు కారణమవుతున్నాయి. అందువల్ల మొత్తానికి మొత్తంగా సర్‌నే రద్దు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. మరోవైపు సర్ లో ఉన్న కుట్రలు, కుతంత్రాల వల్ల ఒక్క ఓటు మాత్రమే కాదు.. ఆ తర్వాత ఆధార్, రేషన్ కార్డు, ఆఖరికి దేశ పౌరసత్వానికే గండిపడే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే దీన్ని కేవలం ఓటు వరకే పరిమితం చేస్తే మనం పప్పులో కాలేసినట్టే.
ఈ తతంగం వెనుక కేంద్రంలోని బీజేపీ కుట్ర దాగుంది. గత పన్నెండేండ్లుగా దేశంలోని ప్రజలను కులం పేర, మతం పేర, ప్రాంతీయ విద్వేషాల పేరిట మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటోంది. దాని కుయుక్తులపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకు తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నుంచి మొదలు పెడితే అన్ని రాష్ట్రాల్లోనూ ధర్నా చౌక్‌లు దద్దరిల్లుతున్నాయి. పెట్రో ధరలు పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా సామాన్యుడి బతుకు ఛిన్నాభిన్నమవుతోంది.
బతుకు బండిని లాగలేక సగటు మనిషి విలవిల్లాడుతున్నాడు. పేపర్ లీకేజీతో నీట్ అభ్యర్థులు రోడ్డెక్కారు. వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. డాలర్‌తో రూపాయి విలువ నానాటికీ పతమవుతూ నేల చూపులు చూస్తోంది. ఇలాంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ నానా తంటాలూ పడుతోంది.
అందువల్ల తమ వ్యతిరేక ఓట్లు ఎక్కడెక్కడున్నాయో గుర్తించి, వాటిని తొలగించటం ద్వారా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అది సర్వశక్తలూ ఒడ్డుతోంది. అందులో భాగంగా ముందుకొచ్చిందే సర్… అని రాజ్యాంగ నిపుణులు చెబుతున్న మాట. పలు రాష్ట్రాల్లో లక్షలాది మంది తమ ఓటు పోయిందంటూ కోర్టులకెక్కితే… ‘ఎన్నికలు పూర్తయ్యాకే, మీ ఓటు ఉందో లేదో తేలుతుందంటూ’ న్యాయస్థానాలు ప్రవచించటం విడ్డూరం. అందువల్ల సర్ పై అత్యంత జాగరూకతతో ఉండాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే… ఇది ఈ దేశంలో పౌరులుగా ఉండాలా? లేదా? అనేది తేల్చబోయే ప్రక్రియ కాబట్టి.
‘సర్’వత్రా.. ఆందోళన…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



